Home News Stories

కర్నూలులో ఖద్దరు ధరించిన ఖాకీలు…!

SHARE

నిన్న మొన్నటి వరకు వాళ్ళు ఖాకీ యూనిఫామ్ వేసుకొని శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమైన అధికారులు…ఇవాళ ఖద్దరు దుస్తులు ధరించిన రాజకీయ నాయకులు…గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారులు ఎక్కువ సంఖ్యలో వున్నారు. పార్టీ ఏదైనా…పోటీ చేసేది ఎక్కడి నుంచైనా.. వాళ్లంతా కర్నూలు జిల్లాకు చెందినవారే…

కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మాజీ పోలీస్ అధికారులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. నంద్యాల, అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ స్థానాలకు, నందికొట్కూరు, హిందూపురం అసెంబ్లీ నియోజకవరాలకు పోటీ పడుతున్నారు. నంద్యాల పార్లమెంటరీ నోయోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివానంద రెడ్డి స్వగ్రామం నందికొట్కూరు మండలం అల్లూరు. పోలీస్ శాఖలో సైబ్రర్ క్రైమ్ ఎస్పీ గా పనిచేస్తూ స్వచ్చంధ పదవి విరమణ చేశారు. 2014 ఎన్నికల ముందే రాజకీయాల్లో ప్రవేశించిన శివానంద రెడ్డి వైసీపీ లో చేరారు. ఎన్నికల తరువాత టీడీపీ లో చేరారు. జడ్పీ చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీ లో ఉన్న తన బావమరిది గౌరు వెంకటరెడ్డి, పాణ్యం.ఎమ్మెల్యే గౌరు చరితను టీడీపీ లోకి తీసుకురావడంలోను కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం నంద్యాల ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ జీవితంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నందికొట్కూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తొగురు ఆర్థర్ ఏపీఎస్పీ లో కమాండెంట్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆర్థర్ స్వగ్రామం పాములపాడు మండలం మద్దూరు. పలువురు సీఎం ల వద్ద భద్రత విభాగంలో పనిచేసారు. 2009 నుంచే ఆయన ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 లో వైసీపీ నుంచి నందికొట్కూరు ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం వచ్చింది.

కర్నూలు జిల్లాకు చెందిన మాజీ పోలీస్ అధికారులు అనంతపురం జిల్లాలోను ఎన్నికల బరిలో ఉన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ మహ్మద్ ఇక్బాల్ రాయలసీమ ఐజి గా పనిచేసి పదవీ విరమణ చేశారు. బనగానపల్లెకు చెందిన ఇక్బాల్ 1987 లో పోలీస్ శాఖలో డిఎస్పీగా చేరారు. ఇక్బాల్ స్వగ్రామం బనగానపల్లె కు చెందినవారు. 2018 లో పదవి విరమణ చేసిన ఇక్బాల్ వైసీపీ లో చేరారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటిచేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

హిందూపురం నుంచి వైసీపీ ఎంపీ గా పోటీచేస్తున్న గోరంట్ల మాధవ్ స్వగ్రామం కర్నూలు మండలం రుద్రవరం. 1996 లో పోలీస్ శాఖలో ఎస్ ఐ గా చేరారు. అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎస్ ఐ గా, సి ఐ గా చేశారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై సవాల్ విసిరి వార్తల్లోకెక్కారు గోరంట్ల మాధవ్. ఆ తరువాత వైసీపీ లో చేరారు. మాధవ్ స్వచ్చంధ పదవీ విరమణ ఆమోదం చివరి వరకు ఉత్కంఠ రేపినా చివరికి ఎన్నికల్లో పోటీకి అడ్డంకులు తొలిగాయి. మొత్తమ్మీద ఖాకీ యూనిఫామ్ తో అధికారం చేపట్టిన మాజీ పోలీస్ అధికారులు ఇపుడు చట్టసభల్లో ప్రవేశించేందుకు ఎన్నికల బరిలో నిల్చున్నారు. వారి అదృష్టం ఎలా వుందో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే…