Home News Stories

ఈవీఎం మిస్టరీ-2: అసలెవరీ హ్యాకర్ షుజా…మిలటరి గ్రేడ్ ఫ్రీక్వెన్సీ కథేంటీ…?

SHARE

అసలెవరీ హ్యాకర్ షుజా..? ఆయన చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలెన్ని? షుజా చెప్తున్న మిలటరీ గ్రేడ్ లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? వాటిని ఎవరు వాడతారు? ఆ సిగ్నళ్లతో ఎక్కడో ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యమేనా? షుజా చెప్తున్న మాట్లలో వాస్తవాలెన్ని?


ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యవచ్చంటూ ఓ హ్యాకర్ చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మరో మూడు నెలల్లో దేశం సార్వత్రిక ఎన్నికల ముందుకు వెళ్లబోతోంది. ఇప్పటికే కేంద్ర పీఠం కోసం పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా గెలవాల్సిందే అన్న పట్టుదలతో మోడీ ప్రభుత్వం ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తోంది. మరోపక్క.. కాంగ్రెస్ కూడా తాజా విజయాలతో బీజేపీయేతర కూటమిలో బరిలోకి దిగి బల సమీకరణలో ఉంది. మరోపక్క ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మరో కూటమికి సమీకరణాలు జరుపుతున్నారు. కేంద్ర పీఠం కోసం అన్ని పార్టీలూ ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కానీ ఇలాంటి టైంలో సయ్యద్‌ షుజా అనే హ్యాకర్… చేసిన విమర్శలు ఇప్పడు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమా? అసాధ్యమా? అన్న అంశంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఈసీదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షుజా ఆరోపణల్ని ఈసీ ఖండించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది. లండన్‌లో జరిగిన ఈ ప్రెస్ మీట్‌కు… షుజా ప్రత్యక్షంగా హాజరు కాలేదు. కానీ ఈ ప్రెస్‌మీట్‌కి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ హాజరవ్వడం రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం ద్వారా.. కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర తీస్తోందంటూ బీజేపీ సీనియర్ నేతలు విమర్శించారు.


ఈ రాజకీయ వివాదాలు, విమర్శలు పక్కన బెడితే.. షుజా చేసిన ఆరోపణల్లో చాలా అంశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రెస్‌ మీట్‌కి నేరుగా హాజరవుతాన్న షుజా… ఆపై స్కైప్‌లోనే కనిపించారు. పైగా ఆయన ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయవచ్చో స్వయంగా ప్రదర్శించి చూపిస్తారని ముందుగా ప్రెస్‌కి చెప్పారు. దీంతో ఆయన ప్రెస్‌మీట్‌కి దేశ విదేశాల మీడియా ఆసక్తి చూపించింది. కానీ చివరి నిముషంలో ఆయన నేరుగా రాకుండా, కాలిఫోర్నియాలో ఓ రహస్య ప్రదేశం నుంచి మాట్లాడారు. అంతే కాదు.. తన వెనుక పరిసరాలు ఏవీ తెలియకుండా, వీడియోలో తన ముఖం కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈవీఎం హ్యాకింగ్ డిమానిస్ట్రేషన్ గురించి అడిగితే… నాలుగు రోజుల కిందటే న్యూయార్క్ లో తనపై దాడి జరిగిందని, అందుకే డిమానిస్ట్రేషన్ ఇవ్వలేకపోతున్నానని అన్నాడు.

తాను తన బృందం ECILలో దశాబ్ద కాలంగా ఔట్‌ సోర్సింగ్‌ సేవలందించామన్నది షుజా చెప్తున్న మాట. కానీ ECIL అధికారుల్లో కొందరు తీవ్రంగా ఖండిస్తోంది. EVMల తయారీలో ఔట్ సోర్సింగ్‌ సేవల్ని వినియోగించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చింది. అసలు తమ సంస్థలో మరే ఇతర విభాగంలోనూ షుజా పేరుతో ఎవరూ లేరని ఆ సంస్థ ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ పక్కన బెడితే… షుజా చేసిన ఆరోపణల్లో కూడా అంశాలు అసంబద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ అడ్డుకున్నామన్నారు. కానీ యూపీ ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందన్నారు. మళ్లీ గతేడాది కూడా ట్యాంపరింగ్‌ అడ్డుకోవడం వల్లే… ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నెగ్గుకొచ్చిందన్నారు.


