Home News Stories

బందర్ లో సైకిల్ స్పీడ్ కి అడ్డేవరు…!

SHARE

ఉద్యమాల పురిటిగడ్డ కృష్ణాజిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్ అత్యంత కీలకమైంది. జిల్లా ప్రధాన కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో పాగా వేయటానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. బీసీ, కాపు, ఎస్సీఎస్టీ వర్గాల ఓట్లు కీలకంగా ఉన్న మచిలీపట్నం పార్లమెంట్ లో విజయం సాధించాలంటే అన్ని వర్గాలకు దగ్గరవ్వాల్సిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. విజయపరంపర కొనసాగించటానికి టీడీపీ, బోణీ కొట్టడానికి వైసీపీ, జనసేనలు సిద్ధమయ్యాయి. స్వాతంత్ర్య ఉద్యమ సమయం నుంచి జై ఆంధ్ర ఉద్యమం వరకు అనేక కీలక సమావేశాలకు మచిలీపట్నం వేదికైంది.బందర్ పార్లమెంట్ సీటు పై స్పెషల్ రిపోర్ట్.

ఇప్పటి వరకు జరిగిన 16 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ 9సార్లు, టీడీపీ 6 సార్లు గెలిచి తమ సత్తా చాటాయి. గత రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధించిన టీడీపీ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయన హ్యాట్రిక్ పై కన్నేశారు. వైసీపీ బోణీ కొట్టాలని చూస్తుంటే జనసేన ఉనికిని చాటుకునే ప్రయత్నాలను బందరు పార్లమెంట్ పరిధిలో చేస్తోంది. కృష్ణాజిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో హెడ్ క్వార్టర్ గా ఉన్న మచిలీపట్నం ఒకటి. సుమారు 14 లక్షల మంది ఓటర్లు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. మత్సకారులు, వెనుకబడిన వర్గాలు, ఎస్సీఎస్టీలు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. ఎన్టీఆర్, ఎఎన్నార్, మండలి వెంకట కృష్ణారావు వంటి అనేక ప్రముఖుల పుట్టినిల్లు కూడా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మచిలీపట్నం, పామర్రు, పెడన, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజక వర్గాలు ఉన్నాయి.

మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిగా టీడీపీ నుంచి మూడోసారి బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణ. బీసీ వర్గానికి చెందిన కొనకళ్ళ వర్గానికి స్థానికంగా పట్టుంది. మచిలీపట్నానికే చెందిన నారాయణకు అన్ని వర్గాల వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009లో తొలిసారి ఎన్నికైనపుడు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బాడిగ రామకృష్ణపై కొనకళ్ల గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పార్ధసారధి మీద విజయం సాధించారు. తొలిసారి గెలిచినపుడు కేవలం 12 వేల మెజార్టీతో గెలిచిన కొనకళ్ళ గత ఎన్నికల్లో 81 వేల మెజార్టీతో సాధించారు. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచిన మాగంటి అంకినీడు, కావూరి సాంబశివరావులు మాత్రమే రెండుసార్లు వరుసగా మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. అయితే మూడోసారి వరుసగా గెలవటం ద్వారా హ్యట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలనే ఆలోచనలో కొనకళ్ళ వర్గం ఉంది. స్థానికుడు కావటంతోపాటు హోదా ఉద్యమం, బందరు పోర్టు నిర్మాణ పనులు, పేదలకు నియోజక వర్గంలో ఇళ్ళ కేటాయింపు, పసుపు కుంకుమ, మంచినీటి సౌకర్యం, వివాద రహితుడు, బీసీ వర్గానికి చెందిన నేత కొనకళ్ళ కావటంతో టీడీపీ కలిసి వస్తోంది.

మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె టీడీపీలోకి చేరటంతో టీడీపీ బలం పార్లమెంట్ పరిధిలో మరింత పెరిగింది. జనసేన వల్ల చీలే అవకాశం ఉన్న ఒట్లు కూడా బాడిగ చేరికతో టీడీపీకి సపోర్టుగా మారుతుందనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికల్లో గుడివాడ, పామర్రులో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మిగతా 5 నియోజక వర్గాల్లో టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో గుడివాడలో ఒక్కచోటే తక్కువ ఓట్లు పడటంతో ఈసారి అక్కడ దేవినేని అవినాష్ ను బరిలోకి దింపటం, పామర్రులో వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పనను టీడీపీ నుంచి బరిలోకి దింపటంతో అక్కడ కూడా ఈసారి ఓటు బ్యాంకు పెరుగుతుందనే భావనలో టీడీపీ ఉంది.

