Home News Stories

క్లైమాక్స్ కి చేరిన ఎన్నికల ఘట్టం…పీక్స్ కి చేరిన ప్రచారం…!

SHARE

ఎన్నికలఘట్టం క్లైమాక్స్‌కి చేరుకుంటోంది… ప్రచారానికి అయిదు రోజులే సమయముంది… దాంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి.. ప్రధాన పార్టీల తరపున స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగారు. .. పార్టీ అధినేతలు నేతలు రోజుకి మూడునాలుగు సభల్లో పాల్గొంటూ చెమటోడుస్తున్నారు… పోలింగ్‌కి కౌంట్‌డౌన్‌ మొదలవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీ ముఖ్యనేతలు వరుస సభలతో హోరెత్తిస్తున్నారు…

ఎన్నికల ప్రచారానికి ఇంకా అయిదు రోజులే గడువుంది .. ఈ నెల 11న ఎన్నికలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 9 సాయంత్రంతో మైకులు మూగబోనున్నాయి… దాంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇతరత్రా కార్యక్రమాలతో రాష్ట్రాల మూల మూలకీ వెళుతున్నారు… ప్రధాన పార్టీల తరపున స్టార్ క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగారు. జాతీయపార్టీల నేతలు మోడీ, రాహుల్ గాంధీ, అమిత్‌షా ఇతర కేంద్రమంత్రులు ప్రచారంలోకి అడుగుపెట్టారు. పార్టీల అధినేతలు, నేతలు తమవంతు ప్రచారం చేస్తుంటే…అభ్యర్థులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. తమ పార్టీకే ఓటు వేయమని అడుగుతున్నారు…

తెలంగాణ, ఏపిల్లో ముఖ్యమంత్రులు వరుస సభలతో ప్రచారాన్ని పీక్‌ స్టేజ్‌కి తీసుకెళ్తున్నారు … వారి వారసులు కేటీఆర్‌, లోకేష్‌లు ప్రచారపర్వంలో బిజీ అవుతున్నారు .. వైసిపి తరపున జగన్‌, షర్మిల, విజయలక్ష్మిలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు .. జనసేన అధినేత పవన్‌ భాగస్వామ్య పక్ష నేతలు మాయావతి వంటి వారితో కలిసి ప్రచారం చేస్తూ ఎన్నికల హీట్‌ పెంచుతున్నారు.పగలంతా ప్రచారంతో హడావుడి చేస్తున్న నేతలు..రాత్రయ్యే సరికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. చివరిరోజుల్లో ఏం చేయాలనే దానిపై ప్రతీ పార్టీ దగ్గరా షెడ్యూల్ సిద్ధంగా ఉంది. అధినేతలు, రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటుంటే.. సభలకు జన సమీకరణ, సన్నాహాల కోసం ఒక బృందం పని చేస్తోంది.

ఇక నియోజకవర్గాల్లో అసంతృప్తుల్ని దారికి తేవడం, ప్రచారంలో అందర్నీ సమన్వయం చేయడం, ప్రత్యర్థి పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌ లాంటి వ్యవహారాల కోసం రెండు జిల్లాలకు ఒక టీమ్ చొప్పున పని చేస్తున్నాయి. .. అన్ని పార్టీలకు కార్యాలయాల్లో కూర్చుని.. ప్రెస్‌మీట్లు పెట్టడం, ప్రత్యర్థుల ఆరోపణల్ని ఖండించడం, కౌంటర్ అటాక్ చేసేందుకు మరో టీమ్ సిద్ధంగా ఉంటోంది. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు.. యుద్ధ ప్రాతిపదికన స్పందించి.. వ్యవస్థలను కదిలించేందుకు కూడా సీనియర్ల బృందం అన్ని పార్టీలకు రెడీగా ఉంది…. అత్యంత కీలకమైన పోల్‌మెనేజ్‌మెంట్‌పై అన్ని పార్టీలు దృష్టిసారిస్తున్నాయి

ఎన్నికల సంఘం చివరి అయిదు రోజులపై మరింత నిఘా పెట్టింది. డబ్బుల పంపిణీ, బెదిరింపులు, రౌడీయిజం..ఇలాంటివన్నీ ఇప్పుడే జరుగుతాయనేది అధికారుల అంచనా. దీనికి తగ్గట్టే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.