Home News Politics

తూర్పు గోదావరిలో సై అంటే సై అంటున్న ఆ రెండు పార్టీలు…!

SHARE

గోదావరి జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టిక్కెట్టు సాధించడమే లక్ష్యంగా నేతలు చక్రం తిప్పుతున్నారు. తమ పార్టీలో అవకాశం దక్కకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లనూ మరోవైపు సాగిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అధిష్ఠానాలకు సంకేతాలు పంపుతున్నారు. ఇక వైసీపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పుడున్న అభ్యర్థుల కంటే బలమైన వారు పార్టీలో చేరితే వారికి టిక్కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ అధినేత జగన్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా తోట వాణి వైసీపీలో చేరితే పెద్దాపురం టిక్కెట్‌ ఇస్తామని ఆఫర్‌ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.భార్య వాణికి జగ్గంపేట టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలని పది రోజుల కిందటే సీఎం చంద్రబాబునాయుడికి నర్సింహం విజ్ఞప్తి చేశారు….

అయితే జగ్గంపేటలో బలమైన నేత నెహ్రూ ఉండడంతో టిక్కెట్‌ ఇవ్వడం కుదరదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో నర్సింహం కుటుంబం పార్టీ మారాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. సోమవారం జిల్లాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్‌.. పెద్దాపురం అసెంబ్లీ సీటు తోట వాణికి ఇద్దామని ఆ పార్టీ జిల్లా నాయకుల వద్ద ప్రస్తావించినట్టు చెబుతున్నారు. పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న దవులూరి దొరబాబుకి కాకినాడ ఎంపీ టిక్కెట్‌ ఇస్తామన్న ఆఫర్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కాకినాడ పార్లమెంటు వైసీపీ సీటు ఇదివరకే ఒక ఐఆర్‌ఎస్‌ అధికారికి ఖరారు చేసినట్టు చెబుతున్నారు. దీంతో దవులూరి దొరబాబుకి తాత్కాలికంగా కాకినాడ ఎంపీ సీటు అని ఊరట కలిగించేందుకు చెబుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

హోంమంత్రి చినరాజప్పపై పెద్దాపురంలో తోట వాణి అయితే బలమైన పోటీ ఇస్తారన్న కోణంలోనే ఆమెకు ఆ సీటు ఇస్తామని భరోసా ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా తోట సుబ్బారావు నాయుడికి టికెట్‌ భరోసా ఇచ్చారు. రాజప్పకు ధీటైన పోటీ ఇవ్వలేడని భావించి నాయుడిని తొలగించి దవులూరి దొరబాబుకి టిక్కెట్‌ హామీ ఇచ్చి కోఆర్డినేటర్‌ పదవి కట్టబెట్టారు. దవులూరి దొరబాబు ఈ నాలుగైదు నెలలు పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన తర్వాత మరో కొత్త అభ్యర్థిని పెద్దాపురం అసెంబ్లీకి తెరపైకి తేవడంతో అక్కడ ఆ పార్టీ కేడర్‌లో కాస్త గందరగోళం నెలకొంది.

తోట నర్సింహం, ఆయన సతీమణి వాణి టీడీపీలోనే కొనసాగాలని వాణి సోదరుడు, అమలాపురం టీడీపీ నాయకుడైన మెట్ల రమణబాబు ఆఖరి ప్రయత్నంగా సోమవారం రాత్రి వీరిద్దరినీ కలిసి అభ్యర్థించారు. కార్యకర్తలు, అనుచరుల అభీష్టం మేరకు తాము నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పినట్టు సమాచారం. ఇక రాజమహేంద్రవరం టీడీపీ ఎంపీ టిక్కెట్లు రేసులో తాజాగా బొడ్డు భాస్కరరామారావు పేరు వినిపించింది. సోమవారం రాత్రి సీఎంతో మురళీమోహన్‌ భేటీ కావడం మరింత ఆసక్తిని పెంచింది. ఇక అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా హర్షకుమార్‌ పేరు తెర మీదకు రావడం విశేషం. ఇక జనసేన రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం అభ్యర్థిగా శేఖర్‌ను అధికారికంగా ప్రకటించింది.