Home News Politics

ఎలక్షన్ వార్ కి గులాబీ హార్డ్ కోర్ టీం ఇదేనా….!

టిక్కెట్ల గొడవ సద్దుమనిగింది,నామినేషన్లు ఆల్మోస్ట్ కంప్లీట్ ఇక ముందున్న 15 రోజులు టైం పార్టీలకు చాల కీలకం ఈ కీలక సమయంలో పార్టీలలో కోర్ టీంలే చాలా కీలకం…వీరే పార్టీలను ఒక ప్లానింగ్ తో విజయతీరాలకి చేర్చేది. ఎన్నికల వాతావరణంలో తెర వెనక పార్టీకి వెన్నుదన్నుగా, సైనికుల్లా పనిచేస్తున్న కొద్దిమంది పాత్ర మరువలేనిది. ఇక అధికార గులాబీ దళంలో రెండు నెలల క్రితం అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, వివిధ స్థాయిల్లో పార్టీ కేడర్‌లో అసంతృప్తిని చల్చార్చడం తదితర విషయాల్లో ఈ కోర్ టీం పాత్ర చాల కీలకంగా మారింది. ఈ టీఆర్ఎస్ కోర్ టీం పై తెలుగుపాపులర్ స్పెషల్ రిపోర్ట్….

ఈ ‘విక్టరీ టీమ్’లో ఒక్కక్కరిది ఒక్కో రకమైన పాత్ర. అలాంటీ కోర్ టీం ఇప్పుడు అధికారంలోకి రావడం కోసం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ముమ్మర ప్రచారంతోపాటు పార్టీ వ్యూహం, ఎత్తుగడలు, క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు ప్రోత్సాహం వంటి వ్యవహారాల్లో కీలకపాత్ర వహిస్తుంది. పార్టీ జనరల్ సెక్రటరీ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, లోక్ సభాపక్ష ఉప నేత బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రిగా కెటిఆర్, ట్రబుల్ షూటర్‌గా ఉన్న మరో మంత్రి హరీశ్‌రావు, పార్టీ వ్యవహారాల్లో విశ్వాసపాత్రుడిగా, సమర్ధవంతుడిగా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యక్తిగతంగా నీడలా కేసీఆర్ ని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే సంతోష్‌కుమార్, పార్టీ వ్యూహరచనలో శేరి సుభాష్‌రెడ్డి, సభా ఏర్పాట్లలో బాహుబలిగా గ్యాదరి బాలమల్లు, కెసిఆర్ ఎక్కడికి వెళ్ళినా అన్నీ చూసే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రచార సారధిగా శ్రవణ్‌రెడ్డి .. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా తెరపైన కనిపించేది కేసీఆరే అయినా వెనకుండి పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టేది మాత్రం వీరే….

సీఎం కుమారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి లో, ముఖ్యంగా పాలనా అంశాల్లో, మంత్రిగా కేటీఆర్ సమర్ధుడిగా గుర్తింపు పొందారు. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రిగా దేశ విదేశాలకు చెందిన అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు హైదరాబాద్‌ను వేదికగా చేయడంలో కీలక భూమిక పోషించారు. ఇక రాజకీయాల విషయంలో అభ్యర్థుల ఎంపిక తర్వాత క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పలు రకాల అసంతృప్తిని చల్లార్చడంలో సక్సెసయ్యారు. నియోజకవర్గాల్లో రెబల్స్ పోటీకి ఆస్కారం లేకుండా చర్చల ద్వారా వైరుధ్యాలను పరిష్కరించగలిగారు. ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వపరంగా వారి అవసరాలను తీరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించగలిగారు.

