Home News Politics

గుంటూరు జిల్లాలో ఆసక్తిరేపుతున్న నియోజకవర్గాలు..!

SHARE

గుంటూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా ఉంది. నామినేషన్లు, వాటి పరిశీలన ముగియటంతో బరిలో ఉన్న నేతలు ఎవరో తేలుతోంది. జిల్లావ్యాప్తంగా 17 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. మూడు లోక్‌సభ నియోజకవర్గాలలో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ చోట్ల ముఖాముఖి, మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉంది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన 17 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఈ సారి బరిలో ఉన్నారు. వీరితో పాటు నరసరావుపేట లోక్‌సభస్థానం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరపున మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ , ప్రత్తిపాడు నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగారు.

గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధ్య అసక్తికర పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎంపీ గల్లా జయదేవ్‌ మళ్లీ బరిలోకి దిగగా… గుంటూరు పశ్చిమ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వైసీపీ తరపున ఆయనతో తలపడుతున్నారు. జనసేన తరపున బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌వలి పోటీ చేస్తున్నారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ తరపున మరోసారి బరిలోకి దిగగా. వైసీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తలపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పక్కాల సూరిబాబు పోటీ చేస్తున్నారు.

బాపట్ల పార్లమెంటరీ నియోజక వర్గంలో సిట్టింగ్‌ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మళ్లీ టీడీపీ తరపున పోటీ చేస్తుండగా, వైసీపీ తరపున నందిగం సురేష్‌ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ తరపున కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, బీఎస్పీ అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దేవానంద్‌ పోటీ చేస్తున్నారు. గుంటూరు తూర్పులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా వైసీపీ నుంచి మళ్లీ పోటీచేస్తుండగా… తొలిసారిగా నసీర్‌ అహ్మద్‌ టీడీపీ తరపున, జియావుర్‌ రెహ్మాన్‌ జనసేన తరపున బరిలోకి దిగారు. గుంటూరు పశ్చిమలో టీడీపీ తరపున మద్దాళి గిరిధర్‌, వైసీపీ నుంచి చంద్రగిరి ఏసురత్నం, జనసేన తరపున తోట చంద్రశేఖర్‌ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ముగ్గురు నేతలు తొలిసారి తలపడుతున్నారు.

తాడికొండలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ టీడీపీ నుంచి మళ్లీ పోటీచేస్తుండగా…. తొలిసారిగా డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి వైసీపీ తరపున బరిలోకి దిగారు. మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేశ్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగగా… సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ తరపున మళ్లీ పోటీచేస్తున్నారు. ఇక్కడి నుంచి జనసేన, సీపీఎం మద్దతుతో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. ప్రత్తిపాడులో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టీడీపీ తరపున బరిలోకి దిగగా… మాజీ ఎమ్మెల్యేలు రావెల కిషోర్‌బాబు జనసేన తరపున, మేకతోటి సుచరిత వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు.

తెనాలిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ టీడీపీ తరపున మళ్లీ బరిలోకి దిగగా, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ జనసేన నుంచి అన్నాబత్తుని శివకుమార్‌ వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురు నేతలు తలపడ్డారు. నాదెండ్ల గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీచేయగా… ఈ సారి జనసేన తరపున తలపడుతున్నారు. పొన్నూరులో సీనియర్‌ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ టీడీపీ తరపున ఆరోసారి పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి కిలారి రోశయ్య బరిలోకి దిగారు. జనసేన తరపున పార్వతీ నాయుడు పోటీ చేస్తున్నారు.

సత్తెనపల్లిలో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు మళ్లీ టీడీపీ తరపున పోటీ చేస్తుండగా… మాజీ ఎమ్మెల్యేలు అంబటి రాం బాబు వైసీపీ తరపున, యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేన తరపున బరిలో నిలిచారు. చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ నుంచి మళ్లీ పోటీ చేస్తుండగా… తొలిసారిగా విడదల రజని వైసీపీ తరపున బరిలోకి దిగారు. వినుకొండ నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మళ్లీ పోటీ చేస్తుండగా… వైసీపీ తరపున బొల్లా బ్రహ్మనాయుడు తలపడుతున్నారు.

గురజాలలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండగా… తొలిసారిగా కాసు మహేష్‌రెడ్డి వైసీపీ నుంచి తలపడుతున్నారు. పెదకూరపాడులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ టీడీపీ నుంచి మళ్లీ పోటీచేస్తుండగా… తొలిసారిగా నంబూరు శంకరరావు వైసీపీ తరపున తలపడుతున్నారు. నరసరావుపేట నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగగా… తొలిసారిగా డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు టీడీపీ తరపున పోటీచేస్తున్నారు. జనసేన నుంచి సయ్యద్‌ జిలానీ పోటీకి దిగారు.

మాచర్లలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి మళ్లీ పోటీచేస్తుండగా… తొలిసారిగా అన్నపురెడ్డి అంజిరెడ్డి టీడీపీ తరపున బరిలోకి దిగారు. వేమూరులో మంత్రి నక్కా ఆనందబాబు టీడీపీ తరపున మళ్లీ పోటీచేస్తుండగా… మేరుగ నాగార్జున వైసీపీ తరపున మరోసారి తలపడుతున్నారు. ఐఆర్‌ఎస్‌ విశ్రాంత అధికారి అప్పికట్ల భరత్‌భూషణ్‌ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. రేపల్లెలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ టీడీపీ తరపున మళ్లీ పోటీ చేస్తుండగా… మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు మరోసారి వైసీపీ తరపున తలపడుతున్నారు. జనసేన తరపున కమతం సాంబశివరావు పోటీ చేస్తున్నారు. బాపట్ల నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ వైసీపీ తరపున బరిలోకి దిగగా… ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌ టీడీపీ తరపున మరోసారి పోటీ చేస్తున్నారు.