Home News Politics

ఎవ‌రీ రాధిక‌?

గూగుల్ ట్రెండ్స్‌లో సెన్సేష‌న్‌

SHARE

రాధిక‌. రాధికా కుమార‌స్వామి. నిన్నామొన్న‌టిదాకా ఎవ‌రికీ పెద్ద‌గా తెలీని పేరు వారంరోజుల్లోనే పాపుల‌ర్ అయిపోయింది. ఇప్పుడంతా ఆమెగురించే సెర్చ్ చేస్తున్నారు. ఆమె వివ‌రాలు తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఏ రేంజ్‌లో ఆమెమీద ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారంటే… వారంరోజుల్నించీ గూగుల్ ట్రెండ్స్‌లో ఆమెదే టాప్ పొజిష‌న్‌. ఇంత‌కీ ఆమె సెల‌బ్రిటీనా? ఓవ‌ర్‌నైట్ బిలీనియ‌రా? మిస్ యూనివ‌ర్స్ కిరీట‌మో, మిస్‌వ‌ర‌ల్డ్ టైటిల్ కొట్టేసినా బ్యూటీనా? ల‌క్ష‌కోట్ల లాట‌రీ కొట్టేసిన ల‌క్కీ ఉమెనా? ఇంత‌కీ త‌నెవ‌రు?

అనుకున్న‌వేం కావు. ఆమె మిస్ కూడా కాదు. మిసెస్‌. మిసెస్ కుమార‌స్వామి. ఎస్‌..క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఆశ‌ల్ని నేల‌కూల్చి సీఎం పీఠంపై కూర్చోబోతున్న కుమార‌స్వామి భార్య‌. కర్ణాట‌క సీఎం భార్య కావ‌టంతోనే ఆమెకింత పాపులారిటీ. ఐదుప‌దుల వ‌య‌సు ఎప్పుడోనిండిన నాయ‌కుడి భార్య గురించి కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏముంటుంద‌నే క‌దూ? జేడీఎస్ నేత హెచ్‌డి కుమార‌స్వామి లేటు వ‌య‌సులో 2006లో రాధిక‌ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్ద‌రికీ ఇది రెండోపెళ్లి. వీరికిప్పుడో కూతురుంది. సినిమా న‌టిగానే కాదు ప్రొడ్యూస‌ర్‌గా కూడా క‌న్న‌డ సిన్మా ఇండ‌స్ట్రీకి రాధిక ప‌రిచ‌య‌మే.

ఎనిమిదేళ్ల క్రితం కాంగ్రెస్ నాయ‌కురాలు, సినీన‌టి ర‌మ్య చెప్పేదాకా కుమార‌స్వామి రెండోపెళ్లి వ్య‌వ‌హారం బ‌య‌టి ప్ర‌పంచానికి తెలీదు. కుమార‌స్వామి కూడా నిజ‌మేన‌ని అంగీక‌రించ‌క త‌ప్ప‌లేదు. ప‌ద‌హారేళ్ల వ‌య‌సులోనే సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన రాధిక ప‌దిహేనేళ్ల‌క్రితం త‌న‌కంటూ ఓ క్రేజ్ తెచ్చుకుంది. 2002లో ఆమె హీరోయిన్‌గా ఏకంగా ఐదు సిన్మాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ఐదేళ్ల‌పాటు ఏడాదికి ఐదుసిన్మాల చొప్పునే చేస్తూవ‌చ్చింది రాధిక‌. మొత్తం 30 సిన్మాల్లో ఆమె హీరోయిన్‌. త‌న‌కంటే కుమార‌స్వామి దాదాపు పాతికేళ్ల పెద్ద‌. అయినా ఇద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు.

మే 13నుంచి మే 19 మ‌ధ్య వారంరోజుల్లో రాధిక కుమార‌స్వామి కోసం పోటీలు ప‌డి సెర్చ్ చేస్తున్నారు నెటిజ‌న్లు. గూగుల్ ట్రెండ్స్‌లో ఈ పేరే ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉంది. గూగుల్ ట్రెండ్స్ ఇండియాలో సెర్చింజ‌న్‌ల‌కు వంద పాయింట్లు ఇస్తే అత్యున్న‌త సెర్చ్ వ‌ర్డ్‌గా గుర్తింపు ఉంటుంది. చివ‌రికి ఖ‌త‌ర్‌, కువైట్‌, యూఏఈ, శ్రీలంక‌లోనూ ఆమెవ‌రో తెలుసుకునేందుకు ఎంతోమంది ఆస‌క్తి చూప‌టంతో మిసెస్ కుమార‌స్వామికి తెగ పాపులారిటీ వ‌చ్చేసింది.