Home News Politics

గోదావరి రాజకీయంలో అధికారి సందడి…!

SHARE

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా తరుణంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఉద్యోగులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. డీఐజీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు, పలువురు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు, రిటైర్డ్ ఉద్యోగులు టికెట్ లు ఆశిస్తున్నారు. వివిధ పార్టీల నుంచి టిక్కెట్ లు దక్కించుకుని ఎంపీ లేదా ఎమ్మెల్యేలు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. జనాకర్షణ కంటే దండిగా డబ్బులు ఖర్చు చేస్తామని భరోసా ఇస్తున్నారు. పార్టీల అభ్యర్థులుగా ప్రభుత్వ అధికారులు సైతం పోటీలోకి రావటంతో రాజమహేంద్రవరంలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి….

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లోకి కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. వివిధ హోదాల్లో ఉన్నతస్థాయి  అధికారులుగా పనిచేస్తున్న వారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో పలుచోట్ల అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధమౌతోంది. కోనసీమ ప్రాంతాల్లోని అమలాపురం ఎంపీతోపాటు పీ. గన్నవరం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇప్పటికే పలువురు అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే తమకు నచ్చిన పార్టీల అధినేతలతో టచ్ లో ఉంటూ వస్తున్న సదరు ఉన్నతస్థాయి అధికారులు… టిక్కెట్ పై గ్రీన్ సిగ్నల్ వస్తే కోనసీమ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రంపచోడవరం, ముమ్మిడివరం, పిఠాపురం నియోజకవర్గాల నుండి కూడా టీచర్ లు, డాక్టర్లు, ఇతర అధికారులు తమ ఉద్యోగాలకు రిజైన్ లెటర్ ఇచ్చేసి యాక్టివ్ పొలిటిక్స్ లోకి ఏంట్రీ ఇచ్చారు. మరి కొందరు రిటైర్డ్ ఉన్నతాధికారులు రాజకీయ ప్రవేశం చేశారు. ఇంకొందరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా కోనసీమ రాజకీయాల్లోకి అనుకోని విధంగా ఎంట్రీ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి పండుల రవీంద్రబాబు తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రవీంద్రబాబు కేంద్రం పరిధిలోని కస్టమ్స్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ అధినేత ఆయనకు అమలాపురం ఎంపీ టిక్కెట్ ఇవ్వటం భారీ మెజార్టీతో పార్లమెంట్ లోకి అడుగుపెట్టడం జరిగాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసిన ఐ.ఎ.ఎస్. అధికారి కె.ఎస్.ఆర్. మూర్తి సైతం కోనసీమ రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో అమలాపురం ఎం.పి.గా పనిచేశారు. 

మరోసారి ఎన్నికలు సమీపించిన వేళ జిల్లాలోని పలు నియోజకవర్గాల టిక్కెట్ లను ఆశించే వారి జాబితాలో ఉన్నతాధికారులు సైతం వచ్చి చేరారు. ఏలూరు రేంజ్ బిజీగా పని చేసి ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న రవికుమార్ మూర్తి తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే ఈయన పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేన పార్టీలో చేరారు. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీగా కూడా మూడేళ్ల పాటు పని చేసిన రవికుమార్ మూర్తికి జిల్లాలోని ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న మధుసూనధనరావు ఇప్పటికే పలుసార్లు జగన్ ని కలిసి మద్దతు తెలిపారు. గోదావరి వరదల సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన సదరు ఉన్నతాధికారి పి.గన్నవరం నుంచి వై.సి.పి. టిక్కెట్ ను ఆశిస్తున్నారనే మాట వినిపిస్తోంది. 

ఇటీవలే వై.సి.పి. అమలాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నియామకం పొందిన చింతా అనురాధ భర్త విశాఖలో ఇన్ కమ్ ట్యాక్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గా పనిచేసిన బొంతు రాజేశ్వర్రావు ప్రస్తుతం రాజోలు వై.సి.పి. కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ముమ్మిడివరం జనసేన పార్టీ అభ్యర్ధిగా రంగంలోకి దిగుతున్న పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన మొదటి టికెట్ దక్కించుకున్న అభ్యర్థి పితాని బాలకృష్ణ. రంపచోడవరం వైసిపి టికెట్ ఆశిస్తున్న నాగులపల్లి ధనలక్ష్మీ ప్రభుత్వ టీచర్. వైసీపీకి అభ్యర్థులు ఏవరు పోటీ లేకపోవడంతో టికెట్ హామీతో టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇదే నియోజకవర్గం నుండి మరో ప్రభుత్వ ఉద్యోగి డాక్టర్ కోసూరి అప్పారావు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్ గా పనిచేసిన అప్పారావు ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ కండువ కప్పుకున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుండి రిటైర్డ్ ఇంజినీరింగ్ చీఫ్ అధికారి అనిశెట్టి వెంకట సుబ్బారావు జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈయన పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేన జెండా కప్పుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో 1984లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా మొదలైన ఈయన ప్రస్థానం వివిధ స్థాయిల్లో పనిచేసి ఇంజినీరింగ్ చీఫ్ గా 2018లో అమరాతిలో రిటైర్డ్ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కాపు సామాజికవర్గంలో ఈయనకు బంధుగణం ఎక్కువే అని చెప్పచ్చు.. నియోజక వర్గంలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ఆర్థిక పరంగానూ సామాజిక వర్గం పరంగానూ బలమైన వ్యక్తిగా తిరుగుతూ జనసేన తరపున పిఠాపురం టికెట్టు ఆశిస్తున్నారు..

ఆసక్తి ఉన్న పలువురు ఉన్నతాధికారులు జిల్లా పాలిటిక్స్ లోకి ఎంట్రీ కోసం ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగులతోపాటు, డాక్టర్లు, పోలీసులు, టీచర్ లు, రిటైర్డ్ ఉద్యోగులు చట్టసభల్లో ప్రవేశం కోసం ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. గత ఎన్నికల్లో టి.డి.పి. నుంచి ఒక ఉన్నతాధికారి టిక్కెట్ దక్కించుకోగా… ఈసారి జనసేన, వైసీపీల నుంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరగనుందో చూడాలి.