Home News Politics

జనసేనాని సీరియస్ పాలిటిక్స్ ఎప్పుడు…?

SHARE

అభిమానులే అండగా రాజకీయాలు మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకోవట్లేదా. తీసుకునే నిర్ణయాలు,పార్టీ వ్యవహారాల్లో ఎక్కడో క్లారిటీ మిస్ అవుతున్నారా….రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ పై తానే పార్టీకి కన్ ఫ్యూజన్ క్రియోట్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పార్టీ పోకడ కూడా కార్పోరేట్ తరహాలోనే ఉండటం నిర్ణయాల విషయంలో తడబాటు అసలు జనసేనాని సీరియస్ పాలిటిక్స్ ఎప్పుడు…

తెలంగాణలో అభిమానులు తప్ప పార్టీ పరంగా బలంలేని జనసేన తెలంగాణలో పోటీ విషయంలో ఎందుకు కంగారుపడుతుంది. కూతవేటు దూరంలో ఎన్నికలు ఉన్నా ఇంకా నాలుగు రోజులంటు పొడిగింపులు ఎవరికోసం…మొదట పోటీ విషయంలో ఆసక్తి చూపిన జనసేన సీపీఎం పార్టీతో పొత్తు చర్చలు జరిపింది. ఆ తర్వాత ఏం జరిగింది అంతా గప్ చుప్… సీపీఎం సొంతగా అభ్యర్ధులను ప్రకటించుకుంది. తీరా ఇప్పటికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంపై తన నిర్ణయాన్ని మరో నాలుగైదు రోజుల్లో చెబుతానని తాపీగా సమాధానమిచ్చిన పవన్ అధికార గులాబీ దళానికి మద్దతిస్తారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది.

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని పార్టీలు అంతర్గతంగా ఏర్పాట్లను చేసుకోవటమే కాదు.. గ్రౌండ్ వర్క్ పూర్తి చేశాయి. ఇలాంటి వేళ.. తాను పోటీ చేసేది లేని విషయం మీదనే పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటే ఆయన విజన్ పై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మొత్తం పవన్ కనుసన్నల్లో ఉండటం.. కిందిస్థాయి నాయకత్వం లేకపోవటం.. ఉన్న ఒకరిద్దరు మీడియాకు అందుబాటులోకి లేకపోవటం ఒక ఎత్తు అయితే.. కార్పొరేట్ తరహాలో పార్టీ నడుస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కానీ పవన్ మాట్లాడకపోవటం.. ఆ మాటకు వస్తే సీనియర్ జర్నలిస్టులతో సంబంధాలు లేకపోవటం పవన్ కు మాత్రమే సాధ్యం.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. ఆ పార్టీ కార్యక్రమాన్ని కవర్ చేయాల్సి వచ్చిన రిపోర్టర్లకు చుక్కలు కనిపించేవి. పేరుకు రాజకీయ పార్టీ అనే కానీ..అక్కడ అంత సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ లా ఉండేది. ఉదయం ప్రెస్ మీట్ ఉంటుందంటే అది ఎప్పుడో సాయాంత్రానికి షూరు అయ్యేది. సినిమా ఫంక్షన్ల మాదిరే ఏర్పాట్లు ఉండేవి. వీటిని జీర్ణించుకోవటం పొలిటికల్ రిపోర్టర్లకు ఒక పట్టాన సాధ్యమయ్యేది కాదు. దాదాపు ఇదే తరహా వ్యవహారం ప్రస్తుతం పవన్ జనసేనలోనూ ఉందని పలువురి నోట వినిపిస్తుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తాను ఏపీ పర్యటన మొదలు పెట్టిన తర్వాత తెలంగాణలో పర్యటిద్దామని అనుకున్నానని.. అంతలోనే ముందస్తు ఎన్నికలు వచ్చేశాయని చెప్పారు. వాస్తవానికి.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల మీద కొద్ది నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మీడియా దగ్గరే ఇంత సమాచారం ఉంటే.. పవన్ కు వ్యక్తిగతంగా ఉండే సంబంధాల నేపథ్యంలో ఆయనకు సమాచారం లేకుండా ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ నిజంగానే సమాచారం లేదనుకుందాం. అంచనా అయితే ఉంటుంది కదా? అది కూడా లేదనే అనుకుందాం.. కనీసం ప్లాన్ ఏ.. ప్లాన్ బి అన్నది ఉంటుంది కదా. అలా కూడా లేదంటే ఇక సిరీయస్ నెస్ ఎక్కడుందని అనుకోవాలి.

రాజకీయాలన్నవి సినిమా కాదని.. మూడ్ లేదని ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసినా.. కమిట్ మెంట్ ప్రకారం పూర్తి చేసే వీలుంటుంది. కానీ.. ఎన్నికలు.. పోటీ అన్నది ఒక వ్యవస్థ తీసుకునే నిర్ణయాలకు తగ్గట్లు మారుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యం జరిగితే.. దానికి మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి విషయాలు కూడా పవన్ కు తెలీకుండా ఉంటాయా?