Home News Politics

ఉపఎన్నికల్లో దుమ్మురేపిన కాంగ్రెస్…!

SHARE

కర్ణాటక ఉపఎన్ని కల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి వ్యూహం ముందు కాషాయపార్టీ కూలబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఘన విజయం సాధిచింది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ చతికిల పడింది. ఈసారి ఆ పార్టీ ఇక్కడ స్వల్ప మెజారిటీ తో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జమఖండి అసెంబ్లీ స్థానంతో పాటు బళ్లారి లోక్‌సభ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. మరోవైపు మాండ్య లోక్‌సభ స్థానంలోనూ, రామానగరం అసెంబ్లీ స్థానంలోనూ జేడీఎస్ భారీ ఆధిక్యంతో విజయం ఖాయం చేసుకుంది. రామానగరంలో ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తాజా ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుం టున్నాయి. బీజేపీ ప్రతికూల వాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శన మని కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు వ్యాఖ్యానించా రు. తమకు భారీ విజయం కట్టబెట్టినందుకు కర్ణాటక ప్రజలకు మాజీ ప్రధాని దేవేగౌడ, జేడీఎస్ చీఫ్ సీఎం హెచ్‌డీ కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

బళ్లారి లోక్‌సభ స్థానంలో 14 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం సాగించిన బీజేపీ… తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ ‘త్రిమూర్తులు’ పన్నిన వ్యూహం ముందు చిత్తుగా ఓడిపోయింది. బళ్లారిలో ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ జే.శాంతపై కాంగ్రెస్-జేడీఎస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప 2 లక్షల భారీ ఆధిక్యంతో దూసుకెళ్లారు.ఉగ్రప్పకు ఆధిక్యం లభించిన కొద్ది నిమిషాల్లోనే కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించారు. ‘‘దీపావళి పర్వదినాన బళ్లారి ప్రజలు చీకటిలో నుంచి వెలుగులోకి తిరిగి వచ్చారు…’’ అంటూ ట్వీట్ చేశారు.

శివమొగ్గ, బళ్లారి, మాండ్య సహా మూడు లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రకటన చేసినప్పుడు.. వాస్తవానికి అక్కడ కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థి కూడా లేరు. విస్తృత చర్చలు, సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్ పార్టీలు ‘‘బయటి వ్యక్తి’’, ఎంఎల్‌సీ వీఎస్ ఉగ్రప్పను తీసుకొచ్చి పోటీకి నిలబెట్టాయి. రెడ్డి సోదరుల అండతో బీజేపీకి కంచుకోటగా ఉన్న బళ్లారిని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ ‘త్రిమూర్తులు’’ సిద్ధరామయ్య, దినేశ్ గుండూరావు, డీకే శివకుమార్ పక్కా వ్యూహం రచించారు. జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు చేరువయ్యేందుకు దాదాపు 80 మందికి పైగా చిన్నా, పెద్ద నేతలను రంగంలోకి దింపారు. బళ్లారిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య విభేధాలన్నీ ముందే చక్కబెట్టారు.