Home News Politics

ఖైరతాబాద్‌ లో గెలుపెవరిది….పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్న రెబల్స్…?

SHARE

హైదరాబాద్‌లో మాస్‌, సూపర్ క్లాస్ కలిసి ఉన్న నియోజకవర్గం. ఇక్కడ నుంచి బరిలోకి దిగారని… ప్రతీ పార్టీ నుంచి ఐదారుగురు పోటీ పడ్డారు. మిగతా వాళ్లను పక్కన పెట్టి… టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్లు వేసి ప్రచార రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో కుప్పలు తెప్పలుగా సమస్యలు ఉన్నాయి. సంపన్నులుండే ప్రాంతాలతో పాటు… పేదలు నివశించే బస్తీల్లోనూ ఒకే పరిస్థితి. పార్టీల ప్రచారంలో సమస్యలు ప్రస్తావనకు వస్తాయా?. పరిష్కార మార్గాన్ని చూపిస్తాయా?. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ వెర్షన్ ఎలా ఉంది?.

హైదరాబాద్‌కు నడిబొడ్డు ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం. జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, ప్రశాసన్‌ నగర్‌ వంటి ఖరీదైన ప్రాంతాలతో పాటు మక్తా, ఫిల్మ్‌నగర్‌, చింతల్‌బస్తీ వంటి మాస్‌ ఏరియాలు కలసిన సెగ్మెంట్‌ ఇది. రెండు రాష్ట్రాల సచివాలయాలు, రాష్ట్ర మొదటి పౌరుడి నివాసం రాజభవన్‌, మీడియా హౌస్‌లు, స్టార్‌ హోటల్స్‌ వంటి ప్రముఖ సంస్థలకు అడ్డా ఖైరతాబాదే. ఇవన్ని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉన్నా భౌగోళికంగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోకి రావు. ఇవన్నీ ఖైరతాబాద్‌లోకి రావటం కాస్త గందరగోళ పరిచే అంశం.

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉంది. 1967లో ఏర్పడిన ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్లు సుమారుగా రెండున్నర లక్షలు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్‌ జయకేతనం ఎగరేసింది. టీడీపీ, బీజేపీ, ఇండిపెండెంట్‌ ఒక్కోసారి గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , మాస్‌ లీడర్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న దివంగత పి.జనార్ధన రెడ్డి ఐదు సార్లు గెలిచి నియోజకవర్గం పై తనదైన ముద్ర వేశారు. ఆయన హఠాణ్మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పీజేఆర్‌ తనయుడు విష్ణువర్ధన రెడ్డి బరిలో నిలబడి గెలిచారు. తర్వాతి ఎన్నికల్లో అంటే 2009లో విష్ణు జూబ్లిహిల్స్‌ నియోజకవర్గానికి వలస వెళ్ళటంతో …ఇక్కడి నుంచి దానం నాగేందర్‌ ఎన్నికలు ఎదుర్కొన్నారు.

గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ-బీజేపీ కూటమి జెండా ఎగరేసింది. ఆ కూటమి నుంచి బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి పోటీ చేసి 53వేల పై చిలుకు ఓట్లు సంపాదించారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి దానం నాగేందర్‌ రెండో స్థానానికి పరిమితం కాగా, వైసీపీ మూడో స్థానం, టీఆర్‌ఎస్‌ నాల్గో స్థానంలో నిలబడ్డాయి. నాలుగున్నరేళ్లు గడిచేసరికి పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున దానం పోటీ చేస్తున్నారు. ప్రజా కూటమి పొత్తులో బాగంగా.. ఈ స్థానం కాంగ్రెస్‌కు దక్కింది. దీంతో కాంగ్రెస్ తరపున దాసోజు శ్రవణ్ బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల సై అంటున్నారు. ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద కూడా భారీగానే ఉంది. బహుముఖపోటీ ఉండటంతో.. ఖైరతాబాద్ ఫలితం ఎలా ఉంటుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఆరు డివిజన్లున్నాయి. ఖైరతాబాద్‌, సోమాజిగూడ, హిమాయత్‌నగర్‌, వెంకటేశ్వర కాలనీ, బంజారాహిల్స్‌ ఉన్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గులాబీ గుర్తు పై పోటీ చేసేందుకు అనేక మంది నేతలు పోటీ పడ్డారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి మొదటి నుంచీ అసెంబ్లీ సెగ్మెంట్‌ సీటును అడుగుతూ వస్తున్నారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో దానం నాగేందర్‌కు సీటు ఇచ్చింది పార్టీ హైకమాండ్‌. దీంతో టికెట్ ఆశించిన నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

