Home News Stories

గాజువాకలో గెలుపెవరిది…?

విశాఖ‌ప‌ట్నం ప‌ట్ట‌ణంలోని కీలక నియోజకవర్గం గాజువాక. కుల రాజకీయాలదే హవాగా నడుస్తున్న ఇక్కడ ఈసారి ఎన్నికల్లో హోరాహోరి పోరు తప్పేలా లేదు.కంటెస్ట్ చేసేది ఎవరైనా సరే తమ కులపోడు అయితే చాలు కళ్ళు మూసుకుని ఓటేస్తారు ఇక్కడి ఓటర్లు అంటారు రాజకీయ విశ్లేషకులు. గాజువాకకు ధనిక నియోజక వర్గం అనే ట్యాగ్ ఉంది. ఇక్కడ కాపు, యాదవ, ఎస్సి, గవర, రెడిక, మత్స్యకారుల కమ్యూనిటీలు ఉన్నాయి. కాగా ఈ సామాజికవర్గాలలో గెలుపు ఓటములపై ప్రభావం చూపేది మాత్రం కాపు, యాదవ వర్గాలే. గంగవరం పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ సెజ్, బీహెచ్ పివిలతోపాటు, పారిశ్రామిక ప్రగతి కేంద్రంగా నిలిచింది గాజువాక. ఇక్కడ జనసేన పార్టీ కూడా కీలకంగా ఉండటంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు….గాజువాక నియోజకవర్గంలోని పొలిటికల్ సినారియో పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్…

2009 లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గంలో చింతలపూడి వెంకటరామయ్య ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత కొంతకాలానికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఐంది. విభజన ప్రభావం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గడ్డుగా మారింది. ఈ కారణం వలన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతలపూడి వెంకట్రామయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. వైసీపీ, టీడీపీ లు మాత్రమే గాజువాకలో ఎన్నికల బరిలోకి దిగాయి. టిడిపి తరపున పల్లా శ్రీనివాస్ పోటీ చేయగా వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగారు. ఇద్దరి మధ్యన గట్టి వార్ నడిచినప్పటికీ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. దీనికి కారణం టీడీపీ కి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమే అంటారు. పవన్ కళ్యాణ్ తో మైత్రి కారణంగా కాపు, యాదవ, మత్స్యకార ఓటర్ల కాంబినేషన్ కలిసొచ్చి ఆ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి గెలిచింది అంటారు. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాకా అవి విశాఖ బీచ్ లో కలిసిపోయాయి అంటున్నారు స్థానికులు. అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని ఇక్కడి టాక్.

నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం ఈసారి ర‌స‌కందాయకంగా సాగ‌నుంది. ఇక్క‌డ నుంచి వైసీపీ,టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు, బీజేపీ ఇలా ఐదు పార్టీల నేత‌లు పోటీ చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. ఎలాగూ కాంగ్రెస్ ఎవ‌రినో ఒక‌రిని అభ్య‌ర్థిగా పెట్టాల్సి న ప‌రిస్థితి ఉంటుంది కాబ‌ట్టి ఆ పార్టీ కూడా రేసులో నిల‌బ‌డ‌నుంది. అయితే రేసులో ఎంత‌మంది అభ్య‌ర్థులు ఉన్నా.. పోటీ మాత్రం జ‌న‌సేన‌, వైసీపీ, సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ అభ్య‌ర్థి శ్రీనివాస‌రావు మ‌ధ్యే ఉండ‌నుంది. ఏపీలో ఇత‌ర జిల్లాల నుంచి అక్క‌డ‌కు వ‌చ్చి సెటిల్ అయిన వారు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు.
ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీనివాస‌రావుపై కాస్తంత వ్య‌తిరేక‌త ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న త‌మ్ముడు శంక‌ర్‌రావు పెత్త‌నం అధికం అవడ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ట‌. ఇదే విష‌యపై సొంత పార్టీ నేత‌లే తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ట‌. ఆయ‌న ఇన్వాల్వ్‌మెంట్‌తో పార్టీ శ్రేణుల‌కు ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణం ఉంద‌ని వాళ్లు ఆరోపిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే పార్టీ దక్కుతుంద‌న‌డంలో సందేహం లేనప్ప‌టికి పార్టీ శ్రేణుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే మాత్రం ఇబ్బంది త‌ప్ప‌ద‌నే వాయిస్ విన‌బ‌డుతోంది. మొదటిసారి 2014 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా తొలినాళ్లలో కుటుంబ ఒత్తిడులు, ద్వితీయశ్రేణి నాయకత్వం వంటి సమస్యలు చవి చూశారు. దీంతో అక్కడ పరిస్థితి తారుమారయ్యింది.

????????????????????????????????????

ఇక వైసీపీ విష‌యానికి వ‌స్తే తిప్ప‌ల నాగిరెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది. ఈయ‌న 2009, 2014 ఎన్నిక‌ల్లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్షంగా స‌త్సంబంధాలున్నాయి. ఈ ప్రాంతంపై మంచి ప‌ట్టు ఉన్న నేత‌గా చెప్పుకోవ‌చ్చు. రెండుసార్లు ఓడించిన ప్ర‌జ‌లు ఈసారి త‌న‌కు గెలుపు క‌ట్ట‌బెడ‌తార‌నే ధీమాతో ఆయ‌న ఉన్నారు. నాగిరెడ్డి రెండుసార్లు ఓడిపోవడంతో ప్రజల్లో కొంత సానుభూతి కూడగట్టుకుంది. పల్లా తో అసంతృప్తిగా ఉన్న జనం నాగిరెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి వైసీపీలో చేరడం అక్కడ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. విశాఖలో జగన్ పాదయాత్రకు కూడా మంచి స్పందన రావడం అదనపు అడ్వాంటేజ్. దీంతో వైసిపి శ్రేణులు గాజువాకలో గెలుపు తమదే అన్న ధీమా తూ ఉన్నాయి.

ఇక జ‌న‌సేన నుంచి చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈయ‌న 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌రుపున ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌తంలో ప‌నిచేసిన అనుభ‌వంతో ఈసారి జ‌న‌సేన నుంచి బ‌రిలో దిగాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇదే పార్టీ టికెట్ పొత్తులో భాగంగా త‌మ‌కు కేటాయించేలా చూసుకుంటామ‌ని, అందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి హామీ ఉంద‌ని ప‌లువురు క‌మ్యూనిస్ట్ నేత‌లు పేర్కొంటుండటం జ‌న‌సేన నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. న‌గ‌రంలో జ‌న‌సేన బ‌లంగా ప్ర‌భావం చూపే నియోజ‌క‌వ‌ర్గాల్లో గాజువాకే తొలిస్థానంలో ఉందన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఇక బీజేపీ నుంచి విశాఖ మాజీ మేయ‌ర్ పులుసు జ‌న‌ర్దాన్‌రావు బ‌రిలో దిగుతాన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఆ పార్టీకి ఇక్క‌డ పెద్ద‌గా ఓటు బ్యాంక్ అయితే లేదు…పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఏదేమైన ఈక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు.