Home News Stories

బుట్టా పరిస్థితి ఇక అంతేనా…!

SHARE

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన జాబితాలో బుట్టా రేణుకకు చోటు దక్కలేదు. ఆమెకు ఒకే ఒక అవకాశం ఉందని భావిస్తున్న ఆదోని నియోజకవర్గం టిక్కెట్ ను కూడా చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఆదోని నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడి పేరు ఫైనల్ కావడంతో బుట్టా రేణుక పరిస్థితి ఇక అయోమయంలో పడింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 స్థానాలుంటే అందులో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఐదు నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్ లో ఉంచారు. వీటిలో నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు సిటీ, బనగానపల్లి, నంద్యాల నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచారు.

బుట్టా రేణుకకు కర్నూలు పార్లమెంటు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరింది. కోట్ల సుజాతమ్మకు ఆలూరు శాసనసభ స్థానాన్ని కేటాయించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి కర్నూలు ఎంపీ టిక్కెట్ కన్ఫర్మ్. అందులో డౌట్ లేదు. ఇప్పుడు తాజాగా ఆదోని నియోజకవర్గాన్ని కూడా భర్తీ చేయడంతో బుట్టా ఆశలు గల్లంతయినట్లే చెబుతున్నారు. బుట్టా రేణుక ఆదోని టిక్కెట్ కోసం గత కొద్ది రోజులుగా అమరావతిలోనే మకాం వేసి ఉన్నారు. అయితే అక్కడ మీనాక్షినాయుడు బలమైన నేతగా ఉండటం, జిల్లాలో ఉన్న ఏకైక కమ్మ సామాజిక వర్గంనేతను పక్కన పెట్టడం భావ్యం కాదని భావించడంతో బుట్టాకు సీటు గల్లంతయ్యింది.

ఇక పెండింగ్ లో ఉన్న ఐదు స్థానాల్లో నంద్యాల బుట్టాకు ఇచ్చేఛాన్సు లేదు. బనగానపల్లి కూడా అంతే. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఉన్నారు. కోడుమూరు, నందికొట్కూరు రిజర్వడ్ నియోజకవర్గాలు ఇక మిగిలింది ఒక్కటే నియోజకవర్గం. అదే కర్నూలు టౌన్ నియోజకవర్గం. ఇక్కడ కూడా వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు టిక్కెట్ ఇస్తే ఊరుకోమని, తమకే టిక్కెట్ కావాలంటున్నారు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కు టిక్కెట్ కోసం ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.

కానీ చివరి నిమిషంలో ఇటు టీజీ వెంకటేష్, అటు ఎస్వీ మోహన్ రెడ్డిలను కాదని మధ్యే మార్గంగా బుట్టా రేణుకకు అవకాశమిస్తారా?అనేది చూడాలి. ఎందుకంటే ఎస్వీ మోహన్ రెడ్డికి కర్నూలు టిక్కెట్ ఇస్తే టీజీ కుటుంబం పార్టీని వీడే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టీజీకుటుంబానికి టిక్కెట్ ఇస్తే సహకరించే అవకాశం ఉండనే ఉండదు. దీంతో బుట్టా రేణుకకు కర్నూలు టౌన్ నియోజకవర్గం తప్ప ఎక్కడా అవకాశం లేనట్లే. కర్నూలు ఎంపీగా ఆమె పనిచేయడంతో టౌన్ తో మంచి సంబంధాలు ఉండటంతో ఆమెను ఎంపిక చేయవచ్చన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కర్నూలు టౌన్ మిస్ అయితే ఇక బుట్టాకు టిక్కెట్ లేనట్లే.