Home News Politics

నామినేషన్ ముహుర్తాలు షురూ…!

SHARE

చేసే కార్యమేదైనా… శుభ ఘడియ చూసుకుని మొదలుపెట్టడం ఆనవాయితీ. ప్రయాణం చేయాలన్నా.. శుభ కార్యాలు తలపెట్టాలన్నా వారం, తిథి, ఘడియ చూడనిదే వెళ్లరు. మరికొందరు ఇళ్లు దాటాలన్నా… టైం చూసుకుని కానీ కాలు బయటపెట్టరు. అలాంటిది.. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు ఏ రోజు.. ఏ సమయానికి నామినేషన్‌ వేస్తే మంచిదంటూ… జ్యోతిష్యులు, పండితుల వద్దకు పరుగులు పెడుతున్నారు.

ఎన్నికల సంగ్రామంలో… నువ్వా నేనా అనే రేంజ్‌లో అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు… అర్ధరాత్రి వరకు ప్రచారం, కార్యకర్తల సమావేశాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇవాళ్టి నుంచి నామినేషన్ల దాఖలు చేయవచ్చన్న నిబంధనలతో … అభ్యర్థులు శుభ ఘడియల కోసం జ్యోతిష్యులు, పండితుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల్లో నామినేషన్ల పర్వం అత్యంత కీలకం. ఈరోజు నుంచి ఈనెల 25 వరకు నామినేషన్లు వేసేందుకు తుదిగడువు ఉంది. ఇంకా ఏడు రోజులు మాత్రమే టైం ఉంది.

ఈ వారం రోజుల్లో మూడు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో… మిగిలింది 4 రోజులు మాత్రమే. ఈ నాలుగు రోజుల్లో ఏ రోజు… ఏ సమయానికి నామినేషన్‌ వేస్తే మంచిది అని ఆరా తీస్తున్నారు అభ్యర్థులు. నమ్మకమున్న… తమకు తెలిసిన పండితులు, జ్యోతిష్యుల వద్దకు ఎలక్షన్‌ బరిలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు తమ జాతకాలు చేతపట్టుకుని వెళ్తున్నారు . నామినేషన్‌ వేసేందుకు ముహూర్తం పెట్టాలని కోరుతున్న వాళ్లు కొందరుంటే… కలిసొచ్చిన దేవాలయాల్లో పూజలు నిర్వహించి.. అటు నుంచి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేయాలని మరికొందరు భావిస్తున్నారు.

నిన్నటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తోంది ఈసీ. అయితే మొదటి రోజు ద్వాదశి మంచి రోజు ఐనప్పటికీ.. కొన్ని చోట్ల నేతలపై క్లారిటీ రాకపోవడం.. బీఫామ్స్‌ అందజేయకపోవడంతో… నామినేషన్లు పెద్దగా దాఖలవలేదు. 21న హోళి, 23న ఫోర్త్‌ సాటర్‌ డే, 24న ఆదివారం కావడంతో… ఈ మూడు రోజులు ఈసీ నామినేషన్లు స్వీకరించదు. దీంతో మిగిలింది నాలుగు రోజులే. మిగిలిన నాలుగు రోజుల్లో రేపు మంగళవారం అశుభంగా భావిస్తారు. నామినేషన్‌ వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇక మిగిలేది మూడు రోజులే. అవి కూడా 20, 22, 25 వ తేదీలు మాత్రమే. ఇందులోనూ… 25 న నామినేషన్లకు చివరి రోజు కావడమే కాకుండా.. మధ్యాహ్నం లోపు దాఖలు చేయాలి. ఏమాత్రం తేడా జరిగినా… బరిలో నిల్చునే అవకాశమే కోల్పోవచ్చు. ఇంత రిస్క్‌ ఎందుకని చివరి రోజు దాకా వేచి చూసే వాళ్లుండరు.

20న చతుర్ధశి, 22న విదియ, 25న పంచమి.. మంచిరోజులు కావున ఈ మూడు రోజుల మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు నేతలు. గ్రహ, జాతకబలాల బట్టి కొంతమంది, ఇష్టదైవమే ఆలంబనగా చేసుకుని మరికొంతమంది అభ్యర్ధులు నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు.