Home News Stories

మార్కాపురంలో వింత రాజకీయం…

SHARE

ప్రకాశం జిల్లలో మార్కాపురం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. చీమకుర్తి గ్రానైట్,పలకలకు ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతంలో రాజకీయం విచిత్రదోరణిలో ఉంది. ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలో ముగ్గురు కీలకమైన నాయకులున్నారు. ఇక్కడ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా మరో నేత సహకరించే పరిస్థితి లేదు. వారు సహకరించకుంటే ఓటమి ఖాయమన్న భయం రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ,వైసీపీలో ఉంది ఎవరికి టిక్కెట్ దక్కకున్న పక్క పార్టీకి సహకరిస్తారన్న వార్నింగ్ లతో మార్కాపురంలో వింతరాజకీయం నడుస్తుంది…మార్కాపురం పొలిటికల్ సినారియో పై తెలుగు పాపులర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్….

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మార్కాపురం రాజకీయం వేడెక్కింది. ఇక్కడ టిక్కెట్ దక్కని నేతల వార్నింగ్ లతోనే ప్రధాన పార్టీలు కుదేలైపోతున్నాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే ఇక్కడ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ కి గట్టి పట్టుంది. 2004 లో కాంగ్రెస్ విజయం సాధించగా 2009లో టీడీపీ విక్టరీ కొట్టింది. 2014లో వైసీపీ వశమైంది మార్కాపురం. ఇక్కడి నుంచి జంకె వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మరో వైసీపీ నేత 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కేపి కొండారెడ్డి. సీనియర్ నేత కావడం, బలమైన ఓటు బ్యాంకు ఈయన సొంతం కావడంతో వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది ఇక్కడ వైసీపీకి ప్రధాన సమస్య.

వైసీపీ నుంచి జంకె వెంకటరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది. ప్రజాదరణ గల నేతగానూ, మృదు స్వభావిగానూ ఆయనకు పేరుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నాలుగున్నరేళ్లుగా మార్కాపురం నియోజకవర్గానికి పెద్దగా నిధులు తేలేకపోయారు. అది ఒక్కటే ఆయనకు మైనస్ పాయింట్. అయితే జంకె వెంకటరెడ్డికి సమీప బంధువైన కెపి కొండారెడ్డి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు మండాలాల్లో ప్రభావం చూపే శక్తి ఉంది. దీంతో కేపీ కొండారెడ్డికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే టిక్కెట్ గ్యారంటీ అని హామీ ఇచ్చింది. అయితే ఆయన మాత్రం వైసీపీలోనే ఉండి టెక్కెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

2009లో ఇక్కడ విజయం సాధించిన కందుల నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కందుల అభ్యర్ధిత్వం పై సైకిల్ పార్టీ అంత సానుకూలంగ లేకపోవడం ఆ పార్టీకి సమస్యగా పరిణమించింది. అయితే ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన ఓటు బ్యాంకు ఉండటంతో ఆయన గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో పది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయిన కందుల నారాయణరెడ్డి తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. టిక్కెట్ కన్ఫర్మ్ కాకుంటే ఆయన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో చేతులు కలుపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా… ఇవ్వకపోయినా మరో నేత సహకరించే పరిస్థితి లేదు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ రెడ్డిని బరిలోకి దింపాలని ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. కందుల నారాయణరెడ్డికి టీడీపీ టిక్కెట్ దక్కకుంటే ఆయన ప్రత్యర్థి పార్టీ వైసీపీ అభ్యర్థితో తప్పకుండా చేతులు కలుపుతారన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే వైసీపీలో కూడా జంకె వెంకటరెడ్డికి టిక్కెట్ ఇస్తే కేపీ కొండారెడ్డి సహకరిస్తారా? లేదా? అన్నది కూడా అనుమానమే. దీంతో రెండు ప్రధాన పార్టీల అధినేతలు మార్కాపురం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేనకి ఇక్కడ పెద్దగా చాన్స్ లేనట్లు తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు సహకరించేపరిస్థితి లేకపోవడంతో మార్కాపురంలో వింతరాజకీయం నడుస్తుంది.