Home News Politics

సెగలు కక్కి సిగపట్లు పడుతున్న కూకట్ పల్లి రాజకీయం…?

SHARE

పోల్‌ క్షేత్రంలో కూకట్‌పల్లి నియోజకవర్గం మినీ ఆంధ్రాను తలపిస్తోంది… ఆంధ్రా నాయకుల దిగుమతి, కులాల వారీ విభజనలతో అక్కడి రాజకీయం రసవత్తరంగా మారుతోంది… ఏపీలోని పొలిటికల్ , క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌ ప్రకారం .. ఇక్కడి పాలిటిక్స్‌ ఉంటాయన్న అభిప్రాయం ఉంది… ఆ క్రమంలో కూకట్‌పల్లిలోని తాజా పరిణామాల పై స్పెషల్‌ స్టోరీ.

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ముందు నుంచి ప్రత్యేకమే… ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువగా ఉండటంతో ఈ సెగ్మెంట్‌లో లెక్కలన్నీ ఏపీ ప్రాంత పరిణామాలను బట్టే ఉంటాయి… సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులను బట్టి కాకుండా పక్క రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ పొలిటికల్‌ సీన్‌ మారిపోతుందన్న అభిప్రాయం ఉంది. వ్యాపార, వాణిజ్య వర్గాలు ఎక్కువగా ఉండటం, యాక్టివిటీస్‌ ఎక్కువగా జరిగే ప్లేస్‌ కావటం, సాఫ్ట్‌వేర్‌ హబ్‌గా ఉండటంతో అన్ని పార్టీలు ఇక్కడ గెలుపును కీలకంగా భావిస్తాయి గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ పై బరిలో దిగిన మాధవరం కృష్ణారావు తేలిగ్గానే గట్టెక్కారు. ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారి ఓట్‌ బ్యాంకే దానికి ప్రధాన కారణం అన్నది తెలిసిన విషయమే… అయితే తర్వాత మాధవరం పార్టీ మారటంతో కొత్త సమీకరణాలకు బీజం పడింది…

టీడీపీ ప్రజా కూటమిలో భాగం కాకముందు వరకు కూకట్‌పల్లి రాజకీయం సైలెంట్‌గానే కనిపించింది … అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా . ప్రజాకూటమి అభ్యర్ధినిగా దివంగత నేత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినిని రంగంలోకి దించటంతో ఎన్నికల సెగ ఒక్కసారిగా రాజుకుంది. కమ్మ సామాజిక వర్గం, ఆంధ్రా ప్రాంతం అన్న అంశం తెర మీదకు వచ్చింది. ఆంధ్రా లెక్కలు బయటపడ్డాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సుహాసిని నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైతే .. ఆమెకు మద్దతుగా ప్రచారానికి ఏపి క్యాబినెట్‌ మంత్రులు ఇప్పటికే కూకట్‌పల్లికి క్యూ కడుతున్నారు

నందమూరి సుహాసినిని గెలిపించే బాధ్యత టిడిపి ముఖ్యులు తమ భుజస్కందాలపై వేసుకున్నారు… ఆమె తరపున ముమ్మర ప్రచారం చేస్తున్నారు… ఇప్పటికే మంత్రి పరిటాల సునీత ప్రచారం చేయగా, అచ్చం నాయుడు, పితాని వంటి ఇతర నేతలు ప్రచారం ప్రారంభిస్తున్నారు… దానిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు మండిపడుతున్నారు … ఏపీ మంత్రివర్గాన్ని నియోజకవర్గంలో మోహరించటం సరైన విధానం కాదని ఫైర్‌ అవుతున్నారు. అటు బీజేపీ కూడా తమ ఆంధ్రా ప్రాంత నాయకులను రంగంలోకి దింపింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు పురంధరేశ్వరి తమ అభ్యర్ధిని గెలిపించేందుకు కష్టపడుతున్నారు.

అయితే ఏపీ నేతల ఎంట్రీ సామాజిక సమీకరణల పరంగా కొత్త లెక్కలకు తెరతీస్తోంది.. ఏ వర్గం ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకుంటున్నారు… కమ్మ సామాజిక వర్గం ముందు నుంచీ టీడీపీకి గట్టి మద్దతుదారు… సుహాసిని కూడా అదే సామాజిక వర్గం నుంచి కావటంతో ఈ నియోజకవర్గంలోని కమ్మ వర్గాలు టీడీపీకే జై కొట్టే అవకాశాలు ఎక్కువ… తెలంగాణలో కాంగ్రెస్‌కు రెడ్డి సామాజిక వర్గం పరంగా గట్టి ఓట్‌ బ్యాంక్‌ ఉంది … కాంగ్రెస్‌ ఇప్పుడు టిడిపికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ… ఏపి పొలిటికల్‌ లెక్కలతో సీన్‌ మారే పరిస్థితి కనిపిస్తోంది..

ఏపీలో రెడ్డి వర్సెస్‌ కమ్మ అన్నట్లు నడుస్తుంటుంది రాజకీయం .. ఆ లెక్కలతో రెడ్డి సామాజికవర్గంలోని కొందరు ముఖ్యులు .. కేటీఆర్‌తో ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ తమ సంఘీభావాన్ని బహిరంగంగా ప్రకటించారు… అప్పటికే కేటీఆర్‌ కత్తిదాడికి గురైన జగన్‌ను ట్విట్టర్‌ ద్వారా పరామర్శించి ఉన్నారు .. దాడి జరిగినప్పుడు సీఎంగా చంద్రబాబు, అక్కడి అధికారులు స్పందించిన తీరును తప్పుబట్టారు… దాంతో జగన్‌కు తనకు మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందన్న సంకేతాలు పంపారు.. ఆ లెక్కన చూసుకుంటే వైసిపి అభిమానుల ఓట్లు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది

తాజాగా జనసేన అభిమానులు కూడా కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ ఒక ర్యాలీని నిర్వహించారు.. ఏపీలో టీడీపీని జనసేన వ్యతిరేకిస్తుండటంతో .. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని ఇక్కడ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నారు .. దాంతో కాపు సామాజికవర్గంలోని పవన్‌కల్యాన్‌ అభిమానులు టిఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపుతారన్న లెక్కలు తెరమీదకు వస్తున్నాయి..

ఇక కూకట్‌పల్లి సెగ్మెంట్లో 50 శాతానికి పైగా ఉన్న బీసీ ఓట్‌ బ్యాంకే ఎవరి విజయానికైనా కీలకం… వారిలో ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన … 26 కులాల బీసీ గుర్తింపును మూడేళ్ళ క్రితం కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేసింది… దాంతో వారంతా అధికార పక్షం పట్ల ఆగ్రహంతో ఉండటంతో.. ఆ ఓట్లు ఎటువైపు పడతాయన్నది సస్పెన్స్‌గా తయారైంది … ఇక ముస్లిం వర్గ ఓట్లను కారు వైపు మళ్లించేందుకు ఎంఐఎం హైకమాండ్ గట్టిగానే పని చేస్తోంది… మాధవరం సభలకు మజ్లీస్‌ నియోజకవర్గ నేతలు హాజరై … టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని సభాముఖంగా తమ వర్గ ప్రజల్ని అభ్యర్ధిస్తున్నారు. షాది ముబారక్‌ వంటి పథకాలు తమకు సానుకూలంగా పని చేస్తాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి లెక్కలు వేసుకుంటున్నారు.

మొత్తమ్మీద కూకట్‌పల్లి ఎన్నికల్లో ఏపీ రాజకీయ వాతావరణం కనిపిస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తోంది.