Home Entertainment Cinema

‘మా’ లో నాపేరు ఎందుకొచ్చింది.. చిరు ఫైర్..!

SHARE

‘మా’ నిధుల దుర్వినియోగం కొత్త మలుపు తిరుగుతుంది. ఈ విషయంలో తన పేరు రావడంపై చిరు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఒక ఇంగ్లీష్‌ పేపర్‌లో కథనం ప్రస్తుతం టాలీవుడ్‌ ను షేక్‌ చేస్తోంది. మా ప్రెసిడెంట్‌ శివాజీ రాజా, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌లు ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేశారు అంటూ స్వయంగా సెక్రటరీ అయిన నరేష్‌ చెప్పడంతో వివాదం పెద్దదైంది. చాలా రోజులుగా మా లో నెలకొన్న లుకలుకలు బయట పడ్డాయి. శివాజీ రాజా వర్గంపై నరేష్‌ వర్గం చేస్తున్న విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఈ సమయంలో ముఖ్యంగా వినిపిస్తున్నది సిల్వర్‌ జూబ్లీ వేడుకలు. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో భాగంగా చిరంజీవితో అమెరికాలో ఒక కార్యక్రమం చేయించారు. అమెరికాలో చిరంజీవితో చేయించిన కార్యక్రమంకు రెండు కోట్ల రూపాయలను మొదట మాట్లాడారని, కాని కొన్ని కారణాల వల్ల కోటి రూపాయలు మాత్రమే వచ్చాయి అంటూ నరేష్‌ చెబుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన మిగిలిన డబ్బు ఎక్కడకు వెళ్లిందో తెలుసు అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశాడు.

అదే అదునుగా కొందరు సోషల్‌ మీడియాలో చిరంజీవితో పాటు శివాజీ రాజా మరియు శ్రీకాంత్‌లు ఆ మొత్తం డబ్బును కాజేసినట్లుగా విమర్శలు చేస్తున్నారు. తాను మంచి ఉద్దేశ్యంతో కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తే, తనపై ఇలా బురద జల్లుతున్నారు అంటూ చిరంజీవి సన్నిహితుల వద్ద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కాగా ‘మా’ కోసం ఎన్నో సార్లు ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం చేశాను. ఆ కార్యక్రమాలకు ముందుండి నేను నడిచాను. మా నిధులను తాను దారి మల్లించడం ఏంటీ అంటూ చిరంజీవి కొందరు మా సభ్యుల వద్ద ఆగ్రహాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో తన గురించి తప్పుగా వస్తున్న కథనాలపై ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.