Home News

అధినేత సొంత జిల్లాలో కుదేలైన కేడర్…!

SHARE

చిత్తూరు జిల్లా టిడిపి నేతల ఉదాసీనత తెలుగుతమ్ముళ్లకు మింగుడుపడటం లేదు .. జిల్లాలో చురుకైన టీడీపీ కార్యకర్తలకు బెదిరింపులు ఎదురైనా, దాడులు జరుగుతున్నా .. ఎవరు పట్టించుకున్న పాపానపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .. ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన అస్త్రసన్యాసం చేసినట్లు.. కార్యకర్తలను గాలికొదిలేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు… పరిస్థితి ఇలానే ఉంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధులు కూడా దొరికే పరిస్థితి ఉండదన్న టాక్‌ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది..

చిత్తూరు జిల్లా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా… అలాంటి జిల్లాలో 14 అసెంబ్లీ స్ధానాలకు గాను కేవలం ఓక్క టిడిపి అధినేత ప్రాతినిత్యం వహించే కుప్పం మినహా 13 స్ధానాల్లోను టిడిపి ఓటమి పాలైంది … అప్పటి నుంచి జిల్లా సీనియర్ నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు … జిల్లా టిడిపి యంత్రాంగాన్ని చూస్తే అవసరానికి మించి మౌనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నాయి.. కారణాలు ఏమైతేనేం కాని .. నేతలు జనంలో కనపడటం లేదు సరికదా ..కనీసం శ్రేణులకు స్థైర్యమిచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు.

జిల్లా నేతల వ్యవహారశైలితో పార్టీ శ్రేణులకు వారిపై నమ్మకం పోతున్నట్లు కనిపిస్తోంది .. బాబు కుప్పం పర్యటన తర్వాతైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావించిన తమ్ముళ్లకు నిరాశే మిగిలింది.. ఏదేమైనా తాజా ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీ చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది… 2004-14 మధ్య పదేళ్ళ పాటు అధికారంలో లేనపుడు కూడా జిల్లా టీడీపీ శ్రేణులు ఇంతగా డీలా పడలేదంటున్నారు… అప్పటి అధికార పక్షాన్ని ధాటిగా, దీటుగా పార్టీ వర్గాలు ఎదుర్కొన్నాయి…

ఫలితాలు వెలువడిన నాటి నుంచి .. నియోజకవర్గస్దాయిలో చురుగ్గా ఉండే టీడీపీ కార్యకర్తలకు, గ్రామ, మండల స్థాయి నాయకులకు ప్రత్యర్థుల నుంచీ బెదిరింపులు ఎదురవుతున్నాయి … నేరుగా ఫోన్‌ చేసి బెదిరించి గ్రామాల్లో అడుగుపెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని జిల్లా తమ్ముళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు … ఆ బెదిరింపులకు భయపడి పలువురు నిజంగానే ఊళ్ళు విడిచిపెట్టారని పార్టీలో టాక్ నడుస్తోంది … ప్రత్యర్థుల బెదిరింపులకు సంబంధించి సాంకేతికంగా స్పష్టమైన ఆధారాలున్నా … కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా వారు జంకే పరిస్థితి నెలకొందని .. జిల్లా సీనియర్ నేతలు అండగా ఉంటారనుకుంటే నిరాశే మిగులుతోందని క్యాడర్‌ వాపోతోంది…

జిల్లాలోని ఎర్రావారిపాళ్యంలో టీడీపీ సానుభూతిపరుడైన ఎన్‌ఆర్‌ఐ అబ్దుల్‌ అలీకి చెందిన పల్ప్‌ ఫ్యాక్టరీ గోడలను ప్రత్యర్థులు జేసీబీలు పెట్టి కూల్చివేయించారు … అది జరిగినపుడు జిల్లా నేతలు ఎవరూ కనీసం పరామర్శించకపోవడం, తామున్నామని ధైర్యం చెప్పకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నానీ మాత్రం వెళ్లి అబ్దుల్‌ అలీని కలసివచ్చారు… పలమనేరు మండలం ఊసరపెంటలో ఇటీవల పరువు హత్య జరిగినప్పుడు .. అధికార పార్టీ నేతలతో సహా ప్రజా సంఘాల, కుల సంఘాల నేతలు బాధితులను పరామర్శించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు… అయితే టిడిపి నేతలెవరూ సీన్‌లో కనిపించలేదు ..

స్ధానిక నేతలు తమ ఫోన్ కూడా ఎత్తడం లేదంటూ కొందరు కన్నీరు పెట్టుకుంటున్నారు…రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు వద్ద తమ పరిస్థితిని కార్యకర్తలు వివరించారు … టిటిడి ఎమ్మెల్సీ, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు వ్యవహారాలు చూసే మనోహర్ కూడా కేడర్‌ను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు గోడు విన్నచంద్రబాబు సైతం నేతలకు గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం … కార్యకర్తలకు అండగా నిలవని వారిని ఇక పార్టీ సైతం పట్టించుకోదని ఆయన స్పష్టం చేశారంట.. అయితే అధినేత స్వయంగా వచ్చి .. అంతలా చెప్పిన జిల్లా నేతల్లో మాత్రం మార్పు రాలేదని కేడర్‌ వాపోతోంది..

పరిస్థితి ఇలానే ఉంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నాటికి బరిలో నిలబడేది లేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఓపెన్‌గానే చెప్తున్నారు .. మరి చూడాలి అధిష్టానం ఎలా స్పందిస్తుందో?