Home News Politics

కొణతాల,దాడి పోరులో ఎవరి పంతం నెగ్గేనో…!

SHARE

ఆ ఇద్దరిదీ దశాబ్దాల వైరం. ఇద్దరూ వేరు వేరు పార్టీలో ఉంటూ రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఒకరు టీడీపీలో మంత్రిగా ఉంటే మరొకరు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ విశాఖ రూరల్ జిల్లా రాజకీయాలను తమవైపు తిప్పుకున్నారు. ఆ ఇద్దరే దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ. ఈ ఇద్దరూ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే సీటుకు పోటీపడి కత్తులు దూసుకున్నవారే. ఒకరిని ఒకరు ఓడించుకున్నవారే. చిత్రంగా ఇపుడు ఇద్దరూ డైరెక్ట్ గా పోటీ చేయడం లేదు కానీ అంతంటే ఎక్కువగా కష్టపడుతున్నారు. పరోక్షంగా ఒకరి ఓటమి కోసం మరొకరు గట్టిగానే పోరాటం చేస్తున్నారు.

ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తన రాజకీయ జీవితంలో ఎన్నో పిల్లి మొగ్గలు వేసి చివరికి టీడీపీలో ఏ హామీ లేకుండానే చేరిపోయారు. ఆయన కాంగ్రెస్, వైసీపీ, మధ్యలో బీజేపీ, మళ్ళీ వైసీపీ, టీడీపీ ఇలా తన రాజకీయ ప్రయాణంలో పదనిసలు ఎన్నో చేశారు. ఇపుడు ఎటూ అవకాశం లేకపోవడంతో టీడీపీలో చేరిన రామకృష్ణ తనకంటే పక్కా జూనియర్ అయిన వియ్యంకుడు, సిట్టింగ్ అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణని గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. మరో వైపు వైసీపీలో చేరిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు రత్నాకర్ లు ఇద్దరూ వైసీపీ విజయం కోసం చెమటోడుస్తున్నారు. జగన్ అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జి బాధ్యలను దాడికి అప్పగించారు. దాంతో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను గెలిపించేందుకు దాడి గట్టిగా కష్టపడుతున్నారు.

ఇక్కడ జగన్ అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చుకోవడమే కాదు, తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి కొణతాలపై పగ తీర్చుకోవాలన్న కసితో దాడి కుటుంబం మొత్తం పనిచేస్తోంది. కొణతాల వియ్యకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పీలాను ఓడించాలని దాడి కంకణం కట్టుకున్నారు. దాంతో తన పరిచయాలన్నీ కూడా ఆయన పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా ఈ ఇద్దరూ తామే అభ్యర్ధులు అయినట్లుగా అనకాపల్లిలో వూరూ వాడా తిరుగుతున్నారు. ప్రతి గడపా తొక్కుతున్నారు. కొణతాల టీడీపీలో ఒకరిని చేర్పిస్తే దాడి ఇద్దరిని వైసీపీలోకి తెస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే వైసీపీకి అనకాపల్లిలో బాగుంది.

దాడి రాజకీయ చాణక్యం వల్ల, ఆయన పలుకుబడి, రాజకీయ నిలక‌డ వంటి కారణాల వల్ల వైసీపీ అభ్యర్ధి గుడివాడ అమర్నాధ్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే, అనకాపల్లి పార్లమెంటు స్థానం విషయానికి వస్తే కూడా మెరుగ్గా ఉంది. ఈ రెండు సీట్లు గెలిపించి జగన్ కి బహుమతిగా ఇస్తానని దాడి అంటున్నారు. మరో వైపు కొణతాల తన వియ్యంకుడిని గెలిపించుకునైనా చంద్రబాబు ప్రాపకం పొందితే టీడీపీ అధికారంలోకి వస్తే ఏదో పదవి ఇస్తారని ఆశపడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.