Home News Stories

చిగురుపాటి కేసుతో పొలిటికల్ హీటు…ఏపీ అసెంబ్లీలో గుసగుసలు…!

SHARE

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గ్గా మారింది. ఈ హత్య గురించి పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏపీలో రాజకీయంగా ఇటీవల జరిగిన పరిణామాలకు.. ఈ హత్య కేసు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలకు చాలా పొలికలు ఉన్నాయంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇంతకీ జయరామ్‌ హత్యకు.. ఆ తర్వాత పరిణామాలకు.. రాజకీయాలకు సంబంధం ఏమిటీ..? ఈ హత్య కేసు రాజకీయ వర్గాల్లోనూ ఎందుకు హాట్ టాపిక్‌గ్గా మారింది..?

గత నాలుగైదు రోజుల నుంచి చిగురుపాటి హత్య కేసు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త కావడం.. అదీ మిస్టీరియస్ డెత్ కావడం.. ఆ హత్యలో కూడా బంధువులు.. మేనకోడలు ఉన్నారంటూ తెగ ప్రచారం జరగడంతో అందరూ ఆ కేసు విషయంలో సహజంగానే ఆసక్తిని కనబరిచారు. ఇదే క్రమంలో ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌ కూడా ఈ మిస్టీరియస్ డెత్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హత్య ఎలా చేశారు..? ఎవరు చేశారు..? అనే విషయానికంటే.. పక్క రాష్ట్రం నుంచి జయరామ్‌ మృతదేహాన్ని ఏపీ బోర్డరులో పడేయడం.. ఆ తర్వాత జరిగిన సంఘటనలపై అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. చివరికి ఇక్కడ కూడా పొరుగు రాష్ట్రం పంచాయతీ తప్పలేదా..? అనే చర్చ ఒకటైతే.. ఏపీ పోలీసుల విషయంలో వచ్చిన ఆరోపణలు మరో కోణం అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు.

చిగురుపాటి జయరామ్ హత్య కేసును ఏపీ పోలీసులను నీరుగారుస్తున్నారనేది జయరామ్ భార్య పద్మశ్రీ వాదన. ఏపీ పోలీసులను శ్రీకా చౌదరి మేనేజ్ చేశారని.. తెలంగాణ పోలీసులతోనే కేసు ఇన్వేస్టిగేషన్‌ చేయాలని కోరుతూ తెలంగాణ పోలీసులను పద్మశ్రీ కోరారు. ఇప్పుడిదే అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఏపీ పోలీసులపై నమ్మకం లేదనే వాదనను గత కొన్ని రోజులుగా ప్రధాన ప్రతిపక్షం పదే పదే చెప్పుకుంటూ వస్తోంది. ఏపీ పోలీసులను.. ఏపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం కేసు మొదలుకుని.. తాజాగా షర్మిళ పై అసభ్య పోస్టింగుల విషయం వరకు ఏపీ పోలీసుల పై నమ్మకం లేదనే వాదననే వినిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తన విమర్శలను అదే పనిగా కంటిన్యూ చేస్తూ వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు జయరామ్ హత్య కేసులో కూడా ఇదే తరహా వాదనను జయరామ్‌ భార్య పద్మశ్రీ తెర మీదకు తీసుకురావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు అధికార పార్టీ నేతలు.

జయరామ్‌ హత్య తర్వాత జరిగిన ఘటనల విషయంలో కానీ.. నిందితుడు రాకేష్‌ రెడ్డికి సహకరించిన వ్యవహరంలో కానీ తెలంగాణ పోలీసులదే కీలక పాత్ర ఉందనే విషయాన్ని అందరూ మరిచిపోతున్నారనేది సదురు నేతల వాదన. హత్య తర్వాత రాకేష్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి.. పక్క రాష్ట్రంలో మృతదేహాన్ని తెలివిగా వదిలేయాలనే సలహా ఇచ్చిందే సదురు తెలంగాణ పోలీసులనే విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాన్ని బయట పెట్టింది కూడా ఏపీ పోలీసులే కదా అంటున్నారు. జయరామ్ హత్య కేసులో షికా చౌదరి పాత్ర ఉందా..? లేదా..? అనే విషయాన్ని కచ్చితంగా తేల్చాల్సిందేనని.. అయితే ఈ మధ్యలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. ఏపీ పోలీసులు మేనేజ్‌ అయ్యారనే కామెంట్లు వచ్చాయంటే దానికి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలే కారణమనేది నేతల వాదన.

ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలని అంటున్నారు సదురు నేతలు. ఎవరో ఒకరో.. ఇద్దరో చేస్తే.. దాన్ని మొత్తం పోలీసు వ్యవస్థకు ఆపాదించడం సరికాదని.. తెలంగాణలో కూడా ఒకరిద్దరు పోలీసులు తప్పు దారి పడితే.. మొత్తం ఆ రాష్ట్ర పోలీసు వ్యవస్థను తప్పు పట్టడం కూడా సమజసం కాదంటున్నారు. వ్యవస్థలపై నమ్మకం కొల్పోకుండా ఉండేలా రాజకీయ పక్షాలు విమర్శలు చేసే ముందు ఆచి తూచి వ్యవహరిస్తే బాగుందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.