ఇక వైసీపీ విషయానికి వస్తే వల్లభనేని బలశౌరిని ఎంపీ అభ్యర్ధిగా బరిలో దింపింది. 2004 నుంచి 2009 వరకు తెనాలి ఎంపీగా పనిచేసిన బాలసౌరి గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు. పదేళ్ళు ఎంపీగా ఉన్న టీడీపీ అభ్యర్ధి కొనకళ్ళపై ఉండే వ్యతిరేకతను తమను కలిసి వస్తుందని వైసీపీ భావిస్తోంది. ప్రత్యేక హోదా పార్టీ స్టాండ్ కాబట్టి ఖచ్చితంగా ఎంపీని గెలిపిస్తే హోదా సాధన జరుగుతుంది కాబట్టి అదే విషయాన్ని ప్రజల్లొకి తీసుకెళ్ళ ప్రయత్నం వైసీపీ చేస్తోంది. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజక వర్గాల్లో గత ఎన్నికల్లో గుడివాడ, పామర్రు స్థానాలు మాత్రమే వైసీపీ గెలిచింది.

ఈ రెండింటిలో కూడా గుడివాడలో మాత్రమే వైసీపీకి పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. పామర్రులో వైసీపీ గెలిచినా 342 ఓట్లు టీడీపీ ఎంపీ అభ్యర్ధికే మెజారిటి వచ్చింది. దీంతో మొత్తం అన్ని స్థానాలపై వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టింది. గన్నవరం, పామర్రు, పెడన, పెనమలూరు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన వైసీపీ మిగతా ముగ్గురికి మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే సీట్లను కేటాయించింది. గన్నవరంలో పార్టీలో చేసిన దాసరి బాలవర్ధనరావు, దాసరి జై రమేష్ లు వైసీపీలో చేరటం కూడా అక్కడ లాభిస్తుందని వైసీపీ భావిస్తోంది. ఇక వైసీపీ అభ్యర్థిగా ఉన్న బాలసౌరి కమ్యూనిటీ కూడా పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ జనసేన ప్రభావం గురించి ఆలోచన చేస్తోంది వైసీపీ.

గత రెండు ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య నడిచిన ఈ పోరులో ఈసారి కొత్తగా జనసేన చేరింది. గత ఎన్నికల్లో కేవలం టీడీపీ అభ్యర్ధికి జనసేన, భాజపాలు మధ్ధతు ఇచ్చాయి. ఈసారి జనసేన బీఎస్పీ, వామపక్షాల మధ్దతుతో సొంతంగా అభ్యర్ధిని బరిలోకి దింపింది. దీనితో టీడీపీ, వైసీపీలపై అది ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. జనసేన ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బండ్రెడ్డి రాముని బరిలోకి దింపింది. ఆయన రాజకీయాల్లోకి కొత్తైనా కూడా కమ్యూనిటీ ఓట్లు చీలే అవకాశాలున్నాయనేది విశ్లేషకులు భావిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం సమయంలో కూడా చీలిన ఓట్ల కారణంగా కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి పాలవగా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణ కేవలం 12 వేల ఒట్లతో బయటపడి విజయం సాధించారు. ప్రస్తుతం పదేళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. జనసేన నుంచి అభ్యర్ధి బరిలోకి దిగటంతోపాటు వైసీపీ అభ్యర్ధి, జనసేన అభ్యర్ధి ఒకే కమ్యూనిటీ కావటంతో అక్కడ చీలే ఓట్ల ప్రభావం వైసీపీ పడే అవకాశాలు ఉన్నాయనేది టీడీపీ అంచనా.

ఈ నేపధ్యంలో గత ఎన్నికల్లో ద్విముఖ పోరుగా ఉన్న బందరు పార్లమెంటు ఈసారి త్రిముఖ పోరుకు చేరుకుంది. దీనితో అన్ని వర్గాల వారికి దగ్గరవటానికి టీడీపీ, వైసీపీ, జనసేన వ్యూహరచన చేస్తున్నాయి. మరి ఈ ఎన్నికల సమయంలో టీడీపీ హ్యాట్రిక్ కొడుతుందా, వైసీపీ బోణీ కొడుతుంతా, జనసేన ఉనికి తెలుస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది