Home News Politics

కాంగ్రెస్ లో ఆయన చేరిక ఎప్పుడు ?

SHARE

అధికారపార్టీ లోకి వెళ్ళి రాజ్యసభ దక్కించుకున్న ఆ నేత గులాబీ వనంలో ఇమడలేకపోతున్నారా ? త్వరలోనే ఆయన సొంత గూటికి చేరనున్నారా ? ఆయన వస్తున్నారన్న ప్రచారంతో సొంత జిల్లా పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ఆ పై పార్టీ మారి పోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆ నేత కాంగ్రెస్ లో ఎంట్రి పై డిఫెన్స్ లో పడ్డరా ? తన ఎంట్రి కాంగ్రెస్ కి ప్లస్ అయ్యే లా పావులు కదుపుతున్నారా ఇలాంటి సందేహాల మధ్య నలిగిపోతున్న నేత ఎవరో కాదు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సారధిగా విజయపథంలో నడిపి ఆ పై గులాబీ గూటికి చేరిన ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్).

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ని రెండుసార్లు అధికారంలో తీసుకోచ్చా అని చెప్పుకునే డీఎస్ మారిన పరిస్థితుల్లో గులాబీ గూటికి చేరారు. ఆ పై టీఆర్ఎస్ పార్టీలో అవమానాలతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖరారు చేసుకున్నారు. నిన్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో కూడా భేటి అయి సమాలోచనలు జరపడంతో డీఎస్ చేరిక పై క్లారిటి వచ్చింది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో చేరికకు ముందే తన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చెయ్యాలని కండీషన్ పెట్టింది. దీంతో పాటు ఆయన పార్టీలోకి వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తేల్చి చెప్పారంట ఇందూరు కాంగ్రెస్ నేతలు. పార్టీ కష్టాలలో ఉన్న సమయంలో రాజ్యసభ పదవి కోసం కారు ఎక్కేసి ఇప్పుడు ఆ పార్టీలో గౌరవం లేదన్న కారణంతో కాంగ్రెస్ లోకి రావాలని చూస్తూన్నారని వ్యతిరేకిస్తున్నారట.

అంతేకాకుండా డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీకి చేటు తెస్తాయంటున్నారట జిల్లా హస్తం పార్టీ నేతలు. డీఎస్ చేరాతారన్న ఉద్దేశ్యంతోనే మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గులాబీ గూటికి చేరారని ఇంకా మరికొంతమంది నేతలు కూడా అదే దారిలో ఉన్నారని తెలుస్తుంది. డీఎస్ అనుచరులు మాత్రం తమ నేత త్వరలోనే కాంగ్రెస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని అర్బన్,రూరల్ టిక్కెట్లు తమకే దక్కుతాయంటున్నారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమ పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. డీఎస్ తనతో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీలోకి తీసుకు వచ్చి రూరల్ టిక్కెట్ ఇప్పిస్తారన్న ప్రచారం ఉంది. అర్బన్ టిక్కెట్ కూడా డీఎస్ అడిగే చాన్స్ లేక పోలేదు. ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన డజన్ మంది నేతలు పార్టీ టిక్కెట్ కోసం క్యూలో ఉండగా డీఎస్ రాకతో పార్టీలో ఈక్వేషన్స్ పూర్తిగా మారే చాన్స్ ఉంది. దీంతో ఇందూరు కాంగ్రెస్ నేతలు డీఎస్ చేరిక పై ఫుల్ టెన్షన్ లో ఉన్నారట.