Home News Politics

మహాకూటమిలో సీట్ల సర్దుబాటుకు అడ్డుపడుతున్నదెవరు…..!

SHARE

కేసీఆర్ ని గద్దెదించటమే లక్ష్యంగా జట్టు కట్టిన మహాకూటమిలో ఏం జరుగుతుంది. ఎకాఎకినా 105 మంది అభ్యర్ధులను ప్రకటించి కారుపార్టీ జోరుగా ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకా సీట్ల సంగతి తేల్చకుండా నాన్చుతుంది ఎవరు…అసలు కూటమిలో ఉన్న టీడీపీ డోంట్‌ వర్రీ అన్నట్లున్నా…టెన్షనంతా టీజేఎస్, సీపీఐలకేనా? ఇంత ఒత్తిడి చేస్తున్న హస్తం పార్టీ సీట్ల విషయంలో ఎందుకు కూల్‌గా ఉంది? దసరా తర్వాతే సీట్ల సర్దుబాటు కొలిక్కి రాబోతోందా?

సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీనే నానుస్తోందా? పెద్దన్న పాత్ర పోషిస్తూ తెలంగాణలో మహాకూటమికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌…సీట్ల సర్దుబాటుపై మాత్రం తొందరముందన్నట్లే ఉంది. ఇప్పటికే కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై చర్చలు జరిగాయి. ఉమ్మడి కార్యాచరణపై ఒక అవగాహన వచ్చింది..అయితే సీట్ల సర్దుబాటుపై మాత్రం కాంగ్రెస్ ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో కూటమిలో ఉన్న టీజేఎస్, సీపీఐలకు టెన్షన్ పట్టుకుంది. కాంగ్రెస్ ఎందుకు ఆలస్యం చేస్తోంది..ఎందుకు దాటవేస్తూ పోతోందన్న అనుమానం కూటమిలోని పార్టీలకొస్తోంది.

ఒకవైపు మేనిఫెస్టో రెడీ చేస్తూ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కాంగ్రెస్‌ చెప్పుకొస్తోంది. చాలాచోట్ల కాంగ్రెస్‌ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ప్రచార షెడ్యూల్ విడుదల చేసింది. కానీ కూటమిలో ఉన్న పార్టీలకు సీట్ల సర్దుబాటుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా నానుస్తోంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ పెద్దగా ఆందోళన పడటం లేదు. కానీ టీజేఎస్, సీపీఐ మాత్రం ఇంకెన్నాళ్లీ సస్పెన్స్ అన్నట్లు అసహనంతో ఉన్నాయి. 11 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ముందస్తుగానే ఓ జాబితా విడుదల చేసినా…ఆ పార్టీకి మూడునుంచి ఐదు సీట్లు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అలాగే సీట్ల విషయంలో మొదట్లో మొండి పట్టుబట్టిన టీజేఎస్ కూడా ఒక మెట్టు దిగడానికి సిద్ధమైంది. అయితే సీట్ల సర్దుబాటు విషయాన్ని త్వరగా తేల్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతను ప్రొఫెసర్‌ కోరితే…నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఆలస్యమైందనీ…ఏదో ఒకటి రెండుమూడ్రోజుల్లో తేల్చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్ పెద్దలకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాలుగైదు రోజులని కాంగ్రెస్‌ పార్టీ చెబుతున్నా…సీట్ల సర్దుబాటు తేలేందుకు మరో వారం రోజులైనా పట్టేలా ఉందంటున్నారు. దసరా తర్వాత లేదా అక్టోబర్ చివరివారంలో సీట్ల విషయంలో కాంగ్రెస్‌ క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది. సీట్ల విషయంలో ఆలస్యం జరిగితే చివరి నిమిషంలో ఎన్ని ఇచ్చినా సర్దుకోవాల్సి వస్తుందని టీజేఎస్ ,సీపీఐ టెన్షన్ పడుతున్నాయి. కూటమిలో ఉన్న కాంగ్రెస్ మొదటి లిస్ట్‌పై కసరత్తు చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తే …తామెప్పుడు ప్రచారం చేసుకోవాలి.. ఏ నియోజకవర్గాల్లో చేసుకోవాలనే డైలామాలో ఉన్నాయి కూటమి పార్టీలు. పెద్దన్న పాత్ర పోషిస్తున్న హస్తం పార్టీ… సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని ఎప్పటికి కొలిక్కితెస్తుందో మరి.