Home News Stories

కిడారి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి…!

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు ఎందుకు చంపారు? దానికి ముందు వారు ఏం మాట్లాడారు? దీనిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అరకు జంట హత్యల కేసులో మొదటగా చలపతి, ఆయన భార్య అరుణ ప్లాన్ చేశారని పోలీసులు అనుమానించారు. అయితే పోలీసుల విచారణలో అదే నిజమైంది. ఈ కేసులో పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు సంబంధించి చలపతి పేరే మొదటగా వినిపించింది. చలపతి పక్కా ప్లాన్ రచిస్తారని, మెరికల్లాంటి వ్యక్తులను తన టీంలో చేర్చుకుని ఆపరేషన్‌ను సక్సెస్ చేస్తారన్న పేరుంది. ఏవోబీలో ఎన్‌కౌంటర్ అయినా… రాజకీయ నాయకులు, పోలీసులపై మావోలు దాడి చేసినా మొదటగా వినిపించే పేరు చలపతి దే.


అయితే మావోయిస్టులు ఇంత సడన్ గా ఎమ్మెల్యే కిడారిని ఎందుకు టార్గెట్ చేశారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలిసిన వ్యక్తి ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి కిడారి వ్యక్తిగత కార్యదర్శి అప్పారావు! ఆ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కారులో అప్పారావు కూడా ఉన్నారు. ఈ సంఘటనకి సంభందించిన కీలక విషయాలు వెల్లడించారు అప్పారావు.

ఉదయం 11.30 గంటలకు డుంబ్రిగూడ చేరుకున్నాం. వాటర్‌ బాటిల్స్‌ తీసుకొని కండ్రూం పంచాయతీలో సర్రాయిలో గ్రామదర్శినికి బయలుదేరాం. ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణించి లివిటిపుట్టు చేరుకున్నాము. అంతలో కొందరు మహిళలు కారు ఆపారు. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి ఆయుధాలతో మావోయిస్టులు చుట్టుముట్టారు. వారిని చూడగానే ఎమ్మెల్యే హతాశులయ్యారు. ‘అరేయ్‌ చచ్చిపోయాం రా… మావోయిస్టులు వచ్చారు’ అని అన్నారు. కారు దిగాలని నక్సల్స్‌ చెప్పగానే… ఎమ్మెల్యే దిగారు.

ఆ తర్వాత మమ్మల్ని కూడా కారులో నుంచి దించారు. అందరి వెనుక తుపాకులు గురిపెట్టి ఎదురు తిరిగితే చంపేస్తామని హెచ్చరించారు. దాంతో మేమంతా వాళ్లు చెప్పినట్లే విన్నాం. వెనుకాల వచ్చిన సివేరి సోమ కారును కూడా ఆపారు. ఆయన్ను, అందులో వారిని కూడా కిందికి దించారు. ఆయన గన్‌మెన్‌ దగ్గర ఆయుధం కూడా తీసుకున్నారు. అందరినీ ఒకే దగ్గర నిల్చోబెట్టారు. మాట్లాడి పంపిస్తామంటూ ఎమ్మెల్యేను, మాజీ ఎమ్మెల్యే చేతులు వెనక్కి విరిచి కట్టి నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. మేము కదలకుండా కొంతమంది కాపలా ఉన్నారు. కొద్ది దూరం వెళ్లాక.. ఎమ్మెల్యేను ఒక వైపు, మాజీ ఎమ్మెల్యేను మరోవైపు నడిపించారు. అలా నడుస్తుండగానే సివేరి సోమను కాల్చి చంపేశారు.


అది చూసి ఎమ్మెల్యే కిడారి ‘అన్నా చంపొద్దన్నా… చంపొద్దన్నా!!’ అంటూ రెండుసార్లు వేడుకున్నారు. అయినా వారు కనికరించలేదు. ఆయన్ను కూడా కాల్చి చంపేశారు. ఇదంతా మేమున్న చోటు నుంచి 50-60 మీటర్ల దూరంలోనే జరిగింది. కారులో ఎమ్మెల్యే కాకుండా మొత్తం ఏడుగురు ఉన్నాం. మావోయిస్టులు మా గురించి ఆరా తీశారు. మీరు వాల్మీకులా? అని గన్‌మెన్‌ను అడిగారు. తమది శ్రీకాకుళమని వాల్మీకులం కాదని చెప్పడంతో వదిలేశారు.


ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను చంపిన తర్వాత… ఆ దారిలో బైకులు, జీపులు, ఆటోల్లో వెళ్తున్న వారిని మావోయిస్టులు ఆపారు. అక్కడే వారితో చిన్న సమావేశం పెట్టారు. ఆ ఇద్దరిని ఎందుకు చంపామో మీకు తెలుసా? అని ప్రశ్నించారు. ‘గూడ క్వారీ ఒక కారణం. రూ.30 కోట్లు తీసుకొని పార్టీ మారారు. ఆ డబ్బుతో ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకే చంపేశాం’ అని వారికి చెప్పారు. కొద్దిసేపటి తరువాత అంతా వెళ్లిపోయారు. ఐదు నిమిషాల్లో మళ్లీ వెనక్కి వచ్చి, ఎమ్మెల్యే కిడారి జేబులో వున్న మొబైల్‌ ఫోన్‌ తీసుకొని వెళ్లారు. కిడారి చాలా సున్నిత స్వభావి, మంచివారు అన్నారు అప్పారావు. ఎప్పుడూ గ్రామాల్లో తిరిగేవారు. తను ఏది తింటే మాకూ అదే పెట్టేవారు. పిల్లలతో సమానంగా మమ్మల్ని చూసుకున్నారన్నారు.

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఎక్కడికైనా వెళితే ముందుగా తెలియజేయాలని కోరుతూ పోలీసులు ఎటువంటి నోటీసును ఎమ్మెల్యే కిడారికి ఇవ్వలేదని తెలుస్తుంది. నోటీసు అందుకున్నట్లు చూపిస్తున్న పత్రంలో కిడారి సంతకం పోలీసులు ఫోర్జరీ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే మృతితో ఖాళీ అయిన అరకు అసెంబ్లీ స్థానంకు శాసనసభ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.