Home News Politics

కాంగి-రేసు లో సీట్ల ఖరారు…ఆ 30 మందికి ఓకే…!

SHARE

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి వడపోత పూర్తయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి సీట్లు ఖరారు కాగా గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కోందరు మాజీ మంత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. . దాదాపు 30 సీట్లకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలకు ఒక్కొక్కరి పేరునే ప్రతిపాదించారు. కొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురు నుంచి ఆరేడుగురు వరకు టిక్కెట్ రేసులో ఉన్నారు. మొత్తం 119 నియోజక వర్గాలకు 1100లకు పైగా దరఖాస్తులు రావడంతో హస్తం పార్టీ నేతలే అవాక్కయ్యారు..

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ ఖుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో గోల్కొండ రిసార్ట్ లో సమావేశమైన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఆశావహులను షార్ట్‌ లిస్ట్‌ చేసే పనిలో ఉంది. నియోజక వర్గాల వారీగా సమీక్షించేందుకు కమిటీ సభ్యులతో మూడు సబ్‌ కమిటీలు వేశారు. ఒక్కో సబ్‌ కమిటీకి ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్‌, శ్రీనివాస్‌ కృష్ణన్‌ నేతృత్వం వహించారు. ఒక్కో సబ్‌ కమిటీ 40 నియోజక వర్గాల ఆశావహుల పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది.

తొలి వడపోతలో 30 నియోజక వర్గాల్లో ఒక్కొక్కరినే అభ్యర్థిగా ప్రతిపాదించింది. వారిలో.. ఉత్తమ్‌(హుజూర్‌నగర్‌), జానారెడ్డి (నాగార్జునసాగర్‌), షబ్బీర్‌అలీ (కామారెడ్డి), భట్టి విక్రమార్క (మధిర), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఉత్తమ్ పద్మావతి(కోదాడ), కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(మునుగోడు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), డీకే అరుణ (గద్వాల), సునీతా లక్ష్మారెడ్డి(నర్సాపూర్), గీతారెడ్డి(జహీరాబాద్), సంపత్‌కుమార్‌(అలాంపూర్), వంశీచంద్‌రెడ్డి(కల్వకుర్తి), మాజీ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(మంథని), జీవన్‌రెడ్డి(జగిత్యాల), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(ఎల్ బీ నగర్) దామోదర రాజ నర్సింహ(ఆందోల్),సుదర్శన్ రెడ్డి(బోదన్),షబ్బీర్ అలీ(కామారెడ్డి),చిన్నారెడ్డి(వనపర్తి),పొన్నం ప్రభాకర్(కరీంనగర్),కొండ సురేఖ(పరకాల),బలరాం నాయక్(మహబూబ్ బాద్) తదితరులు ఉన్నారు.

నియోజకవర్గానికి ఒకరిని ఎంపిక చేసిన స్థానాల్లో మాజీ మంత్రులు, సిటింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఉన్నారు. కుటుంబంలో ఒకరికే టికెట్‌ అన్న నిబంధనపై తర్జనభర్జనలు జరిగినా పలుచోట్ల వారసుల పేర్లనూ చేర్చారు. ఖమ్మం, ఇబ్రహీంపట్నం వంటి నియోజక వర్గాల్లో పేర్లను చేర్చే అంశంపై తీవ్ర వాగ్వాదం జరిగినట్లు టాక్. ఖమ్మంలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేరును ప్రతిపాదించగా.. మాజీ ఎంపీ రేణుకాచౌదరి మరో పేరును ప్రతిపాదించారు. ఈ తరుణంలో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. పెద్దపల్లి, ముషీరాబాద్‌ నియోజక వర్గాల్లో ఆరుగురు చొప్పున ఆశావహులను ఎంపిక చేశారు. పొత్తులు ఖరారైన తర్వాత వీటిలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలూ ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ జాబితా పై భక్తచరణ్‌ దాస్‌ నేతృత్వంలోని త్రిసభ్య స్ర్కీనింగ్‌ కమిటీ సమీక్షించనుంది.