Home News Stories

కరీంనగర్ లో యుద్దానికి సై అంటున్న పొన్నం….!

SHARE

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? కరీంనగర్ ఎంపీ బరిలో ఈసారి ఆయనే నిలబడతారా ? ఇప్పటికే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారా ? టీఆర్ఎస్ గాలిలో పొన్నం సత్తా చాటుతారా ? ఇప్పుడు కరీంనగర్ లో దీనిపైనే చర్చించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మూడోస్థానంలో నిలిచిన ఆయన ..ఎంపీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించి సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ లో పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఘాటైన విమర్శలతో కరీంనగర్ లో ఎన్నికల వేడీ పుట్టించారు…

యూత్ కాంగ్రెస్ లీడర్ గా అడుగు పెట్టిన పొన్నం ప్రభాకర్ అనతి కాలంలోనే ఉన్నతస్థాయి నేతగా ఎదిగారు. దివంగత కాంగ్రెస్ నేత చొక్కారావును ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన పొన్నం యూత్ లీడగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. కరీంనగర్ కాంగ్రెస్ లో కాకలు తీరిన నాయకులు ఉండగా వారిని కాదని 2009లో పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇప్పించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 2004లో ఇక్కడ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ హవా కొనసాగుతున్న ఆరోజుల్లోనే 2009లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్ 3, 17,972 ఓట్లు సాధించి మంచి మెజార్టీతో గెలుపొందారు. అంటే 32 శాతం ఓట్లు సాధించారు. దానితో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరింత దగ్గరయ్యారు. పొన్నం ఎంపీగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం….కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఆసమయంలో కూడా పొన్నం ప్రభాకర్ తెలంగాణ వైపే నిలబడ్డారు.

ఆతర్వాత వచ్చిన సొంత పార్టీ ముఖ్యమంత్రులను కూడా ఎదిరించే స్థాయికి వెళ్లాడు పొన్నం. ఓసందర్భంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కరీంనగర్ వస్తే హెలికాప్టర్ ను గాలిలోనే తుపాకితో పేల్చేస్తానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించడంతో పార్టీలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆతర్వాత తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సందర్భంలోనూ పొన్నం తన వాయిస్ ను బలంగా వినిపించారు.ఆయన ఎంపీగా పనిచేసిన ఐదేళ్లు ఉద్యమాలు, గొడవలు , వాగ్వాదాలతోనే గడిచింది. అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి..తన నియోజకవర్గానికి నిధులు తేగలిగారు. పలు అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక…2014లోజరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ హవాలో బోయినపల్లి వినోద్ పై 2లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆతర్వాత టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రావడంతో కేశవరావు సహ చాలా మంది కాంగ్రెస్ లీడర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పొన్నంకు కూడా ఆఫర్ వచ్చినా వద్దని కాంగ్రెస్ లోనే నిలబడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు. ఈక్రమంలోనే పార్టీ అధిష్టానం ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టింది. ఆయన మళ్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టిపెట్టారు. పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో పర్యటించారు. ఎంపీ అభ్యర్థిగా నిలబడదామన్న ఆలోచనతో అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈక్రమంలో కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం అప్పటికి ప్రిపేర్ గా లేని కాంగ్రెస్ నేతలు ఈపరిణామంతో ఒకింత కంగుతిన్నారు. దీంతో కరీంనగర్ అసెంబ్లీ నియోకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ను బరిలో దించాలని నేరుగా అధిష్టానమే నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎంపీలుగా పనిచేసిన వారందరినీ బరిలో దింపి సెంటిమెంట్ ను వర్కౌట్ చేయాలని అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డారు. విసృత ప్రచారం నిర్వహించారు. అంతటా కాంగ్రెస్ పవనాలే వీస్తున్నాయని ప్రచారం జరగడంతో కొత్త జోష్ తో ప్రచారం నిర్వహించారు. ఒకదశలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పొన్నం ప్రభాకర్ ఉపముఖ్యమంత్రి కావడం విసృత చర్చ జరిగింది. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. పొన్నం ప్రభాకర్ 39,500ఓట్లతో సరిపెట్టుకుని మూడో స్థానంలో నిలిచారు.

ఈవీఎంలలో లోపాలతో టీఆర్ఎస్ విజయం సాధించిందని కాంగ్రెస్ ఆరోపించింది. న్యాయపోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. అయితే పొన్నం ప్రభాకర్ ఎంపీగా పోటీచేయాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ స్థానంపై దృష్టిసారించి నాలుగేళ్లు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాక…చివరి నిమిషంలో అసెంబ్లీ బరిలో దిగడం వల్లే ఓటమి చెంది ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పొన్నం ప్రభాకర్ కూడా పోటీచేసేందుకు మొదట అంగీకరించలేదు. పార్టీ అధిష్టానమే పోటీచేయాలని సూచించడంతో ఆయన బరిలోకి దిగారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపించడం…కాంగ్రెస్ నుంచి మళ్లీ పొన్నం బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతుంది.ఆయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాక…పార్లమెంట్ నియోజకవర్గమంతా ఓసారి చుట్టివచ్చారు. తాజాగా కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ పొన్నం పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉంటానంటూ కేడర్ లో జోష్ నింపారు.