Home News Stories

మాజీ జేడీ చూపు ఎటువైపు….

SHARE

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో. ఐపిఎస్‌ అధికార హోదాను ఎనిమిదేళ్ళ ముందే వదులుకుని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటన పూర్తి చేసిన లక్ష్మీనారాయణ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో పొలిటికల్ వార్ కి సిద్దమయ్యారు. దీంతో ఈ సీబీఐ మాజీ బాస్ రాజకీయ ప్రస్థానం ఎటువైపు అన్న సస్పెన్ష్ నడుస్తుంది…..

లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ పెడతారా లేక ఏ పార్టీలోనైనా చేరతారా అన్నది క్లారిటీ లేనప్పటికి ప్రస్తుత పరిస్థితుల్లో ఓ పార్టీ నెలకొల్పి దాన్ని నిర్వహించడం ఆర్థిక రీత్యా అంత ఆషామాషీకాదు. లక్ష్యాలు, ఆశయాలు మాత్రమే పార్టీని బ్రతికించలేవు. గతంలో ఐఏఎస్‌ అధికార హోదాకు రాజీనామా చేసి డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ లోక్‌సత్తా పేరిట పార్టీ నెలకొల్పారు. విద్యావంతులు, వివిధ వర్గాలకు చెందిన మేథావులు ఆయనకు మద్దుతుగా నిలిచినా ఆయనొక్కరే అతి కష్టం మీద ఎమ్మెల్యే అయ్యారు. తన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు అడ్రస్ లేకుండా పోయారు. ఇక ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేసి, అపార రాజకీయ అనుభవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విభజన అనంతరం నెలకొల్పిన పార్టీ ఏమైందో ఇంక ఎవరు మర్చిపోలేదు. రాజకీయాలంటేనే ధనబలం, జనబలం, కుట్రలు, కుతంత్రాలు, శతృవుల్ని అన్ని విధాలా ఎదుర్కొనే శక్తి, యుక్తులు తప్పవని స్పష్టమైంది.

సంప్రదాయ రాజకీయవాదులకు భిన్నంగా లక్ష్మీనారాయణ వ్యవహారశైలి ఉంటుంది. ఈ దశలో లక్ష్మీనారాయణకు సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు కంటే ఏదొక పార్టీలో చేరి తన ఆశయాలు, లక్ష్యాల్ని సాధించడమే మేలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కొన్ని జాతీయ పార్టీల నుంచి ఆహ్వానాలందినట్లు సమాచారం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ జేడీ చూపు ఎటువైపు…

ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న పార్టీల్లో వైసీపీ,టీడీపీ,జనసేన ఉండగా ఫ్యాన్ పార్టీ పొడ కుడా ఈ మాజీ సీబీఐ బాస్ కు నచ్చదు. ఇక తెలుగుదేశం, జనసేనలే మిగిలున్నాయి. తెలుగుదేశం వంటి పార్టీలో ఆయనకు అవకాశం లభించినా సిద్దాంతపరంగా ఆయన విధానాల్ని పార్టీ ఆమోదించదు. ఇక మిగిలింది జనసేన. ఇప్పుడున్న రాజకీయలకు ప్రత్యమ్నాయ వేదికంటూ ఏర్పడిన జనసేన వైపు లక్ష్మీనారాయణ మొగ్గు చూపోచ్చు.

రాయలసీమలో అధిక సంఖ్యాక వర్గాలుగా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనారాయణ ఆ నాలుగు జిల్లాల్లో జనసేన పటిష్టతకు ఉపకరిస్తారు. ఆ దిశగా జనసేనాని కూడా ఈ మాజీ సీబీఐ బాస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఆయనకు జనసేనలో కీలక బాధ్యతలప్పగించడం ద్వారా రాయలసీమలో పార్టీ మరింత పట్టుబిగించే అవకాశం ఉందని పవన్ ఆలోచిస్తున్నట్లు టాక్ .