ఇక ఈ రాజకీయ కోణాలు పక్కన బెడితే… ఈవీఎం ట్యాంపరింగ్‌కి ఉపయోగించినట్లు చెప్తున్న మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ మీద అందరి దృష్టి పడుతోంది. వైర్ లెస్ గా సమాచారాన్ని పంచుకోడానికి రేడియో సిగ్నళ్లను ఉపయోగిస్తారు. ఇది మూడు కేటగిరీలుగా ఉంటుంది. హైఫ్రీక్వెన్సీ, వెరీ హైఫ్రీక్వెన్సీ, అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ. పోలీసులు వాడే వైర్ లెస్‌ పరికరాలు వంటవి ఇలాంటి సిగ్నళ్లతోనే పనిచేస్తాయి. తొలినాళ్లలో వాడే జీఎస్‌ఎం ఫోన్లలో తక్కువ ఫ్రీక్వెన్సీ వాడటం వల్లనే మాట్లాడుకోడానికి మాత్రమే వీలు పడేది. కానీ ఇప్పుడు వీటన్నింటికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నళ్లతో మన సెల్‌ ఫోన్లు వాడుతున్నాం కాబట్టే మాటలతో పాటు, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకుంటున్నాం. కానీ ఇప్పటికీ మిలటరీ, పోలీసులు 3 మెగాహెడ్జ్‌ల నుంచి 30 మెగా హెడ్జ్‌ల తో వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను కొనసాగిస్తున్నాయి.

ఈ వ్యవస్థలో లో పవర్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంటే… తక్కువ వేగంతో డేటా ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. సైన్యంలో వాడే వీహెచ్‌ఎఫ్‌ పరికరాలతో దగ్గర్లో ఉండే మాడ్యూల్స్ ను కంట్రోల్ చేయడం సాధ్యమన్నది టెలికాం ఇంజనీర్లు చెప్తున్న మాట. అంటే ఇలాంటి పద్దతిలో ఈవీఎంలను హ్యాక్ చేశారన్నది షుజా లాంటి వాళ్ల ఆరోపణ. నిజానికి లో ఫ్రీక్వెన్సీతో పనిచేసే కమ్యూనికేషన్ పరికరాలతో ఒకదానితో ఒకటి హ్యాక్ చేయవచ్చేమో కానీ… వాటితో ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమన్నది ఈసీ ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఎందుకంటే ట్యాంపరింగ్‌కి ఎలాంటి ఆస్కారం లేకుండా… వాటిని కట్టుదిట్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నామని ఈసీ చెప్పుకొస్తోంది.

అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లోనే ఈవీఎంలు వాడటం లేదని… విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈవీఎంల మీద వస్తున్న ఆరోపణలకు సమాధానమివ్వలేక ఎన్నికల్లో వాటి వాడకాన్ని ఆపేశారు. కానీ భారత్‌లో కూడా బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలన్న డిమాండ్లు ఎంత వరకూ కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెట్రోల్‌ బంకుల్లో మీటర్లను ట్యాంప్‌ చేసినట్లు ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యవచ్చని అఖిలేష్‌ యాదవ్ విమర్శించారు. కానీ ఈసీ మాత్రం అలాంటిదేం లేదని… పెట్రోల్‌ బంకుల్లో మీటర్లను, ఆటో మీటర్లను ట్యాంపర్ చేసినట్లు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం అసాధ్యమంటోంది. ఒక్కసారి ఇందులోకి డేటా నిక్షిప్తమయ్యాక.. దాన్ని మార్చడానికి వీల్లేదని చెప్తోంది. పూర్తిగా రీసెట్‌ చేశాకే. మళ్లీ ఆ ఈవీఎం వాడటం సాధ్యమవుతుందని చెప్తున్నారు సైబర్ నిపుణులు.

ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యవచ్చన్న అభిప్రాయాలే తప్ప… ఇప్పటి వరకూ ఎవరూ వాటిని అధికారికంగా రుజువు చెయ్యలేదు. వాటి తయారీదారులు కూడా ట్యాంపర్ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యడం కుదరదని ఈసీయే బల్లగుద్ది మరీ చెప్తోంది. కానీ ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమే అని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఎవరి మాట ఎలా ఉన్నా.. ఈవీఎంల విశ్వసనీయత అన్నది ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది.