Home News

కేశినేని-బుద్దా మధ్యలో చిరు…!

SHARE

టీడీపీ ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ ఇద్దరి మధ్య ట్వీట్ వార్ ఇప్పటికీ ఆగలేదు.. ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి. వీరిద్దరి మధ్య తాజాగా జరిగిన ట్వీట్‌ వార్ లో ఇప్పుడు మెగాస్టార్ చిరు కూడా ఎంటరయ్యాడు…

“నిన్నటి దాకా చంద్రబాబు కాళ్ళు.. రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్ళు.. కాళ్ళు కాళ్లే.. వ్యక్తులు మాత్రమే తేడా!!!” అని కేశినేని నాని ట్విట్టర్‌లో హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందుకు స్పందించిన బుద్దా వెంకన్న.. కేశినేనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

“చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు. నీకు ఏం చేయాలో తెలియక అబద్ధాలు ఆడుతున్నావు.. ప్రజారాజ్యం నుంచి బయటకి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు” అని కేశినేనిపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“గుర్తింపు కోసం అడుక్కునేవాడు అధమస్థాయి బిచ్చగాడు… విజయసాయిరెడ్డి గారు దీనికి మీరు పరాకాష్ట.. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబుగారిది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అవినీతికి 16 నెలలు జైల్లో కూర్చున్న ఘనత తమది. విమర్శించడానికి నోరొక్కటే కాదు, అర్హత ఉండాలి విజయసాయి రెడ్డిగారు. మీకున్న ప్రధాన అర్హత కాళ్ళమీద పడడం అని మరిచారా?” అని బుద్దా ఈ సందర్భంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఈ స్థాయిలో జరుగుతుంటే అసలు టీడీపీలో ఏం జరుగుతోంది..? ఎన్నికల ఫలితాల తర్వాత ఓ వైపు పార్టీ అధినేత పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రచిస్తుంటే.. అసలు ఈ ఇద్దరు ఎందుకిలా చేస్తున్నారు..? అనేది కేడర్‌కు అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ముదురుతున్న ఈ గొడవలకు పార్టీ పెద్దలు స్పందించి ఫుల్‌స్టాప్ పెడతారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.