Home News Politics

హంగ్ అయితే క‌మ‌ల‌మేనా?

కాంగ్రెస్ క‌ల‌వ‌రం

SHARE

క‌ర్ణాట‌క‌లో అంద‌రూ ఊహించిన విష‌యమే ఎగ్జిట్ పోల్స్ లోనూ వ‌చ్చింది. స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకైనా 113 సీట్లు అవ‌స‌రం. కానీ ఏపార్టీ సీట్లు కూడా వంద‌దాటేలా లేవు. అస‌లే క‌లాగ‌పుల‌గంగా ఉన్న క‌న్న‌డ రాజ‌కీయాన్ని ఎగ్జిట్‌పోల్స్ ఇంకాస్త గంద‌ర‌గోళంలోకి ప‌డేశాయి. దాదాపుగా ప‌న్నెండు మీడియా సంస్థ‌లు, ప్రైవేట్ ఏజెన్సీలు ఎగ్జిట్‌పోల్స్ నిర్వ‌హిస్తే అందులో నాలుగైదు మిన‌హా మిగిలిన‌వ‌న్నీ బీజేపీనే అత్య‌ధిక సీట్లు గెలుస్తుందంటున్నాయి. కొన్ని స‌ర్వేలు మాత్రం బీజేపీ కంటే కాంగ్రెస్సే 20నుంచి 25 సీట్లు ఎక్కువ‌గా గెలుచుకుంటుంద‌ని అంచ‌నావేశాయి. ముందు అనుకున్న‌ట్లే జేడీఎస్ పార్టీనే క‌ర్ణాట‌క‌లో కీల‌కం కాబోతోంది. ఫ‌లితాల త‌ర్వాత బేర‌సారాలు, స‌ర్దుబాట్లు, భ‌విష్య‌త్తు ప్ర‌యోజ‌నాలలాంటివే క‌న్న‌డ కొలువుదీరేదెవ‌రో తేల్చ‌బోతున్నాయి. వంద సీట్లుదాటితే త‌మ‌నే ప్ర‌భుత్వ ఏర్పాటుకు గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించాల్సి ఉంటుంద‌ని సిద్ధ‌రామ‌య్య స‌హా కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నా అలాగే జ‌ర‌గాల‌నీ రూలు లేదు. అలాగే జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌క‌మూ లేదు. ప్ర‌చార స‌మ‌యంనుంచే జేడీఎస్‌ని బీజేపీ దువ్వుతోంది. ఎలాగైనా ద‌క్షిణాదిలో బ‌లం పుంజుకోవాల‌నుకుంటున్న బీజేపీకి క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి రావ‌డం అత్యంత ముఖ్యం. ఎక్కువ సీట్లు ఏపార్టీ గెలుచుకుంద‌న్నది విష‌య‌మే కాదు.అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన ఫిగ‌ర్‌ని ఏ పార్టీ చూపిస్తుంద‌న్న‌దే ముఖ్యం.
బీజేపీకి ఓ 80 సీట్ల‌దాకా వ‌చ్చినా జేడీఎస్ ఓపాతికో ముప్ఫ‌య్యో గెలుచుకోలిగినా నిస్సందేహంగా క‌ర్ణాట‌క పీఠం ప‌రోక్షంగా బీజేపీదే. ఇప్ప‌టికే కుమార‌స్వామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని బీజేపీ నాయ‌క‌త్వం సంకేతాలు పంపింది. డిప్యూటీసీఎం ప‌ద‌వితో పాటు కొన్ని మంత్రి ప‌ద‌వుల‌తో స‌ర్దుకునేందుకు క‌మ‌లం సిద్ధ‌మైంది. బీజేపీతో క‌లిసే ప్ర‌స‌క్తే లేద‌నీ…ఒక‌వేళ జ‌రిగితే కొడుకుతోనైనా తెగ‌దెంపులు చేసుకుంటాన‌నీ దేవెగౌడ్ చెప్పినా…అధికారంకోసం ఆయ‌న రాజీప‌డ‌కుండా ఉండ‌రు. అత్య‌ధిక సీట్లు గెలుచుకున్న పార్టీకే అవ‌కాశ‌మివ్వాల‌నే సంప్ర‌దాయ‌మేం లేద‌ని గోవా, మేఘాల‌యలాంటి రాష్ట్రాల‌తో తేలిపోయింది.
క‌ర్ణాట‌క‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజారిటీ రాక‌పోతే జేడీఎస్‌కే అవ‌కాశ‌మిచ్చేందుకు కాంగ్రెస్ కూడా సిద్ధ‌ప‌డుతోంది. ద‌ళితుడ్ని సీఎంని చేస్తాన‌న్నా ఇబ్బందిలేద‌ని సిద్ధ‌రామ‌య్య ప్ర‌క‌టించ‌డం..అవ‌స‌ర‌మైతే సీఎం రేసునుంచి తాను త‌ప్పుకుంటాన‌ని ప‌రోక్ష సంకేతాలివ్వ‌డ‌మే. మ‌రోవైపు జేడీఎస్ బీజేపీతో క‌ల‌వ‌కుండా అడ్డుకునేందుకు మాయావ‌తిని కూడా ముందుపెట్టాల‌నుకుంటోంది కాంగ్రెస్‌. మ‌ద్ద‌తిచ్చిన మాయావ‌తిని కాద‌ని దేవెగౌడ‌ని ఎలాంటి నిర్ణ‌యం తీసుకోర‌ని కాంగ్రెస్ న‌మ్మ‌కం. ఎవ‌రి లెక్క‌లెలా ఉన్నా ఎగ్జిట్‌పోల్స్ ప్ర‌కార‌మే ఫ‌లితాలుంటాయ‌ని చెప్ప‌లేం. గ‌తంలో ఎన్నోసార్లు అవి తేడాగొట్టాయి. బీజేపీ, జేడీఎస్‌ల‌కు క‌లిపినా మ్యాజిక్ ఫిగ‌ర్ రానిప‌క్షంలోనే కాంగ్రెస్ ఆశ‌లు స‌జీవం. లేక‌పోతే ఏమ‌న్నా జ‌ర‌గొచ్చు.