Home News Politics

కోడెల సీటుకు రాయపాటి ఎర్త్….!

SHARE

కూటి కోసం కోటి తిప్పలు అంటారు…. ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి సీటు కోసమూ అన్నే తిప్పలుపడుతున్నారు కొందరు నేతలు. కోరుకున్న సీటు కోసం కొందరు అధినాయకత్వాలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తుంటే… ఇంకొందరు సెంటిమెంట్ ను బూచీగా చూపి సీటు అడుగుతున్నారట… ఓట్లు పడే సీనుంటే సీటిస్తారు కానీ… సెంటి మెంట్‌కి కూడా సీట్లు ఇస్తారా? మరి ఆ లెక్కలేంటో కాని .. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత రాయపాటి కొడుకు సీటు కోసం ఇలాంటి పనే చేస్తున్నారట..

నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు … అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్న రంగారావు కొంత కాలం నుంచి సేఫైన సీటు కోసం గుంటూరు జిల్లాలో నలుమూలలా వెతుకుతున్నారు… ఆ క్రమంలో ఆయన కన్ను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి మీద పడిందట. సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల అటు తన పాత నియోజకవర్గం నరసరావుపేటనూ వదలకుండా పనులు చేస్తున్నారు… ఈ సారి కోడెల నరసరావుపేట వెళ్తే తనకు సత్తెనపల్లి సీటు దొరుకుతుందని డిసైడైన రాయపాటి రంగారావు… ఆ కోణంలో పావులు కదుపుతున్నారట. తండ్రి సాంబశివరావును వెంటపెట్టుకుని చంద్రబాబును కలిసి తనకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని కోరారట… కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారినా… అన్ని పార్టీలలో తనకు పట్టు, పలుకుబడి ఉన్నాయని చెప్పుకొచ్చిన రంగారావు … సత్తెనపల్లిలో తన మెరిట్స్ ఏంటో సోదాహరణగా సీఎం ముందు ఉంచారట.

పనిలో పనిగా ఓ సెంటిమెంట్ చిత్రాన్నీ చంద్రబాబు ముందు ఆవిష్కరించారట రంగారావు. తనకు సీటు ఇవ్వమని అడగడం ఒక ఎత్తైతే… తనకు సీటు ఇవ్వకుంటే అసలుకే ఎసరు వస్తుందన్నట్టు ఉందట ఆ సెంటిమెంట్… అదేమంటే … సత్తెనపల్లి నియోజకవర్గం ఆవిర్భావం నుంచి… అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తారో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని పాత లెక్కలన్నీ చంద్రబాబుకు చూపించారట రంగారావు… అంత వరకు బాగానే ఉంది… దానికి ఇంకో సెంటిమెంట్ ను జత చేస్తూ… రాష్ట్రంలో ఇప్పటి వరకు స్పీకర్లుగా పని చేసిన వాళ్లెవరూ మళ్లీ ఎన్నికల్లో గెలవలేదని… ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్లుగా పని చేసిన ప్రతిభారతి, యనమల రామకృష్ణుడు, నాదెండ్ల మనోహర్, తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి ఆ జాబితాలో ఉన్నారని చెప్పారట రంగారావు…

ఆ విధంగా సత్తెనపల్లి సీటుకు సెంటిమెంట్ ను జోడించి… అక్కడ కోడెలకు తిరిగి సీటిస్తే… ఆయన గెలవకుంటే… అంటూ క్వచ్ఛన్ మార్క్ పెట్టి తన ప్రజెంటేషన్ ను ముగించారట తండ్రీ కొడుకులు… అంటే సత్తెనపల్లిలో కోడెల గెలవకుంటే…. మొత్తం పార్టీకే ఎసరు వస్తుందన్న అర్ధంలో సెంటిమెంట్ ను రాజేశారన్న మాట …. చంద్రబాబు ఏమనుకున్నారో ఏమో కానీ … ఈ సెంటిమెంట్ లెక్కలతో తనకు సీటు కాన్ఫామ్ అనుకుంటున్నారు రంగారావు.. ఎలాగూ కోడెలకు నరసరావుపేట ఉంది కనుక పెద్దగా ఇబ్బందిలేకుండానే సత్తెనపల్లిని పట్టేయవచ్చన్నది రాయపాటి ఉద్దేశంగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు … రాయపాటి వారి సెంటిమెంట్ లెక్కలతో ఏకీభవిస్తారో లేదో చూడాలి.