Home News

గంటా పై అవంతి మార్క్ పాలిటిక్స్…!

SHARE

ఆయనో మాజీమంత్రి… పవర్లో వున్నప్పుడు కంటిచూపుతో అధికారులను శాసించారు… ఆ క్రమంలో కొంత మందికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు… దాంతో వారంతా ఆయన వర్గీయులన్న ముద్రపడిపోయింది… కాలం గిర్రున తిరిగింది … అధికారం చేతులు మారింది… ఇప్పుడు ఆ అధికారుల పరిస్థితి అడకత్తెరలో పడ్డట్లు తయారైందంట … మేం ఎవరి మనుషులం కాదు.. ప్రభుత్వ మనుషులం మహాప్రభో అని మొత్తుకుంటున్నా…. నమ్మే పరిస్థితి కనిపించడం లేదంట. ఇప్పుడు మంత్రి అవంతి వీరికి చుక్కలు చూపిస్తున్నారట…!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు… శాశ్వత శత్రువులు వుండరనేది నానుడి… ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు… విశాఖజిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటాశ్రీనివాస్ ఒకప్పుడు మంచి మిత్రులు. సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ ఒకే పార్టీలో కొనసాగారు… ఒకరు మంత్రైతే…. మరొకరు ఎంపీ. ఒకప్పటి ఆత్మీయుల మధ్య ఏర్పడ్డ అంతరం… తక్కువ కాలంలోనే అగాధంగా మారిపోయింది.

ఇప్పుడు గంటా పేరు చెబితేనే అవంతి కస్సుబుస్సులాడుతున్నారు. బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం… వేదిక ఏదైనా గంటాశ్రీనివాస్ పై విరుచుకుపడుతున్నారు. అవకాశం వున్న ప్రతీసారీ సెటైర్లు పేలుస్తున్నారు. ఒకవైపు, గంటాను సునిశితంగా విమర్శిస్తూనే… మరోవైపు, జిల్లాపై తనదైన ముద్ర వేసుకునేందుకు చురుగ్గా ముందుకు సాగుతున్నారు. విస్తృత పర్యటనలు, రివ్యూలతో తీరిక లేకుండా గడుపుతున్నారు అవంతీ శ్రీనివాస్…

అదే సమయంలో మాజీమంత్రి గంటాశ్రీనివాస్ మార్క్ ను చెరిపివేసేందుకు ఆయన ప్రయత్నించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. గత ప్రభుత్వం ఆనవాళ్ళు కూడా కనబడ్డానికి అవంతి ఇష్టపడ్డం లేదు. పథకాలకే కాదు….అప్పట్లో పనిచేసిన అధికారులను దగ్గరకు రానీయడం లేదు… ఇటీవల జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియను నిస్పక్షపాతంగా, అవినీతి రహితంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి అవంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.