Home News Politics

ఖమ్మం ఖిల్లా ఎవరి పక్షం…!

SHARE

రాజకీయ చైతన్యం ఉట్టిపడే ఖమ్మం నియోజకవర్గంలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. రెండు పార్టీల మాజీ ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పార్టీమారిన తాజా మాజీ ఎమ్మెల్యే తన పట్టు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. ఒకప్పుడు పట్టంకట్టిన నియోజకవర్గంపై సీపీఎం కూడా పట్టుదలతోనే ఉంది. ప్రజాకూటమి పొత్తుల్లో ఖమ్మం దక్కేదెవరికి? బరిలో నిలిచేదెవరు?

ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లా…తర్వాత అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన జిల్లా. తెలంగాణలో ఖమ్మం జిల్లా ఒక ఎత్తయితే …మిగిలిన జిల్లాలు మరో ఎత్తన్నట్లు ఉంటుంది ఇక్కడి రాజకీయం. ఒకప్పుడు వామపక్షాల కంచుకోటగా ఉన్న ఖమ్మంలో తర్వాత కాంగ్రెస్, టీడీపీలకు గట్టి పట్టు చిక్కింది. టీడీపీతో సుదీర్ఘ అనుబంధమున్న సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు చేరికతో….ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నాలుగేళ్లలో బలం పుంజుకుంది. దీంతో 2014 ఎన్నికల్లో ఒకే సీటు గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడక్కడ బలమైన పార్టీగా అవతరించింది. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ తరువాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రచారంలో దూకుడు పెంచారు. నాలుగేళ్లలో ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరిస్తూ ప్రచారంలో మునిగిపోయారు.

ఖమ్మం నియోజకవర్గం ప్రజాకూటమి పొత్తుల్లో ఎవరికి దక్కుతుందో ఇంకా తేలకపోవటంతో…విపక్షాల ప్రచారం మొదలు కాలేదు. కాంగ్రెస్, టీడీపీ రెండూ ఖమ్మం సీటు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్ ఖమ్మం నుంచి పోటీకి ఉత్సాహపడుతుంటే…బలమున్నచోట తమకు సీటివ్వాలని కోరుతోంది టీటీడీపీ. కాంగ్రెస్‌కే ఖమ్మం సీటు కేటాయిస్తే…ఇక్కడ్నించి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి పోటీచేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ ఆదేశిస్తే ఎంపీ స్థానానికైనా, ఎమ్మెల్యేగానైనా పోటీకి సయ్యంటున్నారు రేణుకాచౌదరి. ఒకవేళ ఆమె ఆసక్తి చూపని పక్షంలో ఖమ్మంనుంచి బరిలో దిగేందుకు కాంగ్రెస్‌ నుంచి చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, గాయత్రి రవి, ఎంపీడీవో ఏలూరి శ్రీనివాసరావు కాంగ్రెస్‌ టికెట్‌ ప్రయత్నాల్లో ఉన్నారు. సామాజిక వర్గపరంగా తనకే ప్రాధాన్యం ఉంటుందని పోట్ల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు.

ఒకవేళ పొత్తుల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి దక్కితే….మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. నియోజకవర్గ టీడీపీ నేతలు ఇప్పటికే నామాను బరిలోకి దించాలని పార్టీ అధ్యక్షుడికి సూచించారని సమాచారం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారమే పోటీ ఉంటుందని నామా స్పష్టం చేస్తున్నారు. నామా పోటీ చేసే ఆలోచన ఉంటేనే ఖమ్మం సీటుని టీడీపీ తీసుకుంటుందని, లేనిపక్షంలో కాంగ్రెస్‌కే వదిలేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సీపీఐ మాత్రం కూటమిలో ఎవరికి కేటాయిస్తే వారికి తమ సహకారం ఉంటుందని చెబుతున్నా…పార్టీ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు అజయ్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో ఉండటంతో…ఎటువైపు ఉంటుందన్న చర్చ నడుస్తోంది.

సీపీఎంకి కూడా ఖమ్మం నియోజకవర్గంలో కీలకమే. గతంలో ఇక్కడినుంచి సీపీఎం గెలిచింది. పొత్తుల్లేకుండానే తమ్మినేని వీరభద్రం ఖమ్మం ఎమ్మెల్యేగా 2004 లో విజయం సాధించారు. సీపీఎం ఖమ్మంనుంచి పోటీకి దిగే అవకాశాలున్నాయి. లేదంటే బీఎల్‌ఎఫ్‌ నుంచి గట్టి అభ్యర్ధి బరిలో నిలిపి సీపీఎం సపొర్ట్ చేసే యోచనలో ఉంది.మరోవైపు కోదండరాం పార్టీ టీజేఎస్‌ కూడా ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రజాకూటమి పొత్తుల్లో టీజేఎస్‌ కోరుకుంటున్న సీట్లలో ఖమ్మం కూడా ఉంది. టీజేఎస్ నుంచి పోటీకి పాపారావు ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం రాజకీయం హాట్‌హాట్‌గా ఉంది. ఖమ్మం ఖిల్లా పై జెండా ఎగరేసేందుకు అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి.