Home News Stories

హైదరాబాద్ లో వార్ వన్ సైడేనా…!

SHARE

నాలుగు దశాబ్ధాలుగా ఓల్డ్‌ సిటీ గడ్డపై ఒకే జెండా..! ఎన్నికలేవైనా… బరిలోకి ఓవైసీ బ్రదర్స్‌ దిగారంటే వార్‌ వన్‌ సైడ్‌. అలాంటి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం… ఇప్పుడు హాట్‌ సీట్‌గా మారింది. అనూహ్యంగా ఈసారి అన్నాదమ్ములిద్దరూ… నామినేషన్‌ వేయడంతో… మరింత ఆసక్తి నెలకొంది. ఎంఐఎం కంచుకోట ను బీజేపీ బద్దలు కొడుతుందా..? అదే వర్గానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తాడా..? లేదా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా…? హైదరాబాద్‌ కా బాద్‌ షా కౌన్‌ హై…. !

ఒకప్పుడు నవాబుల రాజ్యం. అరవై ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌. పార్లమెంట్‌ స్థానాల్లో ప్రత్యేకంగా నిలిచే హైదరాబాద్‌ బాద్‌షా ఎవరు? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. జంటనగరాల్లో ఒకటైన హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానిది ఘనమైన చరిత్రే. 1952 నుంచి వరుసగా ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా.. మొదట్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. వరుస విజయాలు నమోదు చేసింది కాంగ్రెస్‌. కానీ… 1980 తర్వాత సీన్‌ మారిపోయింది. ఎంఐఎం పార్టీ తరపున సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ.. 1984లో తొలిసారిగా ఇక్కడ విజయాన్ని నమోదు చేశారు. అక్కడి నుంచి మొదలు… హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటగా మలుచుకుంది ఎంఐఎం.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మలక్ పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బహదుర్‌పురా ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలోనూ గోషామహల్ మినహా ఎంఐఎం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ… ఎంఐఎం తన పట్టు నిలుపుకోవడంతో… హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కంచుకోటగా మార్చేసుకుంది. 2009లో టీడీపీ అభ్యర్థి జాహెద్ అలీఖాన్‌పై లక్షా 45 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల విజయంతో అసదుద్దీన్ ఓవైసీ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ.. బీజేపీ అభ్యర్థి భగవంతరావుపై లక్షా 97 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా… కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నియోజకవర్గంలో కలిశాయి. ఈ నియోజకవర్గం మొత్తంలో 41 లక్షల 77 వేల 703 మంది ఓటర్లున్నారు. ఇందులో 65 శాతం ఓటర్లు ముస్లీం ఓటర్లే కావడం విశేషం. పాతబస్తీ గడ్డపై చరిత్ర తిరగరాస్తమంటోంది బీజేపీ. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా భగవంత్‌ రావు బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో భగవంత్‌ రావుపై ఓవైసీ లక్షా 97 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ.. ఈసారి గట్టీ పోటీ ఇవ్వడమే కాదు.. గెలుపు దిశగా వెళ్తామంటున్నారు భగవంత్‌ రావు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లో ఒకటైన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజాసింగ్‌ క్యాడర్‌తోపాటు… మలక్‌పేట్, గోల్కొండ ప్రాంతాల్లో బీజేపీకి కొంతపట్టుంది. దీన్ని ప్లస్‌ చేసుకుని… మజ్లిస్‌ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా పావులు కదుపుతోంది బీజేపీ.

కాంగ్రెస్‌ బద్ధ శత్రువుగా మారిన మజ్లిస్‌ను సొంత గడ్డపై ఓడించాలని కసరత్తులు చేస్తోంది. ఓవైసీ ని గట్టిగా ఎదుర్కునే శక్తి సామర్థ్యాలున్న బలమైన అభ్యర్థిని రంగంలోకి దించింది తెలంగాణ కాంగ్రెస్‌. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు.. పార్టీలోని సుమారు 39 మంది పీసీసీకి దరఖాస్తు చేసుకోగా.. నాంపల్లి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన ఫిరోజ్‌ ఖాన్‌ పేరును ఫైనల్‌ చేసింది ఏఐసీసీ. అసద్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే.. ముస్లిం సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్న అదే వర్గానికి చెందిన ఫిరోజ్‌ ఖాన్‌ అయితేనే కరెక్ట్‌ అని భావించింది కాంగ్రెస్‌. ఇప్పటికే నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ముచ్చటగా మూడుసార్లు బరిలోకి దిగి స్వల్ప ఓట్లతో అపజయం పాలయ్యారు ఫిరోజ్‌ ఖాన్‌.

ఎన్నికేదైనా… ఓవైసీ బ్రదర్స్‌ బరిలో దిగారంటే… గెలుపు ఖాయమే అనేది ఆనవాయితీగా మారింది. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో… హైదరాబాద్‌లో ఎంఐఎం పార్టీ బలమైన రాజకీయశక్తిగా ఎదిగింది. అయితే… అధికార పార్టీతో స్నేహ వైఖరి ఎంఐఎంకు కలిసివచ్చినా.. అదే ప్రత్యర్థి పార్టీలు ఈ ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా మలుచుకుంటున్నాయి.