Home News Politics

టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టు ఇదేనా…?

SHARE

ఉద్యమకాలం నుంచి అధికారంలోకి వచ్చే వరకు టీఆర్ఎస్ కి ఆ జిల్లాలే కొండంత బలం. ఇక్కడ పార్టీకున్న పట్టుతోనే అధికారంలోకి రాగలిగింది. గులాబీ పార్టీకి గుండెకాయ లాంటి ఉత్తర తెలంగాణ పై హస్తం పార్తీ కన్నుపడింది. ఈ ప్రాంతంలో మొత్తం 45 స్థానాలున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలున్న ఈ నార్త్ బెల్ట్ పై ఆపరేషన్ స్టార్ట్ చేసింది హస్తం పార్టీ. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచిన స్థానాల్లో కనీసం సగం సీట్లు గెలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది.

అధికారంలోకి వచ్చే వరకు టీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణ జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఈ జిల్లాల్లో 7 సీట్లే గెలిచింది. ఉత్తర తెలంగాణ లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ నార్త్‌ తెలంగాణ పేరుతో పూర్వవైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించేందుకు టీపీసీసీ ముఖ్యులంతా అక్కడే భారీస్థాయిలో ప్రచారపర్వం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లాలో రాహుల్ టూర్ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కొన్ని నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిసింది.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో నార్త్‌ తెలంగాణ జిల్లాల్ల పై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే 30 బహిరంగ సభల్లో రేవంత్ పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రచార షెడ్యూల్‌పై కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్టు తెలిసింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభల్లో పాల్గొని అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిసింది. ఉత్తర తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్‌ పార్టీ గతంలో దక్షిణ తెలంగాణ నుంచే అధిక స్థానాలు గెలుపొంది ప్రతిపక్షం హోదాను దక్కించుకోగలిగింది.

ముందునుంచి కాంగ్రెస్‌ పార్టీకి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రాంతాలు ఆయువుపట్టుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, ఈసారి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు ఢీ అండే ఢీ అనే స్థాయిలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సగం అభ్యర్థులు మాజీమంత్రులే. నియోజకవర్గాల్లోనే ఉంటున్నందున కాంగ్రెస్‌ పార్టీ గతంలో సాధించిన సీట్ల కంటే రెండింతలు సాధిస్తామని కాంగ్రెస్‌ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ఉత్తర తెలంగాణ జిల్లా అయిన ఖమ్మంలోని మధిర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు, మధిర, ఖమ్మం, ఇల్లెందు సీట్లను కాంగ్రెస్‌ పార్టీ గెలుపుపొందింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల తప్పా మరే స్థానాన్నీ కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. జిల్లాలోని 13 స్థానాల్లో ఈసారి కనీసం సగం స్థానాలనైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ముథోల్‌ స్థానం మిన హాయించి ఏ స్థానంలోనూ గెలవలేకపోయింది. ముథోల్‌ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి సైతం కారెక్కడంతో ఇక్కడ ఖాళీ అయిది. అయితే, ఈ సారి జిల్లాల్లోని 10 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 12 స్థానాలకుగాను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఒక డోర్నకల్‌ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నర్సంపేట్‌ నుంచి ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్‌ నేత దొంతి మాధవరెడ్డి గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరడం మళ్లీ పరకాల నుంచి పోటీలో ఉండటంతో కాంగ్రెస్‌ తన స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

టీఆర్ఎస్ కి ఆయువుపట్టు లాంటి ఈ స్థానాల్లో కాంగ్రెస్ పట్టు సాధిస్తే తనకు తిరుగులేదనుకుంటుంది. హస్తం పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అన్నది తెలియాలంటే ఇంకొక పదిరోజులు వేచు చూడాల్సిందే…