Home News Stories

చిత్తురులో ఆ ఎనిమిది మందికి టిక్కెట్ ఓకే….!

SHARE

టీడీపీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ అధినేత జగన్ కు సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు వైసీపీ అధినేతకి ఇబ్బందికరంగా మారాయి.చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైకిల్ పార్టీ పై పై చేయి సాధించింది.ఈసారి కూడా అదే రేంజ్ లో సీట్లు సాధించాలని వైసీపీ భావిస్తుంది. కులసమీకరణాలే ఇక్కడ వైసీపీ అధినేతని కలవరపరుస్తున్నాయి.జగన్ సొంత సామాజిక వర్గమైన రెడ్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శల నుంచి బయటపడాలా లేక… కొత్త ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అన్నది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సస్పెన్స్ గా మారింది.

టీడీపీ అభ్యర్థులను ప్రకటించాకే చిత్తూరు జిల్లాలో తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేయాలన్న యోచనలో జగన్ ఉన్నారు. ఈ మేరకు జగన్ పార్టీ అభ్యర్థుల ఎంపిక పై కసరత్తులు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో మూడు రిజర్వ్ డ్ నియోజకవర్గాలున్నాయి. సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. ఇక మిగిలిన 11 నియోజకవర్గాలు జనరల్ వే. అయితే ఈ 11 నియోజకవర్గాల్లో ఒక్క కుప్పంలో మాత్రం బీసీ అభ్యర్థిని బరిలోకి దించనున్నారు జగన్. గత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు పై పోటీ చేసిన చంద్రమౌళినే తిరిగి నిలబెట్టాలని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే ఇక్కడే సామాజిక సమీకరణాలు వైసీపీ అధినేతకి తలనొప్పిగా మారాయి.


కుప్పం మినహాయిస్తే మిగిలిన పది నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలు పోటీలో ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి నుంచి రోజా, శ్రీకాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గం నుంచి దేశాయి తిప్పారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ద్వారకా నాధరెడ్డి పేర్లకు జగన్ టిక్ పెట్టేశారు. వీరంతా రేపటి ఎన్నికల్లో బరిలో ఉండనున్నారు. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లోనూ రెడ్డి సామాజిక వర్గ నేతలకే అనివార్యంగా టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి జగన్ కి ఇబ్బందికరంగా మారింది.


ఇక మిగిలింది రెండే నియోజకవర్గాలు. వాటిలో చిత్తూరు, పలమనేరు ఉన్నాయి. చిత్తూరు విషయానికొస్తే అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగాలపల్లి శ్రీనివాసులు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈయన బలిజ సామాజికవర్గానికి చెందిన నేత. అయితే చిత్తూరులో పోటీ చేయడానికి సీకేబాబు రెడీ అంటున్నారు. ఆయన తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ కు అత్యంత సన్నిహితుడైన సీకే బాబు (జయచంద్రారెడ్డి) పార్టీలో చేర్చుకోవాలని జగన్ కు ఉన్నా, ఆ సీటుకూడా రెడ్డి సామాజికవర్గానికి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆలోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక పలమనేరు విషయానికొస్తే అక్కడ సినీ నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు వెంకటేష్ గౌడ్ కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. రాకేష్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ సుముఖంగా లేకపోవడానికి కారణం సామాజికవర్గమే అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలో సామాజికవర్గాల సమతుల్యాన్ని పాటించాలని జగన్ ఎంతగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదంటున్నారు. ఇప్పటివరకూ మాత్రం చిత్తూరుజిల్లాలో ఎనిమిది మందికి టిక్కెట్లు ఫైనల్ చేశారు వైసీపీ అధినేత.