Home News Politics

కేసీఆరా..మ‌జాకా!

కంగ్రాట్స్ కుమార‌స్వామీ..సారీ..స్టేజీ ఎక్క‌లేను!

SHARE

రాజ‌కీయం ఎప్పుడెలా చేయాలో ఎవ‌ర‌యినా కేసీఆర్‌ని చూసి నేర్చుకోవాలి. ఓ పొలిటిక‌ల్ యూనివ‌ర్సిటీ తెర‌వాలేగానీ కేసీఆర్ నుంచి రాజ‌కీయ‌పాఠాలు నేర్చుకునేందుకు త‌ల‌పండిన నేత‌లు కూడా క్యూ క‌డ‌తారంతే. త‌ప్ప‌యినా ఒప్ప‌న్న‌ట్లు మాట్లాడ‌టం, ఎన్ని విమ‌ర్శ‌ల‌నైనా త‌న వాగ్దాటితో వాష‌వుట్ చేసి పారేయ‌డం కేసీఆర్‌కి రాజ‌కీయంతో పెట్టిన విద్య‌. అందుకే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌మీద అన్ని విమ‌ర్శ‌లొచ్చినా, కొంద‌రు ఆయ‌న చిత్త‌శుద్ధిని శంకించినా గుణాత్మ‌క మార్పుకోసం ఎవ‌రో ఒక‌రు అడుగు వేయ‌క‌పోతే ఎలాగ‌ని ద‌బాయించి నోళ్లు మూయించ‌గ‌లుగుతున్నారు.

ఇంత‌కీ చెప్పొచ్చేదేటంటే..ఎప్పుడైతే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ సాయంతో జేడీఎస్ అధికారంలోకొచ్చిందో చాలామంది ముసుగులు తొల‌గిపోతాయ‌నుకున్నారు. క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించిందే తాన‌ని చెప్పుకునే ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎలాగూ క‌బురంద‌గానే వాలిపోతారు. మైకు చేతికి దొరికితే స్పీచ్ దంచేస్తారు. కానీ కేసీఆర్ ఏం చేయ‌బోతున్నార‌న్న ఆస‌క్తి మొద‌లైంది అంద‌రిలో. ఎందుకంటే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కోసం త‌నే స్వ‌యంగా వెళ్లి కుమార‌స్వామిని, మాజీ ప్ర‌ధాని అయిన ఆయ‌న తండ్రి దేవెగౌడ‌ని క‌లిసొచ్చారు కేసీఆర్‌. ఆయ‌న ఫ్రంట్ బీజేపీ-కాంగ్రెస్సేత‌ర కూట‌మికోసం. ఇప్పుడేమో క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌లేనిదే జేడీఎస్ లేదు..జేడీఎస్ ప్ర‌భుత్వం లేదు. దీంతో ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానం అందినా కేసీఆర్ వెళ్తారా? కాంగ్రెస్‌తో క‌లిసి వేదిక పంచుకుంటారా? అన్న‌ది నిన్న‌టిదాకా అంద‌రిలో ఒక‌టే చ‌ర్చ‌.

వేదిక‌పై కాంగ్రెస్‌నేత‌ల‌తో క‌లిసి కూర్చోవ‌డం ఇష్టంలేక ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి గైర్హాజ‌రైతే అదో డ్యామేజ్‌. విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యే సంద‌ర్భంలో దాన్ని ఆహ్వానించాల్సిన ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మొహం చాటేస్తే ఎన్నో అనుమానాలొస్తాయి. రేప్పొద్దున విప‌క్ష‌నేత‌ల్ని క‌ల‌వాల‌నుకున్నా ఇదో మైన‌స్ పాయింట్ అవుతుంది. అందుకే క‌ర్ర విర‌క్కూడ‌దు..పాము చావ‌కూడ‌ద‌న్న‌ట్లు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు కేసీఆర్‌. కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి ముందు రోజే బెంగ‌ళూరులో వాలిపోయారు. బీజేపీ ఎత్తుల్ని చిత్తుచేసి నెగ్గుకొచ్చినందుకు కుమార‌స్వామిని అభినందించారు. ముప్పావుగంట‌పాటు జాతీయ రాజ‌కీయాల‌పై చ‌ర్చించి హైద‌రాబాద్ ఫ్లైట్ ఎక్కేశారు. అధికారిక కార్య‌క్ర‌మాలున్నందున ప్ర‌మాణ‌స్వీకారానికి రాలేక‌పోతున్నాన‌ని కేసీఆర్ వారికి చెప్పినా…ఆయ‌న త‌ల‌చుకుంటే ఎంత‌టి కార్య‌క్ర‌మాన్నైనా ఓ రోజు వాయిదావేయ‌డం చిటికేసినంత ప‌ని. కుమారస్వామిని అభినందించాలి..కాంగ్రెస్‌కి దూరంగా ఉండాలి. అదీ కేసీఆర్ లెక్క‌.