Home News Politics

ఈసీ vs టీడీపీ ఫైట్ ఎందాకా…!

ఏపీలో పొలిటికల్ వార్ రాజకీయ పార్టీల మధ్య కాకుండా.. ఈసీ వర్సెస్ అధికార పార్టీ అన్నట్టుగా మారింది. ప్రతిపక్షం చెప్పినట్టుగా ఈసీ వ్యవహరిస్తోందని.. ఇలా వైసీపీ ఫిర్యాదు చేయడం.. అలా ఈసీ చర్యలు తీసుకోవడం చూస్తుంటే.. కచ్చితంగా వైసీపీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకారం ఉందనేది టీడీపీ వాదన… ఆ క్రమంలోనే ఐపీఎస్ అధికారుల బదిలీల విషయంలో వ్యవహరం హైకోర్టు దాకా వెళ్లడం.. హైకోర్టు ఈ వ్యవహరంపై తీర్పును రిజర్వ్ చేసి ఉంచడం వంటి సంఘటనలు చకచకా జరిగిపోవడంతో ఈసీ-టీడీపీ ఫైట్ ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇదే ఊపులో వైసీపీ మరింత మంది పోలీసు ఉన్నతాధికారులతోపాటు.. ఏకంగా డీజీపీని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది… దాంతో డీజీపీని తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే భావన టీడీపీ వర్గాల్లో కన్పిస్తోంది… దీంతో ఈ వ్యవహరంపై గట్టిగానే కసరత్తు చేయాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇదే తరహా వ్యవవహరాలు గతంలో ఎక్కడైనా.. ఏ రాష్ట్రంలోనైనా జరిగాయా…? అనే అంశాలపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం.

ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరును టీడీపీ ప్రస్తావిస్తోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 20 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి… ఈ విషయాన్ని ఎన్నికలు ముగిశాక.. తీరిగ్గా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు… పొరపాటు జరిగింది.. సారీ అంటూ చేతులు దులిపేసుకున్నారు… అలాంటి సీఈఓను ఇప్పటి వరకు ఎందుకు మార్చలేదనేది టీడీపీ వాదన… అంటే పక్క రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉంది కాబట్టి.. చర్యల్లేవని.. ఏపీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి.. ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసేసుకుంటున్నారన్నిది టీడీపీ వాదన ..

ప్రస్తుతం ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టుగానే 2017లో జార్ఖండ్ రాష్ట్రంలో ఇదే తరహా వ్యవహరం తెర మీదకు వచ్చింది… ఇప్పుడు ఏపీ ఏ విధంగా స్పందించిందో.. అప్పట్లో జార్ఖండ్ ప్రభుత్వమూ ఇదే తరహాలో స్పందించిందని అంటున్నారు. అలాగే ఇలాంటి సంఘటనలు ఇంకా ఏమైనా ఉన్నాయా..? అనే అంశాలపై రీసెర్చ్ చేస్తున్నారు టీడీపీ నేతలు… ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం పైనా ఫుల్ ఫోకస్ పెట్టాలని టీడీపీ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. మొన్నటి వరకు ఎన్నికలు.. ఎన్నికల ప్రచారం.. ప్రత్యర్థి పార్టీలు వేసే ఎత్తులకు పై ఎత్తులు.. వంటి విషయాల్లో బిజీగా ఉన్న టీడీపీ అగ్ర నేతలు.. ఇప్పుడు కొంచెం రూటు మార్చాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం… ఓవైపు ఎన్నికలకు సంబంధించిన రెగ్యులర్ వర్క్ చేస్తూనే.. మరోవైపు వైసీపీ అభ్యర్థుల గుణగణాలను వెలికి తీసే పనిలో బిజీగా పడినట్లు తెలుస్తోంది..

ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులు ఇచ్చిన నామినేషన్ పత్రాలనే ఆధారంగా చేసుకుని.. ఆయా అభ్యర్థులపై ఉన్న కేసులెన్నీ..? ఆ కేసులు వెనుకున్న నిజాలేంటీ..? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు… ఆ క్రమంలో ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు… మొత్తం 25 లోక్ సభ అభ్యర్థులుంటే.. వారిలో సగానికి పైగా అభ్యర్థులపై కేసులున్నట్లు చెప్తున్నారు .. వాటిల్లో మెజార్టీ అభ్యర్థులపై హత్యాయత్నం కేసులు మొదలుకుని.. వరకట్న వేధింపుల కేసులు వరకు ఉన్నాయంటూ లెక్కలేసి మరీ చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ ఎంపీ అభ్యర్థిపై సుమారు 10కు పైగా కేసులుంటే.. వాటిలో మూడు హత్యాయత్నం కేసులున్నాయని అంటున్నాయి టీడీపీ వర్గాలు… అలాగే పక్క రాష్ట్రంలో సదరు క్యాండెట్‌పై మైనింగ్ మాఫియా కేసులు.. ఫోర్జరీ వంటి కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇక ఇదే ప్రాంతానికి చెందిన మరో లోక్ సభ అభ్యర్థిపై మహిళలను వేధించిన కేసు.. దొంగతనం వంటి కేసులు కూడా ఉన్నాయట… ఈ ప్రాంతం నుంచే లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ అభ్యర్థికి వైఎస్ ఫ్యామ్లీతో రాజకీయ సంబంధాలే కాకుండా.. ఆర్థిక సంబంధాలు ఉన్న వ్యక్తుల అండదండలు ఉన్నాయట … ఓ అభ్యర్థి పైనైతే ఏకంగా వరకట్నం కేసు కూడా ఉందంటున్నారు. అలాగే బిగ్ షాట్స్ ఉండే ఓ రెండు జిల్లాల్లోని ఒకరిద్దరి అభ్యర్థులపైన కేసులున్నాయని.. అవి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉంటాయంటున్నారు…

ఇక రాయలసీమకు చెందిన ఓ అభ్యర్థి పైన ఉన్న కేసుల విషయానికొస్తే.. తన గొడౌన్లలో రైతులు నిల్వ ఉంచుకున్న శనగలను కాజేశారనే కేసు పెండింగులో ఉందట… ఈ తరహాలో ఒక్కో కేసును స్టడీ చేసి.. వాటి వెనుకున్న వాస్తవాలను కూపీ లాగే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే తరహా కసరత్తు అసెంబ్లీ అభ్యర్థుల మీదా జరుగుతున్నట్టు చెప్తున్నారు.. పూర్తి స్థాయి కసరత్తు ముగిశాక.. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్కెచ్ సిద్దం చేసుకుంటోంది టీడీపీ అధినాయకత్వం.