Home News Politics

జనసేనాని ఇక్కడ బరిలో నిలుస్తారా….?

SHARE

ఈ నియోజకవర్గం గోదావరి జిల్లాల్లో వెరీ వెరీ స్పెషల్. ఏ పార్టీకి పూర్తిగా అవకాశమివ్వదు. అలాగని అధికారంలోకి వచ్చే పార్టీకి ఇక్కడ ప్రజలు ఓటెయ్యరనే నానుడి బలంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీ అధికారంలోకి చేపట్టడం కష్టం. అలాగని ఎప్పటికప్పుడు విజేతలను మారుస్తుండటం ఈ నియోజకవర్గం విశిష్టత. అదే తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు ఇక్కడి నుంచి పోటీచేయాలని ఆసక్తిగా ఉందని ప్రకటించడంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

పిఠాపురం ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు తెలుగుదేశం, రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయి. మిగిలిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులతో పాటు ప్రజారాజ్యం, బీజేపీ పార్టీలు గెలిచాయి. ఈ నియోజకవర్గంలో గెలుపు అంచనాలు సర్వేలకు కూడా అందవు. ప్రజల నాడి ఎలా ఉంటుందో కనుక్కోవడమూ కష్టమే. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఎస్వీఎస్ఎన్ వర్మ ఆ తర్వాత టీడీపీలో చేరిపోవడంతో ఈ స్థానం టీడీపీకి దక్కింది. ఇక్కడ వెన్నా నాగేశ్వరారావు ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున వంగాగీత 2009లో విజయం సాధించారు. 2004లో పెండెం దొరబాబు బీజేపీ తరుపున గెలుపొందారు.

గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ స్వతంత్ర అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు మద్యనే జరిగింది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి మద్దతిచ్చినా ఇక్కడ మాత్రం ఆ పార్టీకి ఓట్లు రాలేదు. అదీ ఈ నియోజకవర్గం ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్వీఎన్ఎస్ వర్మ టీడీపీ తరుపున బరిలోకి దిగనున్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా గత ఎన్నికల్లో 47 వేల మెజారిటీతో ఓడిపోయిన పెండెం దొరబాబుకు టిక్కెట్ దక్కుతుందో లేదో డౌటే. భారీ వ్యత్యాసంతో ఓడిపోవడంతో జగన్ ఈయనను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో జనసేనాని స్వయంగా పోటీకి దిగితే రాజకీయం రంజుగా ఉంటుందంటున్నారు. 2009లో ప్రజారాజ్యం గెలవడంతో ఈ నియోజకవర్గం సేఫ్ అని పవన్ భావిస్తున్నారు. అప్పట్లోనే చిరంజీవిని పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిందిగా అనేక మంది వత్తిడి తెచ్చారు. కానీ ఆయన పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. అందుకే పవన్ ఈసారి ఆచితూచి అడుగువేస్తారంటున్నారు. పిఠాపురంలో పోటీ చేస్తే ఇటు తూర్పుగోదావరి, అటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందని, రెండు జిల్లాల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవచ్చన్నది పవన్ భావన. అయితే సెలక్షన్ కమిటీ ఓకే చేస్తేనే తన పోటీ పిఠాపురం నుంచి ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పడం కొసమెరుపు. ఏది ఏమైనా పిఠాపురం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.