విపక్షాలు చేసే విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంలో సీఎం కేసీఆర్ తర్వాత సమర్ధుడిగా మంత్రి హరీశ్‌రావు గుర్తింపు పొందారు. కేవలం టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఏకైక ఉద్దేశంతో విపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడడాన్ని ప్రజలకు అర్థమైన తీరులో వివరించడంతో పాటు అందులోని కుట్ర కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిరంగంలో ఈ నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం చేపట్టిన శాశ్వత పరిష్కార చర్యలకు మద్దతుగా నిలవాల్సిన విపక్షాలు అడ్డుపుల్ల వేసే తీరులో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం, కోర్టుల్లో కేసులు వేయడంలో కాంగ్రెస్, తెలుగుదేశం అధినేత చంద్రబాబుల కుట్రలను బహిర్గతం చేయడంతో పాటు 19 ప్రశ్నలను సంధించి సమాధానం చెప్పాలని విపక్షాలకు సవాల్ విసిరారు. అసెంబ్లీ రద్దు తర్వాత దాదాపుగా సిద్దిపేట జిల్లాకు, గజ్వేల్ నియోజకవర్గానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్న హరీశ్‌రావు కెసిఆర్‌కు పెద్ద మెజారిటీ సాధించి పెట్టేలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగిన కె.కేశవరావు తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడం, సలహాలు ఇవ్వడంలో కెసిఆర్‌కు కుడి భుజంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ప్రజలకు అవసరమైన పథకాలను ప్రవేశపెట్టడం, వాటి అమలుకు తగిన పునాది వేయడంలో మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజ్యాంగ అంశాలపై పట్టు కలిగిన కేకే కేంద్రం నుంచి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన అంశాల్లో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు చేస్తూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

చట్టపరమైన అంశాల్లో లోతైన అవగాహన కలిగిన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో దేశ స్థాయిలో వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత చట్టపరంగా తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంలో ఎప్పటికప్పుడు కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశారు. హైకోర్టు విభజన, నియోజకవర్గాల పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన విశ్వవిద్యాలయాలు, సంస్థలు తదితరాలపై పూర్తిస్థాయిలో చొరవ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల అనంతరం కెసిఆర్ తలపెట్టిన ‘ఫెడరల్ ఫ్రంట్’ సంప్రదింపుల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

పార్టీ అభివృద్ధిలో మాత్రమే కాక రోజువారీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించే పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ కేంద్ర నాయకత్వానికి, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య కీలకమైన వారధి. భారీస్థాయి బహిరంగసభల్లో ముఖ్యమైన భూమిక పోషించే రాజేశ్వర్‌రెడ్డి అనేక సభలను విజయవంతం చేసి సమర్ధవంతుడిగా గుర్తింపు పొందారు. పార్టీ కోసం పనిచేసినవారికి తగిన బాధ్యతలు అప్పగిస్తూ ప్రోత్సహించడంలో ఎలా వ్యవహరిస్తారో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, పార్టీకి కళంకం తెచ్చేలా వ్యవహరించినా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలోనూ అంతే కఠినంగా వ్యవహరిస్తారు.

కెసిఆర్ కుమార్తెగా దేశమంతటికీ తెలిసిన కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపిగా తన వంతు కృషితో ప్రజా ప్రతినిధిగా కేంద్రం నుంచి రావాల్సిన అనేక అంశాల్లో పట్టువిడవకుండా ఫలితాలు సాధించారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో పార్టీ ప్రచారాన్ని డిజిటల్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా గుర్తింపు పొందిన కవిత తెలంగాణకు మాత్రమే పరిమితమైన బతుకమ్మకు విశ్వవ్యాప్త గుర్తింపు తేవడంలో చురుకైన పాత్ర పోషించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన సమయం మొదలు ప్రతీ సందర్భంలో కెసిఆర్‌కు తోడుగా, నీడగా ఉండే సంతోష్‌కుమార్ ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ అంతే కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేసీఆర్‌ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అటు ప్రభుత్వమూ, ఇటు పార్టీ, మరోవైపు కేసీఆర్‌కు వారధిగా ఉంటూ జటిల సమయాల్లోనూ సంయమనం కోల్పోని వ్యక్తిత్వం సంతోష్‌ది. సంక్షోభ సమయాల్లోనూ అసహనాన్ని ప్రదర్శించని అరుదైన వ్యక్తిగా ఆయన గురించి పార్టీలో చాలా మంది చెప్పుకుంటుంటారు. కేసీఆర్ ఎక్కడకు వెళ్ళినా ఆయనకు నీడ సంతోషే. కెసిఆర్ హెలికాప్టర్లలో జరిపే అన్ని సుడిగాలి పర్యటనలలో ఆయనే పక్కనుంటారు. అది బహిరంగసభేగానీ, ఆమరణ నిరాహారదీక్షేగానీ, అనారోగ్యమేగానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే భారీ కార్యక్రమమైనాగానీ కెసిఆర్‌కు కళ్ళూ, చెవులూ సంతోష్‌కుమారే. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో కెసిఆర్‌కు అప్పటికప్పుడు చేరవేస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో సంతోష్ ముందుంటారు.

