Home News Politics

మహా కూటమిలో అంతుపట్టని సీట్ల లెక్కలు….

SHARE

తెలంగాణ ఎన్నికల డేట్లు ఫిక్సయ్యాయి. ఒక పక్క అధికార పార్టీ నెల రోజుల ముందే 105 మంది అభ్యర్ధులను ప్రకటించి ఒక విడత ప్రచారాన్ని చుట్టేసింది. ఇక మిగిలున్న 14 మంది అభ్యర్ధుల జాబితాను రేపోమాపో ప్రకటించనున్న గులాబీ దళపతి స్వయంగా అభ్యర్ధులతో మాట్లాడుతూ ప్రచారసరళిని పర్యవేక్షిస్తున్నాడు. ఇలా కారు పార్టి రయ్యిన దూసూకు పోతుంటే మహాకుటమిలో పార్టీలు ఇంకా సీట్ల లెక్కలు తేల్చే పనిలోనే ఉన్నాయి. ఇంత వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దాని పై కూడా క్లారిటీ లేకుండా కాలయాపన చేస్తున్నాయి…

టీఆర్ఎస్ పార్టీని గద్దె దించలాన్న మెయిన్ స్ట్రీమ్ తో కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ దిశగా మహాకూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటు పై డజనుకు పైగా మీటింగ్ లు పూర్తి చేసింది. అయినా ఒక నిర్ణయానికి మాత్రం రాలేదు. . కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, టీజేఎస్, టీడీపీ, సీపీఐ ఎక్కువ స్థానాలు ఆశిస్తుండటంతో సీట్ల సర్దుబాటు చర్చల్లో ప్రతిస్టంభన ఏర్పడింది. ఇక టీడీపీ మొదట 25 స్థానాలు అడిగినా.. పార్టీ అధినేత చంద్రబాబు సూచనతో ఇప్పుడు 15 సీట్లు చాలు అంటున్నట్లు తెలుస్తోంది. ఇక 35 సీట్లతో చర్చలు మొదలుపెట్టిన తెలంగాణ జన సమితి ఇప్పుడు 25కి తగ్గింది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ ఈ ఎన్నికల్లో ఏకంగా 16 సీట్లు అడిగింది. 12కి తగ్గితే కుదరదు అని చెబుతోంది. అంటే, ఈ మూడు పార్టీలకు 52 స్థానాలు పోతే కాంగ్రెస్ కి మిగిలేది కేవలం 67 సీట్లు మాత్రమే. ఇందుకు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితిలో లేదు.

ఎక్కువ సీట్ల డిమాండ్ తో మొదట్లో కూటమిలో పొరపొచ్చాలు వచ్చాయి. టీజేఎస్ ఏకంగా 25 సీట్లు డిమాండ్ చేయడం లేకపోతే తనదారి తాను చూసుకుంటా అంటూ కోదండరామ్ హూంకరింపులు. ఒక దశలో కోదండరామ్ కాషాయ దళంతో టఛ్ లోకి వెళ్ళారన్న ప్రచారం వెరసి కొంత ప్రతిష్ఠంభన ఏర్పడింది. వాస్తవంగా చూసుకున్న ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్ధులతో పాటు అంత సీన్ లేదు. టీజేఎస్, సీపీఐ, టీడీపీ అడిగినన్ని స్థానాల్లో ఆ పార్టీలకు బలం లేదని, అక్కడ వారికి టిక్కెట్లు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఆయా పార్టీలను బుజ్జగించి తక్కువ స్థానాలు అడగాలని కోరుతోంది. మళ్ళీ గులాబీ దళాన్ని మట్టి కరిపించాలన్న లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకుని మహాకూటమి తప్పదని ఆ పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.

టీడీపీ గత ఎన్నికల్లో ప్రభావం చూపిన గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలలో ఐదు సీట్లతో పాటు , ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మరో ఏడు స్థానాలను ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక టీజేఎస్ కి ఆరు స్థానాలకు మించి ఇవ్వలేమని హస్తం పార్టీ నిర్ణయించింది. ఇక సీపీఐకి కూడా మూడు నుంచి ఐదు స్థానాల కంటే సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇక కూటమిలో పార్టీలు ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలన్న దానిపై కూడా సందిగ్ధత నెలకొంది.

మహాకూటమిలోని పార్టీల అధినేతల పోటీపై కూడా కన్ ఫ్యూజన్ నడుస్తుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ సొంత నియోజకవర్గం జగిత్యాల. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన్ని కోరుట్ల నుంచి బరిలో దిగాల్సిందిగా కాంగ్రెస్ కోరుతున్నా ఆయన ఆసక్తిగా లేరని సమాచారం. ఇక కూకట్ పల్లి నుంచి రమణ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పోటీపై కూడా క్లారిటీ రాలేదు. ఆయన మొదట జనగామ, వరంగల్ వెస్ట్, ఉప్పల్, మంచిర్యాల లో ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే జనగామలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయనున్నారు. ఇక వరంగల్ వెస్ట్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వర్గం నేత వేం నరేందర్ రెడ్డి టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇక నర్సంపేట టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్న రేవూరి ప్రకాశ్ రెడ్డిని కూడా ఇక్కడకు మార్చే అవకాశం ఉంది.

ఇప్పటికే ఉప్పల్ టిక్కెట్ తనదే అన్న ధీమాతో ఉన్న దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రచారం కూడా ప్రారంభించారు. మంచిర్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో కోదండరాం పోటీ చేయాలనుకుంటున్న స్థానాల్లో క్లారిటీ లేకుండా పోయింది. . ఇక సీపీఐ తెలంగాణ అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డిది ఇదే పరిస్థితి ఆయన హుస్నాబాద్ నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించారు. దీంతో అదే టిక్కెట్ ఆశిస్తుండగా… అక్కడ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రచారం కూడా ప్రారంభించేశారు.

ఈవిధంగా పొత్తులు, టిక్కెట్ల విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నమహాకుటమి ప్రచారం ఎప్పుడన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఇక కాంగ్రెస్ బరిలో దిగే స్థానాల్లో ఒక 30 మినహా మిగిలిన సీట్ల కోసం పార్టీ నుంచే నియోజకవర్గానికి పది మంది ఆశవహులున్నారు. ఇవన్ని తేలేసరికి ఇంకా ఎన్ని అసంతృప్తులు, అలక పాన్పులు, ఆగ్రహజ్వాలలు రేగుతాయో అని నేతలు ఆందోళన చెందుతున్నారు.