Home News Politics

డేటా స్కామ్ గొడవ మధ్యలో క్యాష్ ఫర్ ట్వీట్…!

SHARE

లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఒక పక్క గొడవ నడుస్తుంటే మరోపక్కక్యాష్ ఫర్ ట్విట్ అంటు మరో సైబర్ క్రైమ్ తెరమీదకు వచ్చింది. ఇందులో భాగంగానే నిన్న ట్విట్టర్లో #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేయడానికి ప్రయత్నించారు అన్న అభియోగాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ హ్యాష్ ట్యాగుపై వస్తున్న ట్వీట్లను పరిశీలించగా అవి ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా రావడంతో ఇప్పుడు అసలు చర్చ మొదలైంది….

ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను టీడీపీ పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డారు పార్టీ అధినేత చంద్రబాబు. దీని పై తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలు పరస్పరం కేసులు పెట్టుకుంటు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్ క్రియోట్ చేశాయి. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక హ్యాష్ ట్యాగ్ #TSGovtStealsData క్రియోట్ చేసి సోషల్ మీడియాలో టీడీపీ రచ్చచేస్తుందని ఆరోపిస్తుంది గులాబీ దళం.

అసలు ఆంధ్రతో కానీ, తెలంగాణతో కానీ ఏ సంబంధం లేని కొన్ని వేల ట్విట్టర్ అకౌంట్ల నుండి ఈ ట్వీట్లు వచ్చాయి అని…. ఇందులో అనేక హ్యాండిల్స్ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు చేసినవి. ఇందులో తెలుగులో వచ్చిన ట్వీట్లు కూడా అసలు తెలుగు భాష రాని వారి ట్విట్టర్ అకౌంట్ల నుండి వచ్చాయంటు విమర్షలు గుప్పించింది టీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగును కృత్రిమంగా ట్రెండ్ చేయడానికి ఒక ఏజెన్సీకి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పిందని, వారు వేలాది ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కిరాయికి మాట్లాడుకుని ఈ ట్వీట్లను చేయించారని కొత్త అస్త్రాలు ఎక్కుపెట్టింది గులాబీ పార్టీ.

బొంబాయికి చెందిన రియా అనే ఒక మోడల్, సంతోష్ షుక్లా అనే యాక్టర్, బాలీవుడ్ చోక్ అనే గురుగ్రాం ట్విట్టర్ అకౌంట్ వీళ్లందరూ ఈ అంశం గురించి, చంద్రబాబుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. గమ్మత్తేమిటంటే ఈ ట్విట్టర్ అకౌంట్లు అన్నిటిలో ఒకే విధమైన ట్వీట్లు ఉండటం. ఈ ట్వీట్లు చేసిన వారందరూ రోజూ ఎవరు డబ్బులు ఇస్తే వారికి ట్వీట్ లు చేసిపెట్టే సెలబ్రిటీస్ గా తేలింది. డబ్బులిచ్చి ట్విట్టర్‌లో తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించారంటూ చంద్రబాబు, లోకేశ్‌ల పై అటు సైబర్ క్రైం వారికి, ఇటు ట్విట్టర్ వారికి ఫిర్యాదులు వెళ్లనుండడంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఒక పక్క డేటా స్కాం కేసు నడుస్తుంటే మరో పక్క ఈ క్యాష్ ఫర్ ట్విట్ ని తెలంగాణ ప్రభుత్వం తెరమీదుకు తీసుకురావడంతో ప్రతిపక్ష వైసీపీని పక్కనబెట్టి ఇది టీఆర్ఎస్ vs టీడీపీ వార్ గా మారింది. రెండు రాష్ట్రాల అగ్గిరాజేస్తున్న ఈ కేసుల పై రెండు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.