పార్టీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించే రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు కెసిఆర్‌ను వెన్నంటే ఉన్నారు. ఆయన ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడంలో నమ్మకస్తుడిగా ఉన్నారు. రాజకీయ సలహాలు ఇవ్వడంతో పాటు కార్యదర్శిగా బహిరంగసభల నిర్వహణ, వివిధ పార్టీలతో సంప్రదింపులు, ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక.. ఇలా అనేక బాధ్యతల్లో పాలు పంచుకునే శేరి సుభాష్‌రెడ్డి ఏ విషయం కూడా బైటకు పొక్కకుండా పార్టీకి నిబద్ధుడిగా పనిచేస్తున్నారు. తాజాగా అభ్యర్థులందరికీ బి ఫాంలు ఇవ్వడంలోనూ కీలక భూమిక ఈయనదే. పార్టీకి సంబంధించిన అంశాల్లో గోప్యతను, రహస్యాన్ని పాటిస్తూ నాయకుల మొదలు కార్యకర్తల వరకు వారధిగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలకు కెసిఆర్ హాజరయ్యే కార్యక్రమం మొదలు పార్టీపరంగా వ్యూహాల రూపకల్పనలో నిరంతరం అందుబాటులో ఉండటమే ఈయన ప్రత్యేకత.

పార్టీ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను సమకూర్చడంలో తెలంగాణ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఒక చిన్న గదిగా ఉన్నప్పుడు అక్కడ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కెసిఆర్ అడుగుజాడల్లో భాగస్వామిగా నిలిచారు. ఆయన చిన్న గదిలో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు అక్కడే ఉండేవారు. ఇంటి నుంచి తెచ్చుకునే లంచ్ బాక్స్‌లో సైతం చెరి సగం అనే తీరులో కెసిఆర్, బాలమల్లు పార్టీ ప్రయాణంలో కలిసే ఉన్నారు. కెసిఆర్ సతీమణి శోభకు కూడా ఆయన అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఉద్యమం సమయం మొదలు ఇప్పటివరకూ భారీ స్థాయి బహిరంగ సభల ఏర్పాట్లు, నిర్వహణలో, హెలిప్యాడ్‌ల ఏర్పాటు, కేసీఆర్ పాల్గొనే సభల వరకు అన్నింటా బాలమల్లుకు ప్రత్యేక భూమిక ఉంది.

విద్యార్థి దశ నుంచే కెటీఆర్ తో, ఎంపీ జోగినపల్లి సంతోష్‌తో సన్నిహితంగా ఉండే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం పార్టీలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పటివరకు పార్టీనే అంటిపెట్టుకుని ఆ ఇరువురి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న పోచంపల్లి కెసిఆర్ పాల్గొనే ప్రతీ బహిరంగసభకు ఏర్పాట్లు ప్రారంభమయ్యేది మొదలు సభ పూర్తిగా ముగిసేంత వరకు అన్నీ తానై చూసుకుంటారు. పార్టీకి సంబంధించి మీడియా, ప్రచార బాధ్యతలను చూసుకునే పోచంపల్లి కేసీఆర్ కుటుంబంలో ఒకరిగా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన ప్రచార, పబ్లిసిటీ బాధ్యతలతో పాటు ఎన్నికలు లేదా బహిరంగసభల సమయంలో పార్టీ ప్రచార సామగ్రిని సమకూర్చుకుని వేదిక వరకు పంపిణీ చేయడంలో, కార్యకర్తలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోచంపల్లిదే. ఇతర పార్టీల కదలికలను నిశితంగా గమనిస్తూ అసంతృప్తిని తెలుసుకుంటూ తగిన వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించి అమలుచేయడంలో, ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ కుల సంఘాలతో సమన్వయం కొనసాగించడంలో ప్రత్యేకత పోచంపల్లి సొంతం.