Home News Politics

దేవినేనికి సీటెక్కడ…?

SHARE

దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ కు సీట్ కన్ఫార్మ్ అయిందా.. అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.. విజయవాడ సిటీలోనే సీటిస్తున్నారా… లేక కృష్ణాజిల్లాలోనే వేరే ఏదైనా నియోజకవర్గం నుంచి సీట్ ఇస్తున్నారా..ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇదే చర్చ.. ఒకవేళ ఆయనకు సీటిస్తే ఏ ఎమ్మెల్యే కి ఎర్త్ పెడతారు. ఇంతకీ దేవినేని అవినాష్ ఏమనుకుంటున్నారు..మరోవైపు గుడివాడలో కొడాలినానిని ఓడించడానికి ఈసారి దేవినేని అవినాష్ ను టీడీపీ అధిష్టానం బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది….

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశంలో చేరిన సందర్భంలో తన కొడుక్కి సీటు కావాలని చంద్రబాబును కోరారు. కచ్చితంగా అవినాష్ ను ఎమ్మెల్యే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తదనంతరం నెహ్రూ మరణించడంతో అవినాష్ పరిస్థితేంటని పార్టీలో విపరీతమైన చర్చ జరిగింది. అవినాష్ కు మద్దతుగా కొంతమంది కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద ఈ ప్రస్తావన తెచ్చిన సందర్భంలో ఆయన కూడా కచ్చితంగా ఎన్నికల్లో అవినాష్ పోటీ చేస్తారని చెప్పినట్టు సమాచారం… అంతేగాక ఇటీవల అవినాష్ కు తెలుగుయువత రాష్ట్రాధ్యక పదవి కూడా ఇవ్వడంతో కచ్చితంగా ఆయన సీటు ఖాయం అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ..ఇంతవరకూ బాగానే ఉంది కానీ అవినాష్ కు సీటు ఎక్కడ ఇస్తారనేది సస్పెన్స్ గామారింది….

దేవినేని అవినాష్ ను కృష్ణాజిల్లా గుడివాడ నుంచి పోటీ చేయిస్తారని టీడీపీలో ఇటీవల చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన సందర్భంలో గుడివాడ నుంచి అవినాష్ ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని అభిప్రాయం తీసుకున్నారట… అక్కడి వైసీపీ ఎమ్మెల్యే కొడాలినాని కొరకరాని కొయ్యలా మారడంతో అతన్ని ధీటుగా ఎదుర్కోవడానికి అవినాష్ ను అక్కడినుంచి పోటీ చేయించాలని బావిస్తున్నారట… గతంలో టీడీపీలో ఉండి విబేధించి బయటకు వచ్చి వైసీపీ నుంచి గెలిచి బలంగా ఉన్న కొడాలి నాని ని ఎదుర్కోవడానికి దేవినేని కుటుంబం నుంచి వ్యక్తి కరెక్ట్ అని టీడీపీ అధిష్టానం బావించిందని ప్రచారం జరుగుతోంది. అక్కడ నియోజకవర్గ ఇన్ చార్జ్ గాఉన్న మాజీ ఎమ్మెల్యే రావివెంకటేశ్వరరావు కొడాలినానిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనేది టీడీపీనేతల బావన.. అక్కడ దేవినేని నెహ్రూకు మంచి పట్టుండడంతో పాటు దేవినేని అవినాష్ మీద ఉన్న సింపతీ కూడా తోడై విజయం సాధిస్తారని బెజవాడకు చెందిన టీడీపీ నేతలు చెబుతున్నారు.

దేవినేని వర్గం మాత్రం గుడివాడ కంటే తమకు విజయవాడలోనే సీటిస్తే బాగుంటుందని చంద్రబాబువద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దేవినేని నెహ్రూ గతంలో వరుసగా ఐధుసార్లు కంకిపాడు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పటి కంకిపాడు నియోజకవర్లంో ఇప్పుడున్న పెనమలూరు, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలు కూడా కలిసి పెద్ద నియోజకవర్గంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో నెహ్రూకు మద్దతుదారులున్నారు. నెహ్రూకు మంచి పట్టున్న ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదొకటి కేటాయించాలని దేవినేని వర్గం పట్టుబడుతోంది.ఈ రెండు కుదరకపోతే కనీసం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అయితే బాగుంటుందని అడుగుతున్నారట.తాజాగా వంగవీటి రాధాకృష్ణ కూడా టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో దేవినేని అవినాష్ సీటు విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది…

అయితే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న గద్దెరామ్మోహన్ వివాద రహితుడిగా చంద్రబాబు వద్ద మంచి పేరుంది. అందువల్ల ఆ సీటును ఆయన నుంచి తప్పించి అవినాష్ కు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్రసాద్ కొన్ని విషయాల్లో వివాదాలు ఎదుర్కున్నప్పటికీ నియోజకవర్గంలో బాగా పని చేస్తున్నారనే పేరుంది. అలాంటప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని అవినాష్ కు ఆ సీటు ఇస్తారా అనేది కూడా డౌటే..ఇక మిగిలింది సెంట్రల్ నియోజకవర్గం…గతంలో బోండా ఉమ ఇక్కడి నిుంచి ముప్పైవేలకు పైగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నోటిదురుసుతోపాటు అనేక వివాదాలు ఎదుర్కున్నారు. బోండా ఉమను కాదని ఆ సీటును అవినాష్ కు ఇస్తారా..ఇచ్చినా ఆయన గెలిచేఅవకాశం ఉందా అనే దానిపై టీడీపీ రహస్యంగా సర్వే చేయించినట్టుగా కూడా తెలుస్తోంది.
మరోవైపు నూజివీడు అసెంబ్లీ నుంచి కూడా అవినాష్ ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై కూడా టీడీపీలో చర్చ సాగుతోందట… అక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ గా మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ సారి నూజివీడు సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న టీడీపీ ముద్రబోయినను ఎమ్మెల్సీగా పంపి దేవినేని అవినాష్ ను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చించారట… మొత్తం మీద దేవినేని అవినాష్ పై మొత్తం ఐధు స్థానాల్లో చర్చ జరుగుతోంది. ఇలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ముఖ్యనేతల వద్ద తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నారట..

అయితే ఇటు దేవినేనివర్గంలో మాత్రం కాస్తం హుషారు కనిపిస్తోంది. ఇంతలా చర్చ జరుగుతోందంటే ఎక్కడో ఒకచోట నుంచి సీటు కన్ఫార్మ్ అయినట్టే కదా..కృష్ణాజిల్లా మొత్తం దేవినేని నెహ్రూకు పట్టుంది కాబట్టి ఎక్కడి నుంచైనా సరే పోటీ చేసినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.