Home News Politics

కొడుకు కేటీఆర్, కోడలు శైలిమాలకు అప్పుపడ్డ కేసీఆర్….

SHARE

ఎన్నికల వేళ నాయకులు సమర్పించే ఆస్థుల చిట్టాలు కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ కోవలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఆస్తి,అప్పుల అఫిడవిట్ లో ఉన్న వివరాలు కొన్ని ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. అప్పుడప్పుడు నారావారి ఫ్యామిలీ ప్రకటించే ఆస్తి,అప్పుల జాబితా పొలిటికల్ సర్కిల్స్ లో కొంత కామెడిగానే ఉంటుంది కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన చిట్టాలోను ఇలాంటివి మచ్చుకు కొన్ని ఉన్నాయి.

ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేసిన కేసీఆర్ కు కాని – ఆయన భార్యకు కాని కనీసం కారు కూడా లేదట. ఇక తను కొడుకు కేటీఆర్,కోడలు శైలిమాకి రూ.కోటికి పైగానే బాకీ ఉన్నారు. ఇందులో కుమారుడు కేటీఆర్‌కు రూ.82,82,570; కోడలు శైలిమకు రూ.24,65,000 అప్పు పడ్డారు. గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ వేసిన కేసీఆర్‌.. ఆస్తులు, అప్పులతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. దాని ప్రకారం.. కేసీఆర్‌ ఆస్తులు రూ.12.20 కోట్లు కాగా.. మొత్తంమీద ఆయనకు రూ.8.88 కోట్ల అప్పులు ఉన్నాయి.

ఇక పార్టీకి చెందిన మాజీ ఎంపీ జి.వివేక్‌ నుంచి రూ.1.06 కోట్లు,పాక్ట్‌ సెక్యూరిటీస్‌ ఫైనాన్షియల్‌ సంస్థ నుంచి రూ.3.75 కోట్లను కేసీఆర్‌ అప్పు తీసుకున్నారు. ఎంపీ వినోద్‌ తమ్ముడు బోయినపల్లి శ్రీనివాసరావు నుంచి రూ.3 కోట్ల అప్పు తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన 2011-12 ఆర్థిక సంవత్సరంలో సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ వివరాలు పేర్కొన్నారు. అప్పట్లో ఆయన ఆదాయం రూ.6.59 లక్షలు. కానీ, ఐదేళ్లలోనే ఆదాయం భారీగా పెరిగింది. తాజా అఫిడవిట్‌ ప్రకారం 2017-18లో కేసీఆర్‌ ఆదాయం రూ. 1.20 కోట్లు! ఇందులో వ్యవసాయ ఆదాయం రూ.91,52,657 పేర్కొనడం గమనర్హం.

2014 ఎన్నికల సమయంలో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం 37.70 ఎకరాల్లో ఉండగా.. ఇప్పుడది 54.21 ఎకరాలకు చేరింది. దీని విలువ రూ.1,36,64,970గా చూపించారు. ఫామ్‌హౌస్‌, అక్కడ పెట్టుబడి అంతా కలిపి రూ.6.50 కోట్లుగా చూపించారు. బ్యాంకులు, సంస్థల్లో డిపాజిట్లు, పెట్టుబడుల విలువ 2014లో రూ.6.29 కోట్లు కాగా.. ఇప్పుడది రూ.10.40 కోట్లకు చేరింది. కేసీఆర్‌ సతీమణి శోభ పెట్టుబడులు, డిపాజిట్లు 2014లో రూ.21 లక్షలు కాగా.. ఇప్పుడు రూ.94.59 లక్షలకు చేరాయి. ఇక 2014లో రూ.8.65 కోట్లుగా ఉన్న కేసీఆర్‌ ఆస్తుల విలువ ఇప్పుడు రూ.12.20 కోట్లకు చేరింది.

ఇక ఇతర ఆస్థుల విషయానికి వస్తే హైదరాబాద్‌లోని నందినగర్‌, కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్‌కు సొంత ఇళ్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో 2.04 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉంది. కేసీఆర్‌ చేతిలో రూ.2.40 లక్షల నగదు ఉండగా ఆయన సతీమణి వద్ద రూ.93,595 ఉన్నాయి.. ఇక మీడియా రంగంలో చూస్తే టీ న్యూస్ లో రూ.55 లక్షలు, తెలంగాణ పబ్లికేషన్స్‌ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ల్లో కేసీఆర్‌కు రూ.4.16 కోట్ల షేర్లు ఉన్నాయి.


ఇక బంగారం విషయానికి వస్తే కేసీఆర్‌ వద్ద 2014లో 60 గ్రాముల బంగారం ఉంటే.. ప్రస్తుతం 75 గ్రాముల కు పెరిగింది. ఆయన సతీమణి వద్ద 2014లో 650 గ్రాముల బంగారం ఉంటే.. ఇప్పుడు 2,200 గ్రాములుంది. దీనివిలువ రూ.93.66 లక్షలుగా చూపారు. భూములు, ఇంటిస్థలాలన్నీ కేసీఆర్‌ పేరుమీదనే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా ఆయన ఎర్రవల్లిలో 16.51 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వాటిలో 0.32 ఎకరాలు మాత్రమే భార్య శోభ పేరిట ఉంది. ఉద్యమ సమయంలోనే ఆయన మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలో 40 ఎకరాలు కొనుగోలు చేశారు.

ఇక కేసుల విషయానికి వస్తే ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో 44; రైల్వే పోలీస్‌స్టేషన్లలో 20 కేసులు తనపై నమోదై ఉన్నాయని కేసీఆర్‌ చూపించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సొంత కారు లేదు. తొమ్మిది బ్యాంకుల్లో ఆయనకు 5,63,73,946 రూపాయలు డిపాజిట్‌ రూపంలో ఉన్నాయి. ఆయన ఏటా రూ.99 వేలు ఇన్సూరెన్స్‌ చెల్లిస్తున్నారు.