Home News Politics

గుంటూరులో ఆ అభ్యర్ధి పై కాయ్ రాజా కాయ్…!

SHARE

ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే .. పేరుకి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా ఆయన అధికారపక్ష నేతలతో రాసుకుపూసుకు తిరుగుతుంటారు .. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో సీటు పట్టి … విజయం సాధించిన ఆయనకు ఈ సారి కూడా వైసీపీ టికెట్‌ ఓకే చేసింది .. పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నా .. పీకే లెక్కలతో ఆయనవైపే మొగ్గు చూపింది ప్రతిపక్షం… ఇటు చూస్తే అక్కడ అధికారపక్ష అభ్యర్ధి ఎవరన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. అయితే సదరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గెలుపోటములపై అప్పుడే బెట్టింగులు మొదలైపోయాయి .. సొంత పార్టీ నేతలే ఆయన భవితవ్యంపై కాయ్‌ రాజా కాయ్‌ అంటుండటం గుంటూరులో ఆసక్తికరంగా తయారైంది…

గుంటూరు తూర్పు నియోజకవర్గంపై తిరిగి వైసీపీ జెండా ఎగిరే పరిస్థితులు ఎంత వరకు ఉన్నాయి … అధికార టీడీపీ ఇంత వరకు అభ్యర్దిని ప్రకటించకపోవడం ఆ పార్టీకి కలిసి వస్తుందా? .. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ది ప్రకటన ఆలస్యం అయితే విజయం తమదే అన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధీమా నిజమవుతుందా? .. ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార పక్షం నేతలతో టచ్ లో ఉంటూ తన పనులు చక్కబెట్టుకునే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఈ సారి గట్టెక్కుతారా? ఆయన వ్యవహారతీరుతో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్‌ అవుతుంది? ఈ అంశాలపై నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

ఇంకొందరు అయితే వైసీపీ ఎమ్మెల్యే గా ముస్తాఫా గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగులు వేస్తున్నారు … టీడీపీ నుండి అభ్యర్ది ఖరారు కాకపోయినప్పటికి వైసీపీ లోని అసంతృప్తి వాదులను కేంద్రంగా చేసుకొని ఎవరికి తోచిన స్దాయిలో వారు బెట్టింగులు వేసుకుంటున్నారు .. ముస్తాఫా గెలుపోటములపై వైసీపీలోనే పందాలు కాస్తుండటం విశేషం .. ఇప్పటికే ముస్తాఫాకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ పార్టిలోని కొందరు నేతలు జగన్ కు నేరుగా అల్టిమేటం ఇచ్చారు… అసమ్మతి నేతలు సమావేశం నిర్వహించినప్పటికి పీకే సర్వే టీం పుణ్యమాని మళ్ళీ ముస్తాఫానే అభ్యర్ది అంటూ జగన్ ఖరారు చేశారు… దీంతో నియోజకవర్గంలో ముస్తాఫా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. అయితే ఇప్పటికే ముస్తాఫా అభ్యర్ధిత్వంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది…

వైసీపీలో ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ సీనియర్ నేత ఎంపీ రాయపాటి సాంబశివరావు తనకు గురువు అని బహిరంగంగా చెప్తుంటారు ముస్తఫా … దాంతో పాటు టీడీపీ నేతలతో చట్టాపట్టాలు వేసుకొని తిరగటం, తన వ్యాపార లావాదేవీల కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలను దూరంగా ఉంచటం కూడా ముస్తాఫాకు మైనస్ పాయింట్లుగా మారి ఆయనపై అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. అయితే వాస్తవానికి వ్యాపారాలు, రాజకీయాలు వేరు .. రెండింటికి సంబంధం ఉండదు .. అయితే వ్యాపార లావాదేవీల నేపధ్యంలో రాజకీయ అడ్డంకులను అధిగమించేందుకు .. ముస్తఫా సొంత పార్టీని, క్యాడర్ ను పణంగా పెట్టటం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి…

పీకే టీం పుణ్యాన టిక్కెట్ మళ్ళి దక్కించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడున్న పొలిటికల్ వార్ ని లైట్ తీసుకుంటున్నారన్న టాక్ నడుస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అధికార, విపక్షాల మధ్య భారీ గ్యాప్‌ ఉంది .. ఇలాంటి పరిస్దితులలో అధికార పక్షానికి టచ్ లో ఉంటూ తనది డిఫరెంట్ వర్క్ స్టైల్ అంటున్న ముస్తఫాకు … ఆ స్టైల్‌ ఎంత వరకు కలిసివస్తుందో కాని .. సొంత పార్టీలోనే ఆయన గెలుపోటములపై బెట్టింగులు జరుగుతుండటం ఆసక్తికరంగా మారింది..