Home News Politics

రాహుల్ కోటరిలోని ఆ నేత పై నిప్పులు….

అంతా ఆయ‌నే చేసారంటున్నారు .. త‌న వారికి ప్రాధాన్యత పెంచుకుంటూ….త‌న వ‌ర్గాన్ని పెంచుకునే ప‌నిలో పడ్డారని.. అదే కొంపముంచింది అంటున్నారు .. అందుకే ఆయ‌న్ని అంతా టార్గెట్ చేస్తున్నారు.. మొత్తమ్మీద రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌నంటే ఇప్పుడు గిట్టడం లేదు… ఇంత‌కీ ఆయనెవరు? ఏం చేశారు?… అటు తెలంగాణ నాయ‌కులు … పార్టీలో చాలా సిన్సియ‌ర్ అనుకునే ఆంధ్రా నాయ‌కుడు కూడా ఆయనకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది ? అసలు ఆ నేతకి పార్టీలో ఎందుకంత ప్రాధాన్యత….

కొప్పుల రాజు .. కాంగ్రెస్‌లో ఇప్పుడు మెజార్టీ నాయకులు ఆయ‌న పేరునే స్మరిస్తున్నారు… ఆయ‌న పై కొంద‌రు గుర్రుగా ఉంటే … మ‌రికొంద‌రు సాఫ్ట్ కార్నర్ తో సర్దుకుపోతున్నట్లు కనిపిస్తున్నారు … ఇక ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి… అటు కిశోర్ చంద్ర దేవ్.. ఇద్దరూ రాహుల్ గాంధీ కోట‌రిలోని..కొప్పులు రాజునే టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు .. పార్టీ లో క్షేత్రస్ధాయిలో ఏం జ‌రుగ‌తుందో అవగాహన లేకుండా వ్యవహరించడంతో పాటు… త‌న సామాజిక వ‌ర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని కొప్పుల రాజుపై ఆరోపణలు చేస్తున్నారు ..

ఆ క్రమంలో సాఫ్ట్ గా క‌నిపించే మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్ర దేవ్ కూడా కొప్పుల రాజు మీద రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేయాల్సిన ప‌రిస్ధితి ఎందుకు వ‌చ్చింద‌నే చ‌ర్చ మొద‌లైంది… మరోవైపు పార్టీలో బీసీ, ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన కొందరు నాయ‌కులు మాత్రం కొప్పుల రాజు త‌మ‌కు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు… అయితే ఇంకో ట్విస్ట్‌ ఏంటంటే ద‌ళితుల్లో మాదిగ‌లు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు… మాల‌లు మాత్రం అంద‌లానికి ఎత్తుతున్నారు… అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణం ఆయ‌న నిర్ణయాలే అంటు రేణుకా చౌద‌రి లాంటి వాళ్లు మీడియా ముందుకొచ్చి ధ్వజమెత్తున్నారు .. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారు… పార్టీ శ్రేయోభిలాషులకు ఇప్పుడు కొప్పుల రాజే టార్గెట్‌ అవుతున్నారు.

కొప్పుల రాజు పార్టీ ప్రయోజనాలు పట్టించుకోకుండా … త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికే ప‌ద‌వులు ఇప్పిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ నాయ‌కులు… తెలంగాణ నేతలు రాహుల్ గాంధీని నేరుగా క‌లిసి ఓట‌మికి కార‌ణాలు చెప్పటానికి ప్రయ‌త్నించినా… చాలా మందికి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడానికి ఆయనే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ ముఖ్యనాయకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉండటం గమనార్హం.. ఆయన భార్య కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆ ర్యాపోని అడ్డుపెట్టుకుని మీడియా అధినేతల ద్వారా తెలంగాణలో టీడీపీ,కాంగ్రెస్ పొత్తుకి రాజు తెర తీశారన్న ఆరోఫణలు చేస్తున్నారు.

పాల‌మూరు జిల్లాకు చెందిన ఇద్దరు సీనియ‌ర్ నాయ‌కులు బహిరంగంగానే కొప్పుల రాజు మీద ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ నాయ‌కుడికి ఎఐసీసీ కార్యద‌ర్శి ప‌ద‌వి రావ‌టం వెన‌క కూడా కొప్పుల రాజు హస్తం ఉందన్నది వారి అభిప్రాయం… ఏఐసీసీలో కీల‌క ప‌ద‌వులు రాష్ట్ర స్ధాయి నాయకుల‌కు తెలియ‌కుండా… ఏక ప‌క్షంగా త‌న వ‌ర్గానికి ఇప్పించుకుంటున్నార‌న్న ఆవేదన వ్యక్తం అవుతోంది కాంగ్రెస్‌ శ్రేణుల్లో … తాజాగా తెలంగాణ‌లో ఓ కీల‌క ప‌ద‌వి ద‌క్కించుకున్న నేతకు కొప్పులరాజు మద్దతుందన్న టాక్ వినిపిస్తోంది … ఇలా తెలంగాణ‌ … ఏపీలో పాలిటిక్స్ లో అన్నీ తానై న‌డిపిస్తూ …. పార్టీలో పనిచేసే నాయ‌కుల‌కు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నార‌ని సీనియ‌ర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొప్పుల రాజు అనవసర జోక్యం చేసుకున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే రాష్ట్రం పార్టీలో ఓ కీల‌క నేత‌ కొప్పుల రాజు అండ‌దండ‌లతో ఇష్టానుసారం వ్యవహారాలు న‌డిపిస్తున్నార‌న్న ఆరోపణలు ఉన్నాయి … కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణాల‌ను… నేరుగా రాహుల్ గాంధీకి చెప్పాల‌ని చాలా మంది ప్రయ‌త్నాలు చేస్తున్నారని.. అయితే దీన్ని అడ్డుకుంటూ … రాహుల్ గాంధీని క‌ల‌వ‌కుండా చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

తెలంగాణ‌లో పొత్తుల విష‌యంలో టీడీపీతో కలిసి పనిచేయాడానికి ఆయన అత్యత్సాహం చూపించారని.. రాజ‌కీయంగా వ‌చ్చే లాభ న‌ష్టాల‌ను బేరీజు వేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని రేణుకాచౌదరి వంటి సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు … మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ లో కొప్పుల రాజు మీద కాక‌రేగుతుంది… అంతా ఆయనే చేసారని నాయకులు ఫైర్‌ అవుతూ … రాహుల్‌గాంధీ ముందు పంచాయతీ పెడతామని అంటుండటం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.