Home News

పీవీపీ ఎంట్రీతో మారిన కేశినేని,బుద్దా ట్వీట్టర్ వార్…!

SHARE

అక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల మధ్య విబేధాలు సోషల్‌ మీడియా వేదికగా రచ్చకెక్కాయి … పార్టీ పరువును పణంగా పెడుతూ వ్యక్తిగత విమర్శలతో చెలరేగిపోయారు .. అధిష్టానం కూడా వారిని కంట్రోల్‌ చేయలేకపోయింది .. అయితే పిలవని అతిథిలా ప్రత్యర్ధి పార్టీ నేత వారి మధ్య ఎంట్రీ ఇవ్వడంతో .. అసలు వార్‌కి ఎండ్‌ కార్డు పడిపోయింది… పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్టు తయారైంది అక్కడి రాజకీయం …

బెజవాడ పాలిటిక్స్ అంటే ఎప్పుడు ఆసక్తికరమే… అందుకే బెజవాడను రాజకీయ రాజధానిగా పిలుస్తారు. ..ఇక్కడ జరిగే ఏ పరిణామం అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది… ప్రస్తుతం బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న మధ్య జరిగిన ట్విట్టర్ వార్ హాట్ టాపిక్ గా మారింది …

పశ్చిమ నియోజక వర్గం నుంచి టీడీపీ నేత నాగుల్ మీరాను ఎమ్మెల్యేగా చూడాలని ఎంపీ కేశినేని సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు బుద్దాకు కలవరపాటుకు గురిచేశాయి … దీనితో ఆయన కూడా కేశినేని తీరుపై తన సన్నిహితుల వద్ద అక్కసు వెళ్లగక్కారట… పశ్చిమ సీటుపై ఆశలు పెట్టుకుని ఉన్న బుద్దాకు కేశినేని కామెంట్స్‌ మింగుడుపడలేదంట.. ఈ వ్యవహారం ఇద్దరు నేతల మధ్య గ్యాప్‌ పెంచింది… ఆ క్రమంలో ఎంపీ కేశినేని నాని వ్యవహారాన్ని రచ్చకెక్కించి రక్తికట్టించారు… ట్విట్టర్ వేదికగా బుద్దాపై ఘాటు విమర్శలకు దిగటం ద్వారా రచ్చకు కొబ్బరికాయ కొట్టారు కేశినేని నాని.

కేశినేని నాని పంచ్‌లకు బుద్ధా కూడా ఘాటుగానే స్పందించారు… తన ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా కేశినేని బస్సుల వ్యాపారం, బాలయోగి ఆస్తులు, అప్పులు, పర్మిట్లు, ప్రజారాజ్యం పార్టీలో వ్యవహరించి తీరు వంటి అంశాలకు సంబంధించి కేశినేనిపై ఘాటైన విమర్శలు చేశారు… దాంతో కేశినేని కూడా వ్యక్తిగత దాడికి దిగి… కొబ్బరిచిప్పల దొంగ, నాలుగు ముక్కలు చదువు రాదు ఇలా బుద్ధాపై తీవ్ర విమర్శలు చేశారు.. రాజధానిలో పార్టీ కీలక నేతల మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వార్‌తో పార్టీ అధిష్టానం ఇరుకున పడింది… సర్దిచెప్పే ప్రయత్నం చేసినా నేతల తీరులో మార్పులు రాలేదు… విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే వచ్చారు.. పార్టీ అధిష్టానం కూడా ఏమీ చేయలేక నిస్సహాయంగా వదిలేసిన పరిస్థితి.

అయితే టీడీపీ నేతల మధ్య జరుగుతున్న ఈ ట్విట్టర్ వార్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు వైసీపీ నేతల పీవీపీ … బెజవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని చేతిలో ఓటమి పాలైన ఆయన.. కేశినేని నానిపై విమర్శలు చేయటంతోపాటు .. బుద్ధా వ్యాఖ్యలు నిజమే అంటూ పీవీపీ తన ట్విట్టర్ ద్వారా పంచ్ లు మొదలెట్టారు…

కేశినేని కూడా తన ట్విట్టర్‌ అకౌంట్లో పీవీపీపై రిటర్న్ పంచ్ లు మొదలుపెట్టారు … దాంతో అప్పటి వరకు కేశినేని నాని, బుద్ధా మధ్య జరిగిన వార్ కేశినేని నాని వర్సెస్‌ పీవీపీ అన్నట్లు తయారైంది…. ఆ ఎపిసోడ్‌ అలా టర్న్‌ అవ్వడంతో బుద్ధా వెంకన్న ఊపిరి పీల్చుకున్నారంట… ప్రస్తుతం ప్రతిరోజు పీవీపీ, కేశినేని నాని ట్విట్టర్ వేదికగా నిత్యం విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ అధిష్టానం కూడా పీవీపీ ఎంట్రీతో తమ పార్టీ నేతల మధ్య తగువు సద్దుమణిగింది కదా అని భావిస్తోందంట… పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అంటే ఇదేనేమో మరి.