Home News Updates

ప్ర‌భువా…ఈ పాపుల్ని క్ష‌మించ‌కు!

శిలువ‌నెక్కిన జీస‌స్ మందిరంలో ర‌క్త‌పాతం

SHARE

ఏమిటీ ఉన్మాదం? ఎందుకీ ర‌క్త‌పాతం? పాపుల్ని కూడా క్ష‌మించ‌మ‌ని ప‌విత్ర హృద‌యంతో ప్రార్థించే చోటును శ్మ‌శానంలా మార్చేయాల‌న్నంత క‌సి ఎందుకు? మ‌నుషుల ర‌క్తం రుచిమ‌రిగిన పులులు క‌నుమ‌రుగ‌య్యాక ప్ర‌శాంతంగా బతుకుతున్న దేశంలో న‌ర‌మేథం సృష్టించిన ఉగ్ర‌మూక‌ల ల‌క్ష్యమేంటి? ప‌విత్ర దినాన దైవ ప్రార్థ‌నలో మునిగి ఉన్న అన్నెంపున్నెం ఎరుగ‌ని అమాయ‌కుల ప్రాణాలు తీసిన ముష్క‌రుల‌కు ద‌క్కిందేమిటి?

శ్రీలంక రాజ‌ధాని కొలంబో నెత్తురోడింది. ఈస్ట‌ర్ పండుగ సంద‌ర్భంగా కిక్కిరిసిన చ‌ర్చిల‌ను ల‌క్ష్యంగా చేసుకున్నారు మాన‌వ‌త్వ‌మ‌నే మాటకు అర్ధ‌మే తెలియ‌ని ముష్క‌రులు. వ‌ర‌స బాంబుపేలుళ్ల‌తో మృతుల సంఖ్య రెండొంద‌లు దాటింది. కాళ్లూ చేతులు తెగిపోయి, వంద‌ల‌మంది చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఎటుచూసినా ఆర్త‌నాదాలు. ధ‌ర్మం శ‌ర‌ణం గ‌చ్ఛామి అంటూ శాంతిని ప్ర‌బోధించిన బుద్ధుడు పుట్టిన నేల‌పై రక్తంతో రంగేలి ఆడుకున్న పాపుల్ని శిక్షించేదెవ‌రు?

క‌ర్క‌శంగా కుత్తుకలు తెగ్గోసే ఐసిస్ న‌ర‌మేథానికి ఈసారి బ‌లిప‌శువైంది శ్రీలంక‌. చ‌ర్చిల‌కు వ‌చ్చే విదేశీ యాత్రికులే ముష్క‌ర‌మూక‌ల ల‌క్ష్యం. అమెరికా, ఆస్ట్రేలియాలాంటి దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండ‌టంతో ఆద‌మ‌రిచిన ప‌ర్యాట‌క ప్రాంత‌మైన చిన్న‌దేశంపై విషం చిమ్మింది ఉగ్ర‌వాదం. ఇంట‌లిజెన్స్ హెచ్చ‌రిక‌లు ఉన్నాయంటున్నా…ఉగ్ర‌వాద ప‌డ‌గ నీడ త‌మ‌పై ప‌డుతుంద‌ని ఊహించ‌లేక‌పోయింది శ్రీలంక‌.

ఉగ్ర‌వాదానికి మ‌తం లేదు.ఉన్మాదానికి మాన‌వ‌త్వం లేదు. అది ఏ రూపంలో ఎవ‌రిమీద విరుచుకుప‌డ్డా మ‌నిష‌నే ప్ర‌తివాడూ ఖండించాల్సిందే.