Home News Stories

ఏడుకొండ‌ల‌కి టెండ‌రేశారా?

పురావ‌స్తు సంప‌ద‌ని లాగేసుకుంటారా?

ఎన్డీఏ నుంచి బ‌య‌టికొచ్చిన‌ప్ప‌ట్నించీ మ‌మ్మ‌ల్ని టార్గెట్ చేస్తారు, వేధిస్తారంటూ ముందే భుజాలు త‌డుముకోవ‌డం మొద‌లుపెట్టారు ఏపీ సీఎం చంద్ర‌బాబు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని లోలోప‌ల ఆందోళ‌న ప‌డుతూనే అంద‌రినీ టెన్ష‌న్ పెట్టేస్తున్నారు. ఓ ద‌శ‌లో త‌న చుట్టూ ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలిచి కాపాడుకోవాల‌ని చెబుతూనే..మ‌రీ ఫియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోయింద‌న్న చ‌ర్చ జ‌ర‌గ‌టంతో త‌న‌ను కాద‌ని రాష్ట్రాన్ని కాపాడుకోవాల‌ని చెప్పాన‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. చంద్ర‌బాబుని నేరుగా ఏమ‌న్నా చేసే సంగ‌తేమోగానీ…నాలుగువైపుల‌నుంచీ ముందు ఉక్కిరిబిక్కిరి చేసేసి నిరాయుధుడిగా నిల‌బెట్టాల‌నే టార్గెట్‌తో కేంద్రం ఉన్న‌ట్లే క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కున్న అత్యంత ధ‌నిక ఆల‌యం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిపొందిన ఈ పుణ్యక్షేత్రంపై ఇప్ప‌టిదాకా స‌ర్వాధికారాలు రాష్ట్రానివే. సాక్షాత్తూ ప్ర‌ధాని వ‌చ్చినా, విదేశీ అధినేత‌లొచ్చినా రాష్ట్ర యంత్రాంగ‌మే మ‌ర్యాద‌ల‌న్నీ చూసుకుని ద‌గ్గ‌రుండి ద‌ర్శ‌నం చేయించి పంపుతోంది. దేవ‌స్థానం మంచీచెడ్డా చూసుకునే టీటీటీ బోర్డుని కూడా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నియమిస్తోంది. సొంత‌జిల్లాలో చంద్ర‌బాబుకి అత్యంత సెంటిమెంట్ దేవుడు కూడా ఆ వ‌డ్డీకాసులవాడే. అలాంటి ముక్కోటిని త‌న చేతుల్లో పెట్టుకునేందుకు కేంద్రం పెద్ద ఎత్తుగ‌డే వేసింది. డైరెక్ట‌ర్‌గా త‌నేం చేయ‌లేదు కాబ‌ట్టి పురావ‌స్తుశాఖ‌ను ముందుపెట్టింది.

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం స‌హా, దాని ప‌రిధిలోని అనుబంధ ఆల‌యాల‌న్ని కేంద్రం ప‌రిధిలోకి తీసుకునేందుకు పురావ‌స్తుశాఖ రంగంలోకి దిగింది. చారిత్ర‌క క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఈ ప్ర‌య‌త్నం జ‌రిగినా రాష్ట్ర ప్ర‌భుత్వం అర‌చిగోల‌పెట్ట‌టంతో అలాంటి ఆలోచ‌నేం లేదంటూ వెన‌క్కిత‌గ్గింది. కానీ ఎప్ప‌టికైనా అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడిని కేంద్రం ఎక్క‌డ త‌న గుప్పిట్లోకి తీసుకుంటుందోన‌న్న టెన్ష‌న్ అయితే చంద్ర‌బాబుకు ఉంది. అందుకే తిరుమ‌ల క్షేత్రం త‌మ చేతుల్లోంచి జారిపోకుండా అవ‌స‌ర‌మైతే కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చే ఆలోచ‌న‌తో టీడీపీ స‌ర్కారు ఉంది. వెంక‌న్న ద‌గ్గ‌ర్నించి మొద‌లైన ఆప‌రేష‌న్ బాబు ఇంకెన్ని కొత్త ట్విస్టులు ఇవ్వ‌బోతోందో?!