విజయనగరం జిల్లాలో గజపతినగరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ ఐదుసార్లు, కాంగ్రెస్ మూడుసార్లు విజయం సాధించాయి. ఈ నియోజకవర్గంలో కాపు, వెలమ సామాజికవర్గ ఓటర్లు దాదాపు సమానంగా ఉంటారు. కులం ఓట్లు తీవ్రమైన ప్రభావం చూపే ప్రాంతంగా గజపతినగరంని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ గట్టి పట్టుండగా వైసీపీ సీనియర్ నేత బొత్స ఫ్యామిలీకి అదే రీతిలో గ్రిప్ ఉంది. నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేసేందుకు బొత్స పట్టుదలతో పని చేస్తుండగా కంచుకోటని కాపాడుకునేందుకు టీడీపీ అదే రేంజ్ ఫైట్ చేస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ప్రస్తుత సమీకరణలను బట్టి పోరు టగ్ ఆఫ్ వార్ గా ఉండబోతుంది గజపతినగరం నియోజకవర్గం పై తెలుగు పాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….
విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2009 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మరియు దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కొండపల్లి అప్పలనాయుడు వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు పై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ విక్టరి కొట్టిన బొత్స అప్పలనర్సయ్య 2104 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటి చేసి 30 వేల పై చిలుకు ఓట్లు సాధించి కొడిగట్టిన కాంగ్రెస్ పార్టీలోను తన స్టామినా చూపించారు.1984,1989,2004 ఎన్నికల్లో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకురాలు పడాల అరుణ విజయం సాధించారు.
ఇక టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన కడుబండి శ్రీనివాసరావుపై కొండపల్లి అప్పలనాయుడు 19వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాజీ ఎంపీ, దివంగత కొండపల్లి పైడితల్లి నాయుడు తనయుడిగా ఓసారి ఎంపీగా, మరోసారి ఎమ్మెల్యేగా ఓడిన ఆయనకు గత ఎన్నికల్లో సానుభూతితో పాటు టీడీపీ గాలి కలిసొచ్చి విజయం సాధించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలే ఎక్కువ అన్న టాక్ ఆయనపై ప్రజల్లో ఉంది. చాలా మంది నేతలు బాహాటంగానే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆయనకు టికెట్ ఇచ్చే యోచనలో లేరని, కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు టికెట్ రాదనుకుని నిర్ణయించుకున్న అదే పార్టీకి చెందిన కరణం శివరామకృష్ణ, కొండపల్లి కొండలరాజు, మాజీ మంత్రి పడాల అరుణ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
అలాగే సామాజికవర్గం వంటి అంశాలేమైనా కలసి వస్తే తప్పక తనకు టికెట్ లభిస్తుందని బోండపల్లి వైస్ ఎంపీపీ బొడ్డు రాము కూడా భావిస్తూ తన వంతు ప్రయత్నం తాను చేసుకుంటున్నట్లు సమాచారం. అప్పలనాయుడు చంద్రబాబును ఒప్పించి టికెట్ తెచ్చుకోగలుగుతారా..? చంద్రబాబుకు తన పై వచ్చిన ఆరోపణలపై ఏవిధమైన సమాధానం చెబుతారు..శ్రేణుల్లోని అసంతృప్తిని ఎలా చల్లార్చి అనుకూలంగా మార్చుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. ఆయన త్వరలో మెదిలే తీరుపైనే అతని రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.
మారిన రాజకీయ పరిణామాల్లో బొత్స ఫ్యామిలీ వైసీపీ తీర్ధం పుచ్చుకోగా గజపతినగరంలో తిరిగి పట్టు బిగించిందేందుకు ప్రయత్నిస్తున్నారు బొత్స సత్యానారాయణ. అందుకే ఇక్కడి నుంచి పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కడుబండి శ్రీనివాసరావును మరో చోట పోటీ చేయించేందుకు పావులు కదిపిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పలనర్సయ్యకు వైసీపీ సీటు దాదాపు ఖరారైనట్టే. ఆయనకు టికెట్ ఇప్పించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ గెలిచి తమ సత్తా చాటాలని బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ పట్టుదలతో ఉంది. జనసేన కూడా అంత ఈజీగా ఈ ఈ సీటును వదులుకోకూడదని భావిస్తోందంట. కాపు ఓట్లు బలంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
అయితే ప్రధానంగా మాత్రం ఇక్కడ టీడీపీ, వైసీపీల మధ్యే పోరు కొనసాగుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఫైనల్గా టీడీపీ నుంచి మళ్లి సిట్టింగ్ అప్పలనాయుడు పోటీ చేస్తే వైసీపీ నుంచి అప్పలనరసయ్య రంగంలో ఉంటే అప్పలనరసయ్యకే ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది.