Home News Stories

సెటిలర్ల అడ్డాలో జెండా పాతేదెవరు…?

SHARE

ప్రధాన పార్టీల్లో కీలక నాయకులందరికీ హాట్‌ ఫేవరెట్ లాంటి నియోజకవర్గం. అధికార పార్టీ అభ్యర్థిని మార్చింది. ప్రజా కూటమి తరపున ఊహించని రీతిలో టీజేఎస్ అభ్యర్థి రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో తృటిలో తప్పిపోయిన విజయాన్ని ఈసారి కొట్టేయాలని భావిస్తోంది కమలదళం. తెలంగాణ, సీమాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు భారీగా ఉండటంతో ఏ పార్టీకి ఆధిపత్యం లేని పరిస్థితి. హైదరాబాద్‌లో సెటిలర్ల అడ్డా మల్కాజ్ గిరిలో విజయ పతాక ఎగరేసేది ఎవరు?


రాష్ట్రంలో రాజకీయనేతల కళ్లన్నీ ఆ నియోజకవర్గంపైనే. సీమాంధ్ర నేతలు, తెలంగాణ నేతలు.. పార్టీ ఏదైనా సరే… అందరికీ అదే హాట్ ఫేవరెట్‌. పార్టీ అధినేతల నుంచి.. ద్వితీయశ్రేణి నేతలు కూడా సేఫ్ ప్లేస్ అని భావించే సెగ్మెంట్. పార్లమెంట్ కే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులందరికీ హాట్ కేక్ గా కనిపిస్తోంది మల్కాజ్ గిరి. మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే మల్కాజ్‌ గిరి అసెంబ్లీ నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. నియోజకవర్గంలో రెడ్డి, బ్రాహ్మణ, ముదిరాజ్‌, యాదవ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. జీహెచ్‌ఎంసీలోని డిఫెన్స్‌ కాలనీ, వినాయక నగర్‌, మౌలాలీ, ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌, మల్కాజ్‌గిరి, గౌతం నగర్‌, అల్వాల్‌, మచ్చ బొల్లారం, వెంకటాపురం డివిజన్లు ఈ సెగ్మెంట్‌ పరిధిలో ఉన్నాయి.


మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడక ముందు ఈ ప్రాంతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉండేది. పూర్వకాలంలో ఇక్కడ మల్లికార్జునస్వామి దేవాలయం ఉండేది. దాంతో ఈ ప్రాంతాన్ని మల్లికార్జున గిరిగా పిలిచేవారు. కాలక్రమంలో మల్కాజ్ గిరిగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామంగా ఉండే ఈ ప్రాంతం.. నగరం విస్తరించడంతో హైదరాబాద్‌లో కలిసిపోయింది. నగరీకరణ పెరిగిన తర్వాత 1981లో మున్సిపాలిటీగా అవతరించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గ్రేటర్‌లో విలీనమైంది…. గ్రేటర్ పరిధి 24 నియోజకవర్గాలు ఉన్నా… మల్కాజ్ గిరికున్న క్రేజ్ వేరు. సెగ్మెంట్ లో మొత్తం ఓటర్లు 4 లక్షల 16 వేల మంది. పురుష ఓటర్లు 2 లక్షల 16 వేలు. మహిళా ఓటర్లు 2 లక్షలకు పైగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు, విద్యార్ధులున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న వారూ ఎక్కువే. ఇది చిన్నసైజ్‌ మినీ ఇండియా అనుకోవచ్చు.

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ఆకుల రాజేందర్ విజయఢంకా మోగించారు. పీఆర్పీ నుంచి పోటీ చేసిన చింతల కనకారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2011లో పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో… చింతల కనకారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజేందర్‌కు కాకుండా నందికంటి శ్రీధర్‌కు దక్కింది. బీజేపీ తరపున పోటీ చేసిన న్యాయవాది రాం చందర్‌రావు కనకారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కనకారెడ్డి 2,680 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ మూడో స్థానానికే పరిమితమయ్యారు….

తొలిదశలో 105 మందికి సీట్లిచ్చిన టీఆర్ఎస్ నాయకత్వం… మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఈ టికెట్ కోసం గులాబీ పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడింది. టికెట్ తనకంటే తనకంటూ ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కనకారెడ్డి ప్రచారానికి దిగారు. దీంతో మల్కాజిగిరిలో పార్టీ రెండుగా చీలిపోయింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు ముఖ్యనేతలు ఉన్నారు. కనకారెడ్డితో పాటు ఎంపీ మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంత రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముగ్గురు ప్రముఖ నేతలున్నా.. ఒకరంటే ఒకరికి పడదనే అభిప్రాయం ఉంది. పార్టీ నేతల మధ్య విబేధాలను గుర్తించిన సీనియర్ నేతలు… అందర్నీ పిలిచి చర్చించారు. దీంతో మైనంపల్లి గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించారు. మైనంపల్లి కూడా నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటించారు.

గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం నగర అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. ఈసారి వాటిని చక్కదిద్దుకుంటే.. మల్కాజిగిరిలో కాషాయ జండా ఎగరేయవచ్చని కమలనాధులు భావిస్తున్నారు. దీంతో రాంచందర్‌రావుకి ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. న్యాయవాది కావడం, పార్టీ నుంచి మద్దతు ఉండటం, ఎమ్మెల్సీగా గెలవడం ఆయనకు సానుకూల అంశాలు. చాలా కాలం నుంచి మల్కాజిగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారాయన. మహాకూటమి అభ్యర్థిగా మల్కాజిగిరి నుంచి టీజేఎస్‌ మల్కాజిగిరి ఇన్‌చార్జి ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ పోటీలోకి దిగారు. ఉద్యమంలో పనిచేసిన జేఏసీ మిత్రులు, మహాకూటమిలోని పార్టీల నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు.


మల్కాజిగిరిలో అన్ని ప్రాంతాల ప్రజలు ఉండటంతో.. ఏ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంక్ లేదు. ఓటర్లు ఎప్పుడు ఎలా స్పందిస్తారనేది నేతలకు అర్థం కాని పరిస్థితి. అందుకే అభ్యర్థులంతా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నారు. ఈసారి ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఎమ్మెల్సీలుగా పని చేస్తున్న వాళ్లు. చేసిన వాళ్లే కావడం విశేషం. ఇక్కడ మైనంపల్లికే కొంత సానుకూలత ఉన్నప్పటికి ఈసారి ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఏ పార్టీ గెలిచినా సంచలనం బద్దలైనట్లే. …