Home News Politics

డేట్ రాకతో రెండు రాష్టాల్లో కాక షురూ…!

SHARE

ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఖచ్చితంగా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. నేడు మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల కావడం, ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుండటంతో ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే 110 మంది అభ్యర్థుల ను ఆయన ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో చంద్రబాబు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రచారం.. ఎన్నికల సన్నాహాక సమావేశాలపై చంద్రబాబు కసరత్తు మొదలెట్టారు. తొలి జాబితా విడుదలపై నేతలతో చంద్రబాబు సమాలోచనలు జరిపి రెండు మూడు రోజుల్లో తొలి జాబితా విడుదలకు ప్రణాళిక సిద్దం చేశారు. 110 నుంచి 120 స్థానాలకు అభ్యర్ధుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించేలా ప్లాన్ చేశారు.

అభివృద్ధే అజెండాగా.. సంక్షేమ పథకాలే ప్రచారస్త్రాలుగా ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న టీడీపీ. అసంతృప్తులను బుజ్జగించేందుకు యనమల, సుజనా చౌదరిలతో రెండు కమిటీల ఏర్పాటు చేసింది. నాలుగు రోజుల్లో 13 జిల్లాల్లోని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్న చంద్రబాబు.సన్నాహాక సమావేశాల అనంతరం బహిరంగ సభలు.. రోడ్ షోలకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో అందుబాటులో ఉన్న నేతలతో జగన్ సమావేశమయ్యారు. పార్టీ లో చేరే వారి స్పష్టత కోరిన జగన్ చేరికల పర్వాన్ని త్వరగా ముగించి అభ్యర్థుల ఖరారు పై కసరత్తు పూర్తి చేయాలని సమావేశంలో లో చర్చించారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ లో సమర శంఖారావం సభ జరపనున్నారు. 14 న విజయవాడ లో జరగాల్సిన సమర శంఖారావ సభ ను రద్దు చేసి‌ ,అభ్యర్థుల ప్రకటన తర్వాత నేరుగా ప్రచారానికి వెళ్ళే యోచన లో వైసీపి ఉంది. దాదాపు 150 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు జగన్. నోటిఫికేషన్ విడుదలయిన రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి బస్సుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నట్లు ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం వామపక్షాలతో కలసి బరిలోకి దిగనున్నారు. ఆయన అభ్యర్థులన ఖరారు చేసే పనిలో ఉన్నారు. మొత్తం మీద ఏపీలో రాజకీయ పార్టీలకు కేవల నెలరోజులు మాత్రమే సయమం ఉంది. ఇప్పటివరకు అభ్యర్ధుల విషయంలో క్లారిటీ లేని జనసేనాని ఇక కసత్తు మొదలెట్టారు. 175 నియోజకవర్గాల్లో పార్టీ నుంచి ధీటైన అభ్యర్ధిని నిలబెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో రేపటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నాయి. చివరిగా ఖరారయ్యే అభ్యర్థులకు ప్రచారానికి ఎక్కువ సమయం కూడా లేకపోయే అవకాశముంది. ఇప్పటికి 175 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా అభ్యర్థులు ఖరారు కాలేదు. నామినేన్ల గడువుకు కూడా ఇక వారంరోజులు మాత్రమే సమయం ఉంది. ప్రచారానికి పదిహేను, ఇరవై రోజులకు మించి సమయం లేక పోవడంతో ఏపీ నేతలకు ఎన్నికల కమిషన్ చుక్కలు చూపించినట్లయింది.