దానం పేరును పార్టీ అధికారికంగా ప్రకటించిన కొద్ది గంటలకే మన్నె గోవర్ధన్‌రెడ్డి సతీమణి, కార్పొరేటర్‌ మన్నెకవితారెడ్డి భర్త తరఫున నామినేషన్‌ దాఖలు చేయటం రెబల్స్‌ పరిస్థితిని అద్ధం పడుతోంది. అటు పీజేఆర్‌ వారసురాలిగా, కార్పొరేటర్‌ విజయా రెడ్డి కూడా టికెట్‌ పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ఎక్కడ రెబల్‌గా బరిలో దిగుతారో అన్న ఆందోళనలతో కేటీఆర్‌ ఆమెతో సమావేశమయ్యారు. దానం స్వయంగా విజయారెడ్డి ఇంటికి వెళ్లి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన దాసోజు శ్రవణ్ పై వ్యతిరేకతతో నామినేషన్ వేసిన సింగిరెడ్డి రోహిణ్ రెడ్డి, రాజు యాదవ్‌ను కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు. దీంతో ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో శ్రవణ్ కు లైన్ క్లియర్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తమను అన్యాయం చేసిన పార్టీల వైఖరికి సరైన సమాధానం చెప్పేందుకు మన్నె గోవర్ధన్‌, రోహిత్‌ రెడ్డి తెర వెనుక చేతులు కలిపారాన్న ప్రచారం తాజా పరిస్థితికి మరింత మసాలా జోడిస్తోంది. రెబల్స్‌ చివరి వరకు గట్టిగా పోరాడితే ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూరే అవకాశాలుంటాయి.


ఖైరతాబాద్‌ నియోజకవర్గ ప్రాంతాలన్నీ కీలకమైనవే. రాజ్‌భవన్‌ రోడ్డు నుంచి ఇటు జూబ్లిహిల్స్‌, బంజారా హిల్స్‌ వరకు అన్నీ దాదాపు వీఐపీ జోన్‌గా పరిగణించ దగ్గ ప్రాంతాలే. నల్లా నీళ్లు రాకపోయినా, క్షణం కరెంటు పోయినా పై అధికారులకు ఫోన్లు వెళ్ళే పరిస్థితి ఉండటంతో అధికార యంత్రాంగం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. అలా అని ఖైరతాబాద్‌ సెగ్మెంట్‌లో అంతా ఆద్భుతంగా ఉంది అనుకుంటే పొరపాటే. పూట గడవని బీద జనం, తలకింత నీడలేని పేదరికం ఇక్కడి మురికివాడల్లో కళ్ళకు కడుతుంది.వర్షం వచ్చినప్పుడే కాదు.. నడి వేసవిలో కూడా.. డ్రైనేజ్ నీళ్లు నడి రోడ్ల మీదనే ప్రవహించడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత.


ఖైరతాబాద్ రాజకీయం చూస్తే.. ఏ పార్టీకి సానుకూలంగా ఉందో ఏ మాత్రం అర్థం కాని పరిస్థితి. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని రెబల్స్ బెడద పీడిస్తోంది. తిరుగుబాటు అభ్యర్థులు ఓట్లు చీలిస్తే.. తమ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు గడువు దగ్గర పడుతూ ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అభ్యర్థులంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప.. నియోజకవర్గం సమస్యలపై దృష్టి సారించడం లేదన్న టాక్ నడుస్